దిశ చట్టం.. స్పందించిన సినీ ప్రముఖులు

Update: 2019-12-15 06:58 GMT
ఏపీ సీఎం జగన్ ఓ మాట అన్నారు. దిశ చట్టాన్ని ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే సందర్భంగా ‘సినిమాల్లో రేప్ చేసినోళ్లను చంపితే చప్పట్లు కొడుతారని.. నిజజీవితంలో మాత్రం హక్కుల సంఘాలతో విచారణలు చేయిస్తారా?’ అంటూ వాపోయారు. రీల్ లైఫ్ కి, రియల్ లైఫ్ కు ఎందుకంత తేడా.. అంతా మనుషులే కదా అన్న ప్రశ్నను లేవనెత్తారు. అవును నిజమే.. సినిమాల్లో అయినా.. నిజజీవితంలో అయిన భావోద్వేగం ఒక్కటే. ప్రాణాలకు విలువే. అందుకే ఏపీలో మహిళల రక్షణకు జగన్ ‘దిశ చట్టం’ తెచ్చారు.

తెలంగాణలో కామాంధుల ఆకృత్యానికి బలైపోయిన దిశ ఉదంతం దేశాన్ని అట్టుడికించిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై సినీ రాజకీయ సామాన్యుల్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.  అయితే ఆ బాధను చూసిన జగన్ తెచ్చిన ‘దిశ చట్టం’ ఏపీ అసెంబ్లీలో అమలైంది. ఈ సందర్భంగా ఎంతో ధైర్యసాహసాలతో ఈ చట్టాన్ని అమలు చేసిన సీఎం జగన్ పై అంతటా ప్రశంసలు కురిస్తున్నాయి. సినీ ప్రముఖులు కూడా జగన్ నిర్ణయానికి హ్యాట్సాఫ్ అంటూ తాజాగా కొనియాడారు.

* దిశ చట్టం వల్ల నేరాలు తగ్గుతాయి: కృష్ణం రాజు

ఏపీలో దిశ చట్టం వల్ల నేరాలు తగ్గుతాయన్నారు రెబల్ స్టార్ కృష్ణం రాజు. 21 రోజుల్లోనే శిక్ష పడడం ఆహ్వానించదగ్గ విషయం. ఎన్కౌంటర్ చేయడం కోరుకోం. దిశ లాంటి ఘటనలు జరగాలని కోరుకోం. శిక్షలు వెంటనే పడితేనే నేరాలు తగ్గుతాయి. తల్లిదండ్రులు పిల్లలను పెంచే పద్ధతి బట్టే సమాజంలో మార్పు కనిపిస్తుందని కృష్ణం రాజు తెలిపారు.

* జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారు: వెంకటేశ్

ఈ బిల్లు తీసుకొచ్చి జగన్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని హీరో వెంకటేశ్ కొనియాడారు. ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. చాలా సంతోషం. స్త్రీలను గౌరవించాలి. వాళ్లను సేఫ్ గా ఉంచగలం. నేరాల్లో నిర్ణయం తీసుకోవడం కరెక్ట్. బిల్లును పాస్ చేసి మంచిపని చేశారు.

* హ్యాట్సాఫ్ టు జగన్ : పూరి జగన్నాథ్

ఏపీ సీఎం జగన్ తెచ్చిన దిశ చట్టం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని టాలీవుడ్ సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు. 90శాతం ఈ రేప్ లు మద్యం మత్తులో జరుగుతాయని.. మద్యాన్ని కంట్రోల్ చేసి జగన్ ను మెచ్చుకోవాలంటూ కొనియాడారు. రాష్ట్రానికి మద్యం వల్ల ఆదాయం తగ్గినా జగన్ లోని చిత్తశుద్ధిని అభినందిస్తున్నా హ్యాట్సాఫ్ టు జగన్ అని ప్రశంసలు కురిపించారు. ఆడవారిని బలహీనురాళ్లుగా స్ట్రాంగ్ ఉమెన్ గా పెంచాలని పూరి తల్లిదండ్రులకు సూచించారు. రేపిస్టుల అందరూ సాధారణ వారేనని.. అమ్మాయిల అమాయకత్వమే ఈ దారుణాలకు కారణం అని పూరి పేర్కొన్నారు.

*జీఎస్టీ కంటే ముందు దిశ చట్టం చేయాలి: నాగచైతన్య

జీఎస్టీ వంటి వాటిల్లో తొందరగా నిర్ణయాలు తీసుకొని ఆడవాళ్లపై అత్యాచారాలపై ఆలస్యం చేయడం ఏంటని హీరో నాగచైతన్య ప్రశ్నించారు. ఇలాంటి దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను.

* జగన్ ఇచ్చిన న్యూ ఇయర్ గిఫ్ట్ దిశ చట్టం: జయసుధ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన దిశ చట్టం న్యూ ఇయర్ గిఫ్ట్ ను మహిళలు - ప్రజలకు ఇచ్చిందని సీనియర్ నటి జయసుధ ప్రశంసించారు.. జగన్ ఈ నిర్ణయం తీసుకొని అందరు సీఎంలకు మార్గదర్శకుడయ్యారు.  21 రోజుల్లోనే న్యాయం చేస్తాననడం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆడవాళ్లకు దిశ బిల్లు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఎంత ఆనందపడ్డానో మాటల్లో చెప్పలేను. ఆరునెలల్లోనే జగన్ ఈ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు.. నాలుగున్నరేళ్లలో ఆయన పాలన ఎంత డైనమిక్ గా ఉండబోతుందో ఈ సంఘటన రుజువు చేస్తోంది. మిగతా సీఎంలు ఆడవాళ్లకు ఇలాంటి న్యాయమే చేయాలి.


Tags:    

Similar News