టాలీవుడ్ కమలహాసన్ ఆయనేనట!

Update: 2021-03-28 00:30 GMT
తెలుగు తెరకి విభిన్నమైన కథలను పరిచయం చేసిన అనుభవం పరుచూరి బ్రదర్స్ సొంతం. ఒక కథలో ఏయే అంశాలు ఉండాలి? .. పాత్రలను ఎలా పండించాలి? నవరసాలను ఏ పాళ్లలో కలిపి వడ్డించాలి? అనే విషయం వాళ్లకి బాగా తెలుసు. అగ్రహీరోలకి వాళ్లు అందించిన విజయాలు వాళ్లకి గల అపారమైన అనుభవానికి అద్దంపడుతూ ఉంటాయి. అలాంటి పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన గోపాలకృష్ణ, కొత్త సినిమాలపై తనకి గల అభిప్రాయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా ఈ సారి ఆయన 'గాలి సంపత్' సినిమాను గురించి తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు.

"ఈ సినిమాకి అనీశ్ కృష్ణ దర్శకత్వం వహించగా .. అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లేను అందించాడు. ఎస్.కృష్ణ అల్లిన ఈ కథకు 'మిర్చి' కిరణ్ సంభాషణలు రాసినట్టుగా చూశాను. నాలుగు ముఖ్యమైన పాత్రలకి సంబంధించిన ఆశయం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే రాజేంద్రప్రసాద్ గారి పాత్ర పేరునే సినిమాకి పెట్టారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేసినట్టు కార్డు వేసుకున్నాడు. అనిల్ రావిపూడి ఈ సినిమాను ఎందుకు సమర్పించాడు? అని మీరు ఎవరైనా అడిగితే, రాజేంద్ర ప్రసాద్ కోసం అని నేను సమాధానం చెబుతాను.

'ఈ చరిత్ర ఏ సిరాతో' సినిమా అప్పటికి రాజేంద్ర ప్రసాద్ చిన్న నటుడు. ఆ సినిమాలో 'తొందరపడకు సుందరవదనా' డైలాగ్ మాదిరిగా, తొందరపడకుండా జీవితంలో ఆయన అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పటికీ ఆయన పాత్రనే ప్రధానంగా చేసుకుని టైటిల్స్ పెడుతున్నారు. 'గాలి సంపత్' కూడా ఆయన కోసం తీసినదే. ఈ సినిమాలో ఆయన నటన చూస్తుంటే, మన తెలుగులో కూడా ఒక కమలహాసన్ ఉన్నాడు అని అనిపించింది. 'గాలి సంపత్' పాత్రకి రాజేంద్రప్రసాద్ ప్రాణం పోశారు. అనిల్ రావిపూడి విజయవంతమైన దర్శకుడు .. ఆయన స్క్రీన్ ప్లే బాగుంది. ఏది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పుకుంటూ వెళ్లడం వలన, ఆడియన్స్ లో ఆసక్తి పెరగడానికి కారణమైంది" అని చెప్పుకొచ్చారు.



Tags:    

Similar News