ఇప్పుడు తెలుగు సినిమా తారల మనసంతా చెన్నైపేనే లగ్నమైంది. రెండు మూడు రోజులుగా సినిమా పనులన్నీ పక్కనపెట్టి అక్కడ కురుస్తున్న వర్షాలు, ముంచెత్తుతున్న వరదల గురించి ఆన్‌లైన్ ద్వారా తెలుసుకుంటున్నారు. బాధితులకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. మన తెలుగు సినిమా రంగం ఒకప్పుడు చెన్నైలోనే ఉండేది. పలువురు కథానాయకులు చెన్నైలోనే పుట్టి పెరిగారు. ఇప్పటికీ ఆ నగరంతో నిత్యం సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తుంటారు. అందుకే చెన్నైకి ఏ కష్టం వచ్చినా మనవాళ్లు కదిలిపోతుంటారు. మన సినీ తారల బాల్యమంతా చెన్నైలోనే గడిచింది కాబట్టి అక్కడ ఇప్పటికీ స్నేహితులు ఉన్నారు. వాళ్లనుంచి చెన్నైలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. స్నేహితుల ద్వారానే సహాయ కార్యక్రమాలకి నడుం బిగిస్తున్నారు. సందీప్‌కిషన్ - వరుణ్ తేజ్ - సాయిధరమ్ తేజ్ తదితర కథానాయకుల స్నేహితులు ఇప్పటికే సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆహార పొట్లాలు - బట్టల్ని పంపిణీ చేస్తున్నారు. నటీనటులు సాంకేతిక నిపుణులు ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు హెల్ప్ లైన్ నెంబర్లని ట్వీట్ చేస్తూ సహాయ కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. చెన్నైలో వర్ష భీభత్సం ప్రభావం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ పై స్పష్టంగా కనిపిస్తోంది. పరిశ్రమలో కొనసాగుతున్న పలువురి బంధువులు ఇప్పటికీ చెన్నైలోనే ఉంటున్నారు. వాళ్ల యోగక్షేమాల్ని గంట గంటకి అడిగి తెలుసుకుంటున్నారు.