RRR కు ఏపీలో టికెట్ రేట్ పెంపు.. ₹ 100 కాదు ₹ 75 మాత్రమే..!

Update: 2022-03-17 14:47 GMT
ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రణం రుధిరం) రిలీజ్ కు రెడీ అయింది. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాన్ని అత్యధిక స్క్రీన్ లలో ప్రదర్శించబోతున్నారు.

విడుదలకు ముందు RRR చిత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సూపర్ హై బడ్జెట్ తో తెరకెక్కిన 'రౌద్రం రణం రుధిరం' చిత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్ లలో మొదటి పది రోజులు టికెట్ ధరలు పెంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెం.13 ప్రకారం నిర్ణయించిన రేట్లపై అదనంగా రూ. 75 పెంచుకోవచ్చని అందులో పేర్కొంది.

ఏపీలో సినిమా టికెట్స్ రేట్లను ఫిక్స్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. రెమ్యూనరేషన్స్ మినహాయించి మూవీ బడ్జెట్ రూ. 100 కోట్లు దాటితే సినిమా టికెట్స్ పెంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి - నిర్మాత డీవీవీ దానయ్య ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి టికెట్ రేట్లు, ఇతర అంశాలపై చర్చించారు.

దీనిపై కూలంకషంగా చర్చించిన ఏపీ ప్రభుత్వం.. 'RRR' చిత్రాన్ని ప్రత్యేకంగా పరిగణించింది. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడిన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని.. టికెట్ రేట్ల పెంపును పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 'ఆర్ ఆర్ ఆర్' కు రూ.336 కోట్ల బడ్జెట్ అయినట్లు నిర్మాతలు వివరాలిచ్చారని.. ప్రజలపై భారం కాకుండా టికెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

ఇప్పటికే టికెట్ రేట్లు, అదనపు షోలపై చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారని.. కమిటీ పరిశీలనల అనంతరం టికెట్ రేట్లు పెంచుకోవావడానికి వెసులుబాటు కల్పిస్తామన్నారు. జీఎస్టీ మరియు ఇతరత్రా శాఖలు పరిశీలంచిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని.. ఆ తర్వాత టికెట్ ధరను ఫిక్స్ చేస్తామని పేర్ని నాని తెలిపారు.

ఈ క్రమంలో RRR చిత్రానికి టికెట్ ధర రూ. 75 పెంచుకోవచ్చని జగన్ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 25 నుంచి పది రోజులపాటు ఈ ప్రత్యేక ధరలు ఉంటాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు - జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

అయితే ఇప్పటి వరకు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి ప్రతి టికెట్ మీద 100 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 75 రూపాయలకే పరిమితం చేసింది. అయినప్పటికీ ఆంధ్రాలో సినిమా భారీ వసూళ్ళు రాబట్టడానికి ఇది హెల్ప్ అవుతుంది.  

ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.13 ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మల్టీఫ్లెక్స్ లలో గరిష్టంగా టికెట్ రేటు రూ. 250 ఉంది. ఇప్పుడు రూ.  75 రేటు పెంచుకోడానికి అనుమతివ్వడంతో.. ప్రత్యేక టికెట్ ధర 325 రూపాయల వరకూ ఉండే అవకాశం ఉంది.

కాగా, ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటించిన RRR సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథాంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందించారు. రామరాజుగా చరణ్.. భీమ్ గా తారక్ కనిపించనున్నారు.

ఇందులో అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరిస్ - సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో RRR మూవీ విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. రాబోయే 7 రోజుల్లో దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేశారు.
Tags:    

Similar News