అదే తన స్వార్థమంటున్న జక్కన్న..!

Update: 2022-07-02 09:45 GMT
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. వెండితెరపై విజువల్స్ వండర్స్ క్రియేట్ చేస్తూ.. అపజయం ఎరుగని డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అందుకే ఆయన పేరే ఒక బ్రాండ్ గా మారిపోయింది. 'బాహుబలి' చిత్రాలతో సరికొత్త రికార్డులు నమోదు చేసిన దర్శకధీరుడు.. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో మరోసారి సత్తా చాటారు.

సమ్మర్ సీజన్ లో థియేటర్లలోకి వచ్చిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1130 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పుడు గ్లోబల్ రీచ్ సాధించింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకి హాలీవుడ్ సినీ ప్రముఖుల ప్రశంసలు దక్కుతున్నాయి.
 
ఇటీవల కాలంలో ఏ భారతీయ సినిమాకూ RRR రేంజ్ లో ప్రశంసలు దక్కలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రాజమౌళి తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ కథలను వరల్డ్ వైడ్ చెప్పడంలో తాను ముందు ఉండాలన్నదే తన స్వార్థమని పేర్కొన్నారు.

"బాహుబలి తర్వాత నా తదుపరి సినిమాపై కచ్చితంగా ఒత్తిడి ఉంది. RRR ఇప్పుడు బౌండరీలు దాటినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు, భారతీయ కథలు ప్రపంచ స్థాయిలో ప్రదర్శించబడాలని నేను కోరుకుంటున్నాను. అందులో నేను ముందుండాలనుకుంటున్నాను. అదే నా స్వార్థం’’ అని రాజమౌళి అన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. "పెద్ద లావిష్ బడ్జెట్ సినిమాలు తీసినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. సినిమా విజయం సాధిస్తే నిర్మాతలకు మంచి వసూళ్లు వస్తాయి.. లేకుంటే నష్టాలు భారీగా ఉంటాయి. అదే అర్బన్ సినిమాలైతే బడ్జెట్ తక్కువగా ఉండడంతో రిస్క్ తక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టుగా రీచ్ మరియు బాక్సాఫీస్ వసూళ్ళు కూడా తక్కువగా ఉంటుంది" అని జక్కన్న చెప్పుకొచ్చారు.

రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు లైన్లు అనుకుంటున్నట్లు ఆ మధ్య తెలిపారు. ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకునే చిత్రాలను తీయాలని కోరుకుంటున్నట్లు దర్శకుడు చెప్పడంతో SSMB29 మూవీ భారీ స్థాయిలో ఉంటుందని అనుకోవచ్చు.

మహేష్ బాబు కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ స్టోరీని అనుకున్నట్లు రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్‌. నారాయ‌ణ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
Tags:    

Similar News