మూవీ రివ్యూ : 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'

Update: 2018-11-08 09:06 GMT
‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ రివ్యూ

నటీనటులు: ఆమిర్ ఖాన్ - అమితాబ్ బచ్చన్ - ఫాతిమా సనా షేక్ - కత్రినా కైఫ్ - రోనిత్ రాయ్ తదితరులు
సంగీతం: అజయ్-అతుల్
నేపథ్య సంగీతం: జాన్ స్టివార్ట్
ఛాయాగ్రహణం: మనుష్ నందన్
నిర్మాత: ఆదిత్య చోప్రా
రచన-దర్శకత్వం: విజయ్ కృష్ణ ఆచార్య

ఆమిర్ ఖాన్ సినిమా అంటే భారతీయ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిందే. అలాంటి హీరోకు నిన్నటితరం మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ జత కలవడంతో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిత్య చోప్రా నిర్మాణంలో విజయ్ కృష్ణ ఆచార్య రూపొందించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.

కథ:

బ్రిటిష్ వాళ్లు దేశాన్ని కబళించేస్తున్న సమయంలో ఒక సంస్థానాధిపతి వాళ్లకు ఎదురు నిలుస్తాడు. ఐతే ఓ బ్రిటిష్ అధికారి కుట్ర పూరితంగా అతడిని మట్టుపెట్టి తన సంస్థానాన్ని చేజిక్కించుకుంటాడు. ఐతే ఆ సంస్థానాధిపతి కూతురిని కాపాడిన సేనాధిపతి ఖుదాభక్ష్ (అమితాబ్ బచ్చన్).. బ్రిటిష్ వాళ్ల మీద పగతో రగిలిపోతుంటాడు. వారి స్థావరాల మీద దాడి చేస్తుంటాడు. ఖుదా భక్ష్ ధాటికి తట్టుకోలేక పోయిన బ్రిటిష్ వాళ్లు.. అతడిని దెబ్బ తీయడానికి ఫిరంగి (ఆమిర్ ఖాన్) అనే మాయల మరాఠీని రంగంలోకి దించుతాడు. నమ్మిన బంటులా ఖుదాభక్ష్ చెంతకు చేరిన ఫిరంగి.. అతడిని బ్రిటిష్ వాళ్లకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. కానీ తర్వాత అతడిలో అంతర్మథనం మొదలవుతుంది. ఈ స్థితిలో అతనేం చేశాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

మెరిసేవన్నీ బంగారం కాదని ఒక సామెత. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ఇందుకు ఒక ఉదాహరణ. అమీర్ ఖాన్.. అమితాబ్ బచ్చన్ ల కాంబినేషన్.. ‘ధూమ్’ రచయిత విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం.. యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా నిర్మాణం.. వీటన్నింటికీ మించి భారీతనంతో కూడుకున్న థియేట్రికల్ ట్రైలర్.. ఇవన్నీ చూసి ఎంతో ఊహించుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు.. ఉస్సూరుమంటూ బయటికి రావడం ఖాయం. కేవలం భారీతనం.. పైపై మెరుగులు మాత్రమే ఏ చిత్రాన్నీ నిలబెట్టవు. ‘బాహుబలి’ సంచలనాలకు కేవలం ఆ భారీతనం మాత్రమే కారణం కాదు. ప్రేక్షకుల్ని కట్టిపడేసే కథాకథనాలు.. పాత్రలు.. ఎమోషన్లు.. వీటన్నంటికీ భారీతనం అన్నది అదనపు ఆకర్షణగా నిలిచింది. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో అవే మిస్సయ్యాయి. అక్కడక్కడా కొన్ని యాక్షన్ ఘట్టాల్ని మినహాయిస్తే ఇందులో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు.

