టాప్ 20 స్టార్ల వంద‌ల కోట్ల‌ రియ‌ల్ పెట్టుబ‌డుల హ‌బ్!

Update: 2022-12-03 23:30 GMT
బాలీవుడ్ టు టాలీవుడ్ సెల‌బ్రిటీల పెట్టుబ‌డుల గురించి మ‌రోసారి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. స్టార్ హీరోలు.. హీరోయిన్లు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.. టెక్నీషియ‌న్లు స‌హా భారీగా పారితోషికం అందుకునే ఆర్టిస్టులు రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు సుముఖంగా ఉంటార‌న్న‌ది తెలిసిందే. జూబ్లీహిల్స్-బంజారాహిల్స్ త‌ర్వాత బిఎన్ ఆర్ హిల్స్ లో టాలీవుడ్ ప్ర‌ముఖులంతా పెట్టుబ‌డులు పెడుతుండ‌డంపై తుపాకి ఆస‌క్తిక‌ర క‌థ‌నం ప్ర‌చురించింది.

ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులు ఇష్టపడే ముంబైలోని టాప్ 5 ప్రాంతాల గురించిన వివ‌రాలిలా ఉన్నాయి. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు వృత్తి ప‌రంగా ముంబైలో నివసించడానికి ఇష్టపడతారు. తత్ఫలితంగా వారి ప్రధాన పెట్టుబడుల‌న్నీ ముంబైలోని హై ఎండ్ సెల‌బ్రిటీ ప్రాంతాలపైనే ఉంటుంది. హై-క్లాస్ సౌకర్యాలు .. ఆహ్లాద‌ర‌క‌ వాతావరణాన్ని క‌లిగి ఉన్న చోట రియ‌ల్ వెంచ‌ర్ల‌లో భారీగా పెట్టుబడుల వ‌ర‌ద పారిస్తున్నార‌నేది ఒక టాక్. రియల్ ఎస్టేట్ పెట్టుబడి కోసం బాలీవుడ్ ప్రముఖులు ఎక్కువగా ఇష్టపడే ప్రాంతాలివే.

బాలీవుడ్ ప్రముఖుల పాపుల‌ర్ సెల‌బ్రిటీ హౌసింగ్ హబ్ లన్నీ..బాంద్రా-వ‌ర్లీ- జుహూ- అంధేరి వెస్ట్- వెర్సోవా ప‌రిస‌రాల్లోనే ఉన్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల‌ను ఎల్లప్పుడూ సుర‌క్షితంగా భావిస్తారు. కమర్షియల్ అయినా.. రెసిడెన్షియల్ అయినా.. కోట్లాది రూపాయల ప్రాపర్టీ డీల్స్ గురించి సినీ తారలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

ఇటీవ‌ల‌ రణవీర్ సింగ్- జాన్వీ కపూర్ -రాజ్‌కుమార్ రావు వంటి స్టార్లు  అపార్ట్ మెంట్లపై భారీ పెట్టుబ‌డులు పెట్ట‌డంతో హెడ్ లైన్స్ లో నిలిచారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ - బాలీవుడ్ కనెక్షన్ చాలా కాలంగా కొన‌సాగుతున్న‌దే. ఫిల్మ్ సిటీ ముంబైలో ఉన్నందున చాలా మంది సెలబ్రిటీలు పని చేయడానికి అందుబాటులో ఉన్నందున ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. అలాగే ముంబైలో ప్రాపర్టీ ధరలు యేటేటా విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్టుబడి పోర్ట్ ఫోలియోకు రియల్టీ అత్యంత లాభదాయకమైన వ‌న‌రుగా క‌నిపిస్తోంది.

బాంద్రా- ముంబై

బాంద్రా అద్భుతమైన వ్యూ పాయింట్ల‌తో తీర శివారు ప్రాంతం. టాప్ బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే ప్రాంతాలలో ఇది ఒకటి. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్- కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ - సింహ‌బ‌లుడు జాన్ అబ్రహం- యువ‌హీరో సిద్ధార్థ్ మల్హోత్రా- సైఫ్ అలీ ఖాన్ ఇక్కడ త‌మ నివాసాల‌ను క‌లిగి ఉన్నారు. క‌థానాయికల్లో కరీనా కపూర్ - క‌రిష్మా  వంటి భామ‌లు బాంద్రాలో ప్రాథమిక నివాసాన్ని కలిగి ఉన్నారు.

షారుఖ్ ఖాన్ `మన్నత్` బాంద్రాలో ఒక మైలురాయి. పర్యాటక ప్రదేశంగా పాపుల‌రైంది. 27000 చ.అ.ల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ భ‌వంతి విలువ‌ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అదేవిధంగా బాంద్రాలోని సాగర్ రేషమ్- బ్యాండ్ స్టాండ్ లో షారుక్ మన్నత్ పక్కనే ఉన్న భారీ అపార్ట్ మెంట్ ను 119 కోట్ల రూపాయలకు రణ్‌వీర్ సింగ్ కొనుగోలు చేశాడు. ఒక చదరపు అడుగు ధర సుమారు లక్ష. ఇది 11266 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా 1300 చదరపు అడుగుల టెర్రస్ ని కలిగి ఉంది. బాంద్రాలోని హౌసింగ్ ఇన్వెంటరీ ప్రధానంగా హై-ఎండ్ రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ లను కలిగి ఉంటుంది. బాంద్రా వెస్ట్ లో సగటు లావాదేవీ రేటు చదరపు అడుగులకు రూ. 43800 గా ఉంది.

వర్లీ- ముంబై

వర్లి విభిన్నమైన ప్రాపర్టీ వాల్యుయేషన్ లతో ప్రీమియం అపార్ట్ మెంట్ లు -వాణిజ్యప‌ర‌మైన స్పేస్ ల‌ను క‌లిగి ఉండే ప్రాంతం. రియల్ ఎస్టేట్ పెట్టుబడి కోసం వెతుకుతున్న ప్రముఖులు ఇష్టపడే గమ్యస్థానం. ఇక్క‌డ‌ బలమైన మౌలిక సదుపాయాలు ఎత్తైన నిర్మాణాలతