రివైండ్ 2015:దూరమైనా.. ఎప్పటికీ మాతోనే

Update: 2015-12-16 17:30 GMT
"జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితంనాది".. ప్రపంచం చాలా చిన్నది.. అందులో మనజీవితం అంతకన్నా చిన్నది.. మనకు తెలిసిన/ మనం ఆదరించిన లేక మనల్ని అలరించిన వారు ఈ లోకం నుండి దూరమైతే ఆ బాధ తీర్చలేనిది.. ఆ లోటు పూడ్చలేనిది. మన సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది కొన్ని అకాల మరణాలు చోటుచేసుకున్నాయి. వారిని ఒక్కసారి ఈ ఏడాదికి చివరిసారిగా స్మరించుకుందామా?

కోనసీమయాసలో నవ్విస్తూ... హఠాత్తుగా క్యాన్సర్ కి ఆహుతై..

విలన్ వేషాలతో ప్రసిద్ధిగాంచి ఆహుతి సినిమాతో బ్రేక్ సాధించుకున్న సహనటుడు ఆహుతి ప్రసాద్. ఈయన సెకండ్ ఇన్నింగ్స్ లో కామెడి మేళవించిన పాత్రలను పోషిస్తూ సంభాషణలకు తనదైన కోనసీమ యాస జోడిస్తూ ప్రశంసలు పొందారు. కృష్ణవంశీ చందమామ సినిమాలో నటనకు నంది అవార్డుని సైతం సొంతం చేసుకున్నారు. 57వ యేట క్యాన్సర్ కబలించడంతో తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు.

పాత్రలకు పాత్రోచితంగా పెన్ను కదిలించే పాత్రో... ఇక లేరు మనతో..

బాలచందర్ గారి మరో చరిత్ర సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసినదే. అయితే భాష ప్రధానంగా సాగే ఆ సినిమాకు చూడచక్కని మాటలను అందించి విమర్శకుల మెప్పుని పొందిన రచయిత గణేష్ పాత్రో.. చిరంజీవి రుద్రవీణ సినిమాకు సైతం ఆయనే మాటలందించారు. చివరిగా శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు మాటల సహాయం చేసిన పాత్రో 33 జనవరిలో తన 69వ ఏట కనుముశారు.

జగపతిని నటుడిగా, సంస్థగా ప్రసాదించిన ప్రసాద్

జగపతి ఆర్ట్స్ బ్యానర్ లో అలనాటి చిత్రాలన్నీ సూపర్ హిట్లే. వీ.బి రాజేంద్ర ప్రసాద్ గారు దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలకు పనిచేసి రెండు ఫిలిం ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. నిన్నటి తరం హీరో నేటి తరం విలన్ అయిన జగపతిబాబు ఈయన తనయుడే. శ్వాస సంభందిత అనారోగ్యం కారణంగా ఈయన జనవరిలో కనుమూశారు.

నవ్వించి నవ్వించి నారాయణుడిలో ఐక్యమైన నారాయణ...

ఎం.ఎస్ నారాయణ... కామెడి పాత్రలకు పోస్టల్ అడ్రెస్.. తాగుబోతు క్యారక్టర్ లకు ట్రేడ్ మార్క్... ప్రిన్సిపల్ పాత్రలకు పెట్టిందిపేరు. బ్రహ్మానందం తరువాత దాదాపు అన్ని సినిమాలలో నటించి ఎన్నో ఉత్తమహాస్యనటుడి పురస్కారాలను అందుకున్న తెలుగు ఉపాధ్యాయుడు. పిల్ల జమిందార్ లో ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు ఏడిపించిన నారాయణ గారు ఈ ఏడాది మొదట్లోనే మనలని విడిచి వెళ్ళిపోయారు. తెలుగు సినీ కామెడికి తీరని లోటు చేకూర్చారు.

మూవీ మొఘల్.. మూగబోయిన వేళ:

వంద నోటుపై ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లోనూ సినిమాలను తీయలనుకుని తపనపడ్డ నిర్మాత డా రామానాయుడు గారు. వివిధ భాషలలో దాదాపు 135 సినిమాలను నిర్మించిన ఆయన వారసులుగా వెంకటేష్ - సురేష్ బాబు లను మనకు అందించి ఫిబ్రవరిలో కన్నుమూశారు.

ఆనతి కాలంలోనే కీర్తి.. అంతలోనే మనసుని చిదిమేసిన ఆర్తి:

కెరీర్ లో తొలి అవకాశాలే పెద్ద పెద్ద హీరోల సరసన రావడంతో ఆర్తి అగర్వాల్ ఆనతికాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అయితే వ్యక్తిగత కారణాల వలన సినిమాలకు దూరమై ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి నిలదొక్కుకునే సమయంలో విధి కాటేసింది. లైపోసెక్షన్ సర్జరీ వికటించడంతో జూన్ లో ఈ అందాలతార కన్నుమూసింది.

తెలుగు వాళ్లకి దూరమైన సం'పూర్ణ'మైన నిర్మాత..

తన సినిమాలు హాల్ టైం హిట్లుగా కాకుండా ఆల్ టైం క్లాసిక్స్ గా నిలవాలని కమర్షియల్ - ఎంటర్ టైన్ మెంట్ పదాలకు దూరంగా వుంటూ కాన్సెప్ట్ - క్రియేటివ్ పదాలతో చెలిమి చేసిన న్రిమాట ఏడిద నాగేశ్వరరావు గారు. పూర్ణోదయ క్రియేషన్స్ పై వారు నిర్మించిన అన్ని చిత్రాలూ ఆణిముత్యాలే. ఒకే ఏడాది మన కళామతల్లి ఇద్దరు ప్రముఖ నిర్మాతలను కోల్పోయింది.

నవ్వించడమేకాదు ఏడిపించగలమని నిరువుపించిన కళ్ళు - మాడా - కొండవలస..

కళ్ళు చిదంబరం - మాడా వెంకటేశ్వరరావు - కొండవలస లక్ష్మణరావు.. వీరంతా స్వశక్తిపై పైకొచ్చి సినిమాలో తమకంటూ ఒక కామెడి ముద్ర వేయించుకోవడానికి తపన పడే నటులు. కామెడికి పగ్గం కట్టే మన తెలుగు సినిమా ఈ ముగ్గురు కమేడియన్లను వరుసగా అతి తక్కువ కాలంలో కోల్పోవడం అత్యంత బాధాకరం.

నిన్న అస్తమించినప్రముఖ రచయిత - దేవి శ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తిగారితోనైనా ఈ ఏడాదికి చెడు వార్తలు ఆగిపోవాలని ఆ భగవంతుణ్ణి మనఃస్పూర్తిగా ప్రార్ధిద్దాం.
Tags:    

Similar News