రెండు శతాబ్దాల కిందటి.. బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో వచ్చిన ఒక నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి ఇందులో బలమైన.. ఇంతవరకూ చూడని.. మరుగున పడ్డ కథేదో చూడబోతున్నామన్న అంచనా కలుగుతుంది సాధారణంగా. కానీ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ఒక సగటు రివెంజ్ స్టోరీ కావడం నిరాశ కలిగించే విషయం. బ్రిటిష్ వారి అరాచకాలు.. స్వాతంత్ర్య పోరాటం అంటూ ఊరికే అలా టచ్ చేసి వదిలిపెట్టారు తప్పితే..  సినిమాలో దానికి సంబంధించిన ఎమోషన్ ఏమీ ఉండదు. బ్రిటిష్ వాళ్లు ఒక రాజును చంపి సంస్థానాన్ని చేజిక్కించుకుంటే.. అతడి కూతురు పెరిగి పెద్దదై తనకు అన్యాయం చేసిన బ్రిటిష్ అధికారిపై ప్రతీకారం తీర్చుకుని తిరిగి రాజ్యాన్ని చేజిక్కించుకోవడమే ఈ కథ. సినిమాలో భారీతనం ఉంది తప్ప.. కథలో అది లేదు. ఇది చాలా చిన్న స్థాయి కథలా అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్.. ఆమిర్ ఖాన్ స్థాయి నటులకు తగ్గ పాత్రల్లేవు ఇందులో. వీళ్ల పాత్రల్ని ఆరంభంలో చూసి ఏదో ఊహించుకుంటాం. కానీ తర్వాత పాత్రల్లాగే ప్రేక్షకులూ చల్లబడిపోతారు.

అమితాబ్ బచ్చన్ ను ఇందులో పెద్ద పోరాట యోధుడిగా చూపించారు. ఆయన వీర లెవెల్లో ఫైట్లు చేస్తారు. కానీ 70 ఏళ్ల పైబడ్డ అమితాబ్ అలాంటి పోరాటాలు చేయలేడన్నది స్పష్టం. అమితాబ్ ముఖం.. ఆయన హావభావాలేమీ కనిపించనట్లుగా గుబురు గడ్డం.. భారీ కాస్ట్యూమ్స్ తో మేకప్ వేశారు. దీనికి తోడు ఫైట్లన్నీ డూప్ ను పెట్టే మేనేజ్ చేశారు. ఇక అక్కడ అమితాబ్ ఉన్న ఫీలింగ్ ఎవరికైనా ఎందుకు కలుగుతుంది? ఈ రకంగా అమితాబ్ నటనను చూద్దామని థియేటర్లకు వెళ్లినవాళ్లకు తీవ్ర నిరాశ తప్పదు. ఇక ఆమిర్ ఖాన్ పాత్రయినా ప్రత్యేకంగా ఏమైనా ఉందా అంటే అదీ లేదు. కథ లాగే అతడి క్యారెక్టర్ కూడా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. జిత్తులమారి ఫిరంగిగా ఆమిర్ బాగానే చేశాడు కానీ.. అతడి పాత్ర అంత ఆసక్తికరంగా లేకపోయింది. దర్శకుడు అతడి పాత్ర భలే చమత్కారంగా.. అంతుచిక్కని విధంగా ఉందని అనుకుని ఉండొచ్చు కానీ.. ఆ పాత్ర తాలూకు మర్మాన్ని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఆమిర్ పాత్రతో వినోదం పండించడానికి చేసిన ప్రయత్నం కూడా పెద్దగా ఫలించలేదు.

‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో అతి పెద్ద విశేషం ఏంటంటే.. 200 ఏళ్ల కిందటి నేపథ్యాన్ని కళ్లకు కడుతూ వేసి సెట్టింగ్స్.. యాక్షన్ ఎపిసోడ్లు. ముఖ్యంగా ఓడ సెట్టింగ్స్.. వాటిలో జరిగే పోరాటాలు ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. సముద్రం.. ఓడలు.. ఈ వ్యవహారమంతా చూస్తే కొన్ని చోట్ల ‘పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్’ గుర్తుకొస్తుంది. ఐతే మొదట్లో థ్రిల్లింగ్ గా అనిపించే ఓడ ఫైట్లు.. తర్వాత రిపీటెడ్ గా అనిపిస్తాయి. అయినప్పటికీ యాక్షన్ ఘట్టాలే కొంత వరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తూ వెళ్తాయి. కథాకథనాలు మాత్రం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే సాగుతూ పోవడం.. ఒక దశ దాటాక తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తే లేకపోవడంతో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ గ్రాఫ్ క్రమంగా పడిపోతుంది. ప్రి క్లైమాక్స్ కు వచ్చేసరికి ప్రేక్షకుల సహనానికి పరీక్ష ఎదురవుతుంది. ముగింపులోనూ యాక్షన్ ఘట్టం తప్పితే ఆకట్టుకునే అంశాలేమీ లేవు. మొత్తంగా ఒక అరుదైన కాంబినేషన్ తో వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. మిగతా వాళ్ల సంగతేమో కానీ.. ఆమిర్ ఖాన్ నుంచి ఇలాంటి సినిమాను అస్సలు ఊహించం. ఎప్పుడూ కథనే నమ్మే ఆమిర్.. ఈసారి అదనపు హంగుల్ని నమ్ముకుని ప్రేక్షకుల నమ్మకాన్ని దెబ్బ తీసుకున్నాడు.

నటీనటులు:

ఆమిర్ ఖాన్ ఎప్పట్లాగే సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. తన పాత్ర ఎలా ఉన్నప్పటికీ అతను నటనతో మెప్పించాడు. ఊసరవెల్లి తరహా ఫిరంగి పాత్రను మెప్పించాడు. ఆ పాత్రకు రాసిన డైలాగులు సాగతీతగా ఉండటం.. పైగా అవి డబ్బింగ్ లోకి వచ్చేసరికి ఇంకా ఘోరంగా తయారవడంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతారు. అమితాబ్ బచ్చన్ పాత్ర నిరాశ పరుస్తుంది. ఆయన తన ప్రత్యేకతను చూపించడానికి అవకాశమే ఇవ్వలేదు ఈ క్యారెక్టర్. అమితాబ్ స్టేచర్ వల్ల ఆ పాత్ర కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది తప్ప.. అది అనుకున్న స్థాయిలో పండలేదు. ఫాతిమా సనా షేక్ కీలకమైన పాత్రలో ఆకట్టుకుంది. ఆమె నటనలో ఇంటెన్సిటీ కనిపిస్తుంది. కత్రినా కైఫ్ రెండు పాటల్లో అందాల విందు చేసింది. నటన పరంగా చెప్పుకోవడానికేమీ లేదు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

అజయ్-అతుల్ పాటలు హిందీలో ఎలా ఉన్నాయో కానీ.. డబ్బింగ్ లో మాత్రం వినసొంపుగా అనిపించవు. జాన్ స్టివార్ట్ నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచింది. యాక్షన్ ఎపిసోడ్లు.. కథకు కీలకమైన సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మనుష్ నందన్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. సినిమాకు తగ్గట్లుగా కెమెరా పనితనంలో భారీతనం కనిపిస్తుంది. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్థాయికి తగ్గట్లే భారీగా ఖర్చు పెట్టారు. కానీ ఆ ఖర్చుకు సినిమా న్యాయం చేయలేదు. దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ఏం ప్రత్యేకత ఉందని ఈ నవలను ఎంచుకున్నాడో తెలియదు. నవలగా అది ఎలా ఉందో కానీ.. సినిమాగా మాత్రం సాధారణంగా అనిపిస్తుంది. దర్శకత్వ లోపమే సినిమాకు ప్రతికూలంగా మారింది.

చివరగా: థగ్స్ ఆఫ్ హిందుస్థాన్.. పైపై మెరుగులే

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News