ట్రెండీ స్టోరి: బాలీవుడ్ పై సౌత్ ఇండ‌స్ట్రీ స‌వారీ

Update: 2022-06-17 10:30 GMT
ప్ర‌స్తుతం బాలీవుడ్ వ‌ర్సెస్ సౌత్ వార్ హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా హిందీ చ‌ల‌న‌చిత్ర‌సీమ‌పై సౌత్ డామినేష‌న్ స్ప‌ష్ఠంగా కొన‌సాగుతోంది. బాహుబ‌లి రిలీజ్ త‌ర్వాత స‌న్నివేశం మొత్తం యూట‌ర్న్ తిరిగిందంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌తిసారీ ఒక సౌత్ సినిమాతో పోటీప‌డుతూ విడుద‌లైన భారీ బాలీవుడ్ చిత్రం దారుణంగా బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌బ‌డ్డాయి. హిస్ట‌రీని తిర‌గేస్తే..

ప్ర‌భాస్ `బాహుబ‌లి-1` రిలీజైన అనంత‌రం స‌ల్మాన్ ఖాన్ న‌టించిన `భ‌జ‌రంగి భాయిజాన్` విడుద‌లైంది. ఈ చిత్రం సుమారు 320కోట్లు వసూలు చేసింది. అయితే బాహుబ‌లి చిత్రం ఏకంగా 600 కోట్ల వ‌సూళ్ల‌తో `భ‌జ‌రంగి భాయిజాన్` కంటే చాలా ఎత్తున నిలిచింది. ఆ ర‌కంగా భాయ్ ని ప్ర‌భాస్ డామినేట్ చేసాడు.

ఇటీవ‌ల విడుద‌లైన ర‌ణ‌వీర్ సింగ్ 83 దారుణ ఫ‌లితాన్ని అందుకుంది. ఈ మూవీ కేవ‌లం 129 కోట్లు వ‌సూలు చేసింది. అదే స‌మ‌యంలో బ‌న్ని న‌టించిన `పుష్ప` చిత్రం 350కోట్లు వ‌సూలు చేయ‌గ‌లిగింది. ఊహాతీత‌మైన డామినేష‌న్ ప్ర‌ద‌ర్శిస్తూ.. ర‌ణ‌వీర్ కంటే బ‌న్ని చాలా ఎత్తున నిలిచాడు. ఇక రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఆ రెండు సినిమాల త‌ర్వాత వ‌చ్చి 1000 కోట్ల క్ల‌బ్ చిత్రంగా నిలిచింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన మ‌రో ద‌క్షిణాది చిత్రం కేజీఎఫ్ 2 కూడా 1000 కోట్ల క్ల‌బ్ తో దుమ్ము దులిపింది.

ఈ రెండు సౌత్ సినిమాల‌ త‌ర్వాత వ‌చ్చిన `సామ్రాట్ పృథ్వీరాజ్` చిత్రం కనీసం 100 కోట్ల క్ల‌బ్ లో అయినా అడుగుపెట్ట‌లేక‌పోయింది. ఇప్ప‌టికి కేవ‌లం 63కోట్లు మాత్ర‌మే ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం వ‌సూలు చేసింది. ఇక ఖిలాడీ అక్ష‌య్ కుమార్ న‌టించిన ఈ చిత్రం కంటే క‌ల్ట్ క్లాసిక్ గా వ‌చ్చిన `ది క‌శ్మీర్ ఫైల్స్` అద్భుత వ‌సూళ్ల‌ను సాధించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇది ఒక డాక్యుమెంట‌రీ త‌ర‌హా సినిమా అన్న టాక్ వ‌చ్చినా కానీ బాక్సాఫీస్ వ‌ద్ద 251 కోట్లు వ‌సూలు చేయ‌డం షాకిచ్చింది.

మ‌రోవైపు సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీని మించి కార్తీక్ ఆర్యన్ న‌టించిన `భూల్ భుల‌యా 2` విజ‌యం సాధించింది. ఇది 150కోట్ల వ‌సూళ్ల‌ను సాధించ‌డం ఒక రికార్డ్. సామ్రాట్ పృథ్వీరాజ్ కేవ‌లం 63కోట్ల వ‌ద్ద చ‌తికిల‌బ‌డింది. ఇప్ప‌టివ‌ర‌కూ ది క‌శ్మీర్ ఫైల్స్ మాత్ర‌మే ఉన్న‌వాటిలో బెట‌ర్ అనిపించింది. అయితే ఇది ఒక స్వ‌తంత్య్ర ఫిలింమేక‌ర్ రూపొందించిన‌ది కావ‌డంతో బాలీవుడ్  పెద్ద‌లెవ‌రూ త‌మ సినిమాగా భావించ‌లేదు. వివేక్ అగ్నిహోత్రి క్రియేటివ్ ఫ్రీడ‌మ్ మాత్రం ప్ర‌జ‌లు అంద‌రికీ న‌చ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హ్యుమానిటీ టూర్ లో ఉన్న అగ్నిహోత్రి ఈ విజ‌యం ఇచ్చిన స్ఫూర్తితో వచ్చే ఏడాది ఢిల్లీ ఫైల్స్ పేరుతో మరో బాంబ్ ను ప్రయోగించడానికి సిద్ధమవుతున్నాడు. నేటి రాజ‌కీయ నాయ‌కుల‌పై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? అన్న‌దానిపై.. ఘనమైన చారిత్రక రాజకీయ పరిశోధనతో అల్లుకున్న కథనంతో మూవీని రూపొందించ‌నున్నారు.

తమిళ బ్లాక్ బస్టర్ జిగర్తాండ కు రీమేక్ గా తెర‌కెక్కించిన ఫర్హాద్ సామ్జీ `బ‌చ్చన్ పాండే`  కేవలం రూ. 14 కోట్లు మాత్రమే సంపాదించింది.   ఇక కంగ‌న ప్ర‌ధాన పాత్ర‌లో రజ్నీష్ ఘై తెర‌కెక్కించిన `ధాకడ్` కేవ‌లం 3కోట్లు వ‌సూలు చేసింది. ఆ రెండిటి కంటే భూల్ భుల‌యా 2 చాలా ఉత్త‌మ‌మైన చిత్రంగా నిలిచింది. వీట‌న్నిటి త‌ర్వాత విడుద‌లైన క‌మ‌ల్ హాస‌న్ `విక్ర‌మ్` దాదాపు 300 కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించి మ‌రోసారి సౌత్ డామినేష‌న్ ఎలా ఉంటుందో నిరూపించింది. ఈ చిత్రం కేవ‌లం త‌మిళ‌నాడు నుంచి 140కోట్లు వ‌సూలు చేసింది.

నిజానికి ఈ ఫ‌లితాలు చూశాక‌ హిందీ చలనచిత్ర పరిశ్రమలో కంటెంట్ ఇంత‌గా వెన‌క‌బ‌డిందా? అన్న ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. అలాగే బాలీవుడ్ ఫిలింమేక‌ర్స్ లో ప్రబలంగా ఉన్న అవకాశవాదానికి ప్ర‌జ‌లు విసుగు చెంది ఉంటారా? అన్న సందేహం క‌లుగుతోంది.

బాహుబ‌లి - బాహుబ‌లి 2 చిత్రాలు రెండూ క‌లుపుకుని ఏకంగా 1800 కోట్లు వ‌సూలు చేసాయి. ఈ రికార్డును ఇప్ప‌టికీ బాలీవుడ్ ట‌చ్ చేయ‌లేక‌పోయింది. ఆస‌క్తిక‌రంగా ప్ర‌భాస్ న‌టించిన సాహో చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుని దాదాపు 400 కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. ఈ చిత్రం తెలుగు బెల్ట్ లో కంటే హిందీలో అసాధార‌ణ వసూళ్ల‌ను సాధించింది.

బాహుబ‌లి 2 విజ‌యం త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్-కేజీఎఫ్ చిత్రాలు 1000కోట్లు పైగా వ‌సూలు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. భార‌త‌దేశం నుంచి సులువుగా 1000 కోట్లు సంపాదించ‌వ‌చ్చు అని సౌత్ సినిమా నిరూపించింది. ఇక హాలీవుడ్ సినిమాల భారీ రిలీజ్ ల‌కు కూడా ఇది స్ఫూర్తిగా నిలుస్తోంది. అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు టాలీవుడ్ కోలీవుడ్ లను ఆచరణీయ పెట్టుబడి కేంద్రాలుగా చూడ‌టానికి పై కార‌ణాల‌న్నీ స‌హ‌క‌రిస్తున్నాయి.

ఇప్పుడు ర‌ణ‌బీర్ క‌థానాయ‌కుడిగా అయాన్ ముఖర్జీ తెర‌కెక్కించిన‌ బ్రహ్మాస్త్ర (శివ-ట్ర‌యాల‌జీలో ఒక భాగం) కోసం ఏకంగా రూ. 300 కోట్ల బ‌డ్జెట్ ని వెచ్చించారు. ఈ సినిమా విజ‌యంపైనే బాలీవుడ్ హోప్స్ అన్నీ. క‌నీసం బ్ర‌హ్మాస్త్ర అయినా హిందీ చిత్ర‌సీమ క‌న్నీళ్ల‌ను తుడుస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News