టాలీవుడ్: స్ట్రెయిట్ సినిమాలు vs డబ్బింగ్ చిత్రాలు..!

Update: 2022-11-19 16:30 GMT
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇతర ఇండస్ట్రీల మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి వరకూ తెలుగులోనే సినిమాలు నిర్మిస్తూ వచ్చిన నిర్మాత.. హిందీ మరియు తమిళ చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇదంతా బాగానే వుంది కానీ.. వాటిని డబ్బింగ్ చేసి, తెలుగు చిత్రాలకి పోటీగా రిలీజ్ చేస్తుండటమే చర్చనీయాంశంగా మారింది.

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా 'వారిసు' అనే తమిళ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని "వారసుడు" పేరుతో తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు.

'వారసుడు' చిత్రాన్ని 2023 సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు అజిత్ కుమార్ నటించిన "తునివు" అనే మరో తమిళ్ మూవీని కూడా దిల్ రాజు రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

పాన్ ఇండియా సినిమాల సందడి మొదలైన తర్వాత భాష - ప్రాంతీయ భేదాలు తొలగిపోయాయి. సౌత్ - నార్త్ అనే తేడా లేకుండా అన్నీ భాషలలోనూ చిత్రాలు విడుదల అవుతున్నాయి.  కాకపొతే ఇక్కడ దిల్ రాజు సంక్రాంతి సీజన్ లో స్ట్రెయిట్ తెలుగు చిత్రాలకు పోటీగా అధిక థియేటర్లలో తమిళ్ డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తుండటమే అభ్యంతరకరంగా మారింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" మరియు నటసింహ నందమూరి బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" సినిమాలు సంక్రాంతి బరిలో దిగడానికి సన్నద్ధం అవుతున్నాయి. కాకపొతే దిల్ రాజు బ్యానర్ నుంచి రాబోతున్న డబ్బింగ్ చిత్రానికి ఇప్పుడు కొన్ని ఏరియాల్లో ఎక్కువ థియేటర్లని బ్లాక్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ నేపధ్యంలో తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ నిర్మాతల మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. 2017లో నిర్మాత శ్రేయస్సు కోరి తెలుగు సినిమాని కాపాడుకావాలనే లక్ష్యంతో సంక్రాంతి-దసరా పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని ప్రెస్ నోట్ లో పేర్కొంది.

ఆ నిర్ణయం ప్రకారం స్ట్రెయిట్ సినిమాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వాటిని డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని.. తెలుగు సినిమాలకు ఎక్కువ థియేటర్స్ కేటాయించి.. మిగిలిన థియేటర్స్ డబ్బింగ్ సినిమాలకు ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ ని కోరుతున్నామని నిర్మాతల మండలి ప్రకటన ఇచ్చింది.

అయితే ఈ ప్రకటన వచ్చి వారం కావస్తున్నా ఇంత వరకూ దీనిపై దిల్ రాజు స్పందించలేదు. సాధారణంగా అగ్ర నిర్మాత ఏ విషయం మీదనైనా వెంటనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఈసారి సైలెంట్ గా ఉన్నారు. నిర్మాతల మండలి దిల్ రాజు ను ఉద్దేశించే ఆ ప్రకటన ఇచ్చిందని అర్థమవుతోంది. కాబట్టి ఆయన దీనిపై ఏదొక వివరణ ఇస్తారని భావించారు. కానీ అలా జరగలేదు.

దిల్ రాజు మౌనంగా ఉండటంతో చిరంజీవి మరియు బాలయ్య సినిమాలను ఢీకొట్టడానికే రెడీ అయినట్లుగా భావించాల్సి ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం సీనియర్ హీరోలు కాబట్టే సైలెంట్ గా ఉన్నాడని అంటున్నారు.

ఇప్పటికైతే సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలేవీ రిలీజ్ డేట్స్ ను అధికారికంగా ప్రకటించలేదు. థియేటర్స్ పంచుకునే విషయంలో స్పష్టత రాకపోవడం వల్లనే తేదీలు అనౌన్స్ చేయడం లేదని టాక్ నడుస్తోంది. దీనిపై పెద్దలు మాట్లాడుకొని ఓ క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే విడుదల తేదీలు ప్రకటించే అవకాశం వుందని అంటున్నారు.

ఒకవేళ ఇప్పుడు థియేటర్ల విషయములో డబ్బింగ్ చిత్రాలకి అధిక ప్రాధాన్యం ఇస్తే.. భవిష్యత్ లోనూ ఫెస్టివల్ సీజన్స్ లో అదే చేయాల్సి ఉంటుంది. మరి ఫైనల్ గా స్ట్రెయిట్ చిత్రాలు vs డబ్బింగ్ సినిమాల వివాదంలో టాలీవుడ్ పెద్దలు ఎలాంటి పరిష్కారం చూపిస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News