కంగారూల్ని కంగారెత్తిస్తార‌ట‌!!

Update: 2019-03-02 07:21 GMT
విదేశాల్లో టాలీవుడ్ సెల‌బ్రిటీల షోల‌కు అంత‌కంత‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంది. లైవ్ కాన్సెర్టులు.. మ్యూజిక్ షోలు.. పెద్ద స‌క్సెస‌వుతున్నాయి. కొంద‌రు గాయ‌నీగాయ‌కుల బృందంతో మ‌న స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు లైవ్ కార్య‌క్ర‌మాలు చేసి జ‌నాద‌ర‌ణ పొందారు. లైవ్ షోల‌తో ఆర్జ‌న బావుండ‌డంతో ప్ర‌తియేటా భారీగా టూర్ లు ప్లాన్ చేస్తున్నారు. ఏ.ఆర్.రెహ‌మాన్ - దేవీ శ్రీ ప్ర‌సాద్ - ఇళ‌య‌రాజా - మ‌ణిశ‌ర్మ - ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం వంటి దిగ్గ‌జాలు విదేశీ కాన్సెర్టులు - లైవ్ షోలతో నిరంత‌రం బిజీగానే ఉంటున్నారు. ఈ లైవ్ షోల‌కు అద‌నంగా కామెడీ స్కిట్లు - డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తే ప‌లువురికి బాగానే ఆదాయ మార్గం క‌నిపిస్తోంది. గాయ‌నీగాయ‌కులు - ఆర్టిస్టులు - డ్యాన్సర్లు - స్పాన్స‌ర‌ర్లు ఇంత‌మందికి ఇదో ఆదాయ మార్గంగా మారింది. భారీగా విదేశీ క‌రెన్సీ వాస‌న త‌గుల్తోంది.

స‌రిగ్గా ఇదే పాయింట్ ఇప్పుడు విదేశాల్లో కామెడీ షోల‌కు తెర తీసేందుకు ఆస్కారం క‌ల్పిస్తోందా? ఎన్నారై క‌రెన్సీపై క‌మెడియ‌న్లు గురి పెట్ట‌బోతున్నారా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. అందులో అతిపెద్ద తొలి అడుగు ఇది. దాదాపు 25 మంది క‌మెడియ‌న్ల‌తో ఆస్ట్రేలియాలో భారీ లైవ్ షోని ప్ర‌ముఖ కార్పొరెట్ ప్లాన్  చేస్తోంద‌ని తెలిసింది. మార్చి 16న 6 పీఎం ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్ లో ప‌లు ర‌కాల వినోద కార్య‌క్ర‌మాల్ని ప్లాన్ చేశారు. కామెడీ .. డ్యాన్స్.. సింగింగ్ .. మ్యాజిక్‌ షోల‌తో కార్య‌క్ర‌మం ఆద్యంతం రంజింపజేయ‌నున్నార‌ట‌. అందుకు ఆస్ట్రేలియా ప‌లైస్ థియేట‌ర్ వేదిక కానుంద‌ని తెలుస్తోంది. ఈ వేడుక‌ల్లో ఎవ‌రెవ‌రు పాల్గొంటారు... అంటే..?

సినిమా టీవీల్లో నటించే ప‌లువురు క‌మెడియ‌న్ల‌తో భారీగా ఈ షోని ప్లాన్ చేశార‌ని చెబుతున్నారు. ప్ర‌ముఖ క‌మెడియ‌న్లు - జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ల మేళ‌వింపుగా దీనిని ప‌క‌డ్భందీ వ్యూహంతో డిజైన్ చేశార‌ట‌. అయితే ఇలాంటి షోలు అమెరికా - సింగ‌పూర్ లాంటి చోట ఓకే కానీ - ఆసీస్ ఎన్నారైలు ఆద‌రిస్తారా?  లేదా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. మ‌రోవైపు టాలీవుడ్ ఇటీవ‌లి కాలంలో ఆస్ట్రేలియా - న్యూజిల్యాండ్ లో ఓ వెలుగు వెలుగుతోంది. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత రంగ‌స్థ‌లం - భ‌ర‌త్ అనే నేను వంటి భారీ చిత్రాల‌కు అక్క‌డ డాల‌ర్ల వ‌ర్షం కురిసింది. మ‌న సినిమాల‌కు ఆద‌ర‌ణ అక్క‌డ అంతకంత‌కు పెరుగుతోంద‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ లాంటి క్రిటిక్ ప్ర‌శంస‌లు కురిపించారు. తెలుగు వాళ్ల హ‌వా సాగుతోంద‌ని కీర్తించారాయ‌న‌. తెలుగు జ‌నం (ఇండియ‌న్ డ‌యాస్పోరా) ఆస్ట్రేలియా - న్యూజిల్యాండ్ లాంటి చోట్ల‌కు త‌ర‌లి వెళ్లేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. ప‌ర్య‌వ‌సానంగా మ‌న సినిమా అక్క‌డా ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. మ‌న ఆర్టిస్టులు - డ్యాన్స‌ర్లు - సింగ‌ర్లు అక్క‌డ ప‌రిచ‌యం అయిపోతున్నారు. గ్లామ‌ర్ & గ్లిడ్జ్ కి ఉండే ఆద‌ర‌ణ అటువైపు కొత్త ఆదాయ మార్గాల‌కు తెర తీస్తోంది. ఇక‌పోతే తొలి భారీ ప్ర‌య‌త్నంగా తాజా కామెడీ షోకు ఎలాంటి ఆద‌ర‌ణ ద‌క్క‌నుంది? అన్న‌ది కాస్త వేచి చూడాలి.
   

Tags:    

Similar News