వైజాగ్ టాలీవుడ్ పై మ‌ళ్లీ గుస‌గుస‌లు..!

Update: 2022-10-14 23:30 GMT
బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో ఫిలింఇండ‌స్ట్రీ అభివృద్ధి ప్ర‌తిపాద‌న ఇప్ప‌టిది కాదు. ద‌శాబ్ధాలుగా దీనిపై రాజకీయ సినీవ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతూనే ఉంది. మూడు రాజ‌ధానుల అంశం తెర‌పైకి రాక ముందు నుంచే అంత‌కుముందు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం హయాంలోనే విశాఖ‌కు సినీప‌రిశ్ర‌మ‌ను త‌ర‌లించాల‌ని స్టూడియోల నిర్మాణానినికి అనుమ‌తించాల‌ని ప్ర‌తిపాదించారు. కానీ ఆ త‌ర్వాత వైకాపా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక విధిరాత వేరుగా మారింది. విశాఖలో సినీప‌రిశ్ర‌మ ఏర్పాటుపై ఆసక్తి ఉన్నా కానీ రాజ‌ధాని అంశం తేల‌క‌పోవ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌న్ఫ్యూజ‌న్ లోనే ఉండిపోయింది.

కోర్టుల ప‌రిధిలో వ్య‌తిరేక ఫ‌లితాలు ఇబ్బందిక‌రంగా మారాయి. ఏది ఏమైనా విశాఖ‌ను ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిని చేయాల‌ని మూడు రాజ‌ధానులు అమ‌ల‌వుతాయ‌ని ఇప్ప‌టికీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌ట్టుబ‌ట్టి ఉంది. రేప‌టి విశాఖ రాజ‌ధాని గ‌ర్జ‌న విజ‌యవంతం అయ్యాక సీఎం క్యాంప్ ఆఫీస్ నేరుగా విశాఖ‌కు మారుతుంది. అనంత‌రం విశాఖ‌లో ఐటీ- ప‌రిశ్ర‌మ‌లు - సినీప‌రిశ్ర‌మ అనే మూడు కాన్సెప్టుల‌పైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వం కీల‌కంగా దృష్టి సారించ‌నుంద‌ని స్థానికంగా నాయ‌కుల్లో చ‌ర్చ సాగుతుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వైజాగ్ టాలీవుడ్ అంశం ఇక‌పై ఊపందుకునే ఛాన్సుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే భీమిలి నుంచి విజ‌య‌న‌గ‌రం ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ వ‌ర‌కూ దాదాపు 15000 ఎక‌రాలు కేవ‌లం సినీపరిశ్ర‌మ‌కే చెందిన ప‌లువురు బిగ్ షాట్స్ కొనుగోళ్లు సాగించార‌ని స్థానిక నాయ‌కులు వీఆర్వోలు లెక్క‌లు చెబుతుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ డివైడ్ అనంత‌ర ప‌రిణామ‌మిది. కానీ రాజ‌కీయ సందిగ్ధ‌త అస్థిర‌త‌ల వ‌ల్ల ఇప్ప‌టికీ సినీప‌రిశ్ర‌మ‌పై ముంద‌డుగు ప‌డ‌లేదని చెబుతున్నారు.

అలాగే విశాఖ శివారులోని కొత్త వ‌లస మొద‌లు అర‌కు వెళ్లే వ‌ర‌కూ మ‌ధ్య‌లో వేలాది ఎక‌రాల మెట్ట‌ భూములున్నాయి. ఇవి సినీప‌రిశ్ర‌మ‌కు అనుకూలం అని కూడా విశ్లేష‌ణ‌లు గ‌తంలో సాగాయి. ఇక భీమిలి ప‌రిస‌రాల్లో ఇప్ప‌టికే ప‌లు సినీస్టూడియోలు ఉన్నాయి.

వైజాగ్ రామానాయుడు స్టూడియో ఇప్ప‌టికే  యాక్టివ్ గా ఉంది. అక్క‌డ అన్ని భాష‌ల సినిమాల షూటింగులు జ‌రుగుతున్నాయి. రామానాయుడు స్టూడియోస్ ద‌గ్గ‌ర‌లోనే నిర్మాత కే.ఎస్.రామారావు సార‌థ్యంలోని వైజాగ్ ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ (వీ.ఎఫ్.ఎన్.సీ.సీ) ఇప్ప‌టికే యాక్టివ్ గా ఉంది.

అలాగే ఇక్క‌డ ప‌రిస‌రాల్లోనే అధికారికంగా ఛాంబ‌ర్ - ఎఫ్‌.ఎన్.సీ.సీ ల కోసం ప్ర‌భుత్వ భూములు కేటాయించార‌న్న టాక్ కూడా ఉంది. విశాఖ రాజ‌ధాని బ‌ర్నింగ్ ఇష్యూగా మార‌డంతో మ‌రోసారి ఇవ‌న్నీ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఏది ఏమైనా ప‌రిశ్ర‌మ‌లు అభివృద్ధి చెంది యువ‌త‌రానికి ఉపాధి పెర‌గాల‌ని ముఖ్యంగా క్రియేటివ్ ఇండ‌స్ట్రీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి మ‌ణిమ‌కుటంగా మారాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. దీనికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News