శ‌నివారంతో మొద‌లైన విషాదం సాగుతోందే..

Update: 2017-03-14 16:34 GMT
ఎప్పుడూ లేని విధంగా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గ‌డిచిన నాలుగు రోజులుగా తెలుగోళ్ల‌కు మృత్యుదేవ‌త ఇస్తున్న షాకులు అన్నిఇన్ని కావు. కేవ‌లం నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో ముగ్గురు ప్ర‌ముఖ కుటుంబాల‌కు చెందిన వారు మ‌ర‌ణించ‌టం తెలుగోళ్ల‌ను క‌లిచివేసేలా చేస్తోంది. ఈ ముగ్గురి మ‌ర‌ణాలు ఆక‌స్మికంగా చోటు చేసుకోవ‌ట‌మే కాదు.. ఊహకు అంద‌ని రీతిలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

శ‌నివారంతో మొద‌లైన చావు విషాదాలు అదే ప‌నిగా సా..గుతున్నాయి. వ‌రుస‌గా చోటు చేసుకుంటున్న ఆక‌స్మిక మ‌ర‌ణాల‌తో తెలుగువారి గుండెలో శోకంతో త‌ల్లడిల్లుతున్నాయి. శ‌నివారం ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌తీమ‌ణి అనిత ఆక‌స్మిక మ‌ర‌ణం ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. భ‌ర్త దేశం కాని దేశంలో షూటింగ్ ప‌నుల్లో ఉన్న వేళ‌.. గుండె నొప్పితో కుప్ప‌కూలిన అనిత‌.. ఆసుప‌త్రిలో మ‌ర‌ణించారు.

ఆ వార్త‌.. సినీ వ‌ర్గాల‌తో పాటు.. సామాన్యుల‌కు షాకింగ్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఊహించ‌ని రీతిలో తెలుగోళ్ల‌కు సుప‌రిచితుడైన భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణం ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. క‌ర్నూలు జిల్లాలోని నంద్యాల‌.. ఆళ్ల‌గ‌డ్డ.. కోయిల‌కుంట్ల ప్రాంత ప్ర‌జ‌లు అమితంగా ఆరాధించే భూమానాగిరెడ్డి మ‌ర‌ణం.. అక్క‌డి వారిని శోకంతో సొమ్మ‌సిల్లేలా చేసింది. ఆదివారం ఉద‌యం ఇంట్లో పేప‌ర్ చ‌దువుతూ కుప్ప‌కూలిపోయిన ఆయ‌న్ను హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించినా.. ఫ‌లితం లేక‌పోయింది.

భూమా నాగిరెడ్డి మ‌ర‌ణాన్ని తెలుగోళ్లు జీర్ణించుకోలేక‌పోయార‌ని చెప్పాలి. మూడేళ్ల కింద‌ట సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొని తిరిగి వ‌స్తున్న వేళ జ‌రిగిన‌.. కారు యాక్సిడెంట్ లో భూమా నాగిరెడ్డి స‌తీమ‌ణి శోభానాగిరెడ్డి మ‌ర‌ణించ‌టం వైనాన్ని పూర్తిగా మ‌ర్చిపోక ముందే.. ఆ ఇంట్లో చోటు చేసుకున్న విషాదం అంద‌రిని క‌దిలించివేసింది.

ఈ రెండు వ‌రుస విషాదాలు గ‌డిచి ఒక్క రోజు అయ్యిందో లేదో.. ప్ర‌ముఖ సినీ న‌టి జ‌య‌సుధ భ‌ర్త నితిన్ క‌పూర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టంతో తెలుగువారికి మృత్యుదేవ‌తో మ‌రోసారి షాకిచ్చింది. నిజానికి నితిన్ క‌పూర్‌తో తెలుగోళ్ల‌కు అంత సంబంధం లేకున్నా.. జ‌య‌సుధ‌తో ఉన్న అనుబంధం ప‌క్కింటి ఆమె కంటే ఎక్కువ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఇలా.. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా చోటు చేసుకుంటున్న మ‌ర‌ణాలు తెలుగోళ్ల గుండెల్ని క‌లిచి వేస్తున్నాయ‌న‌టంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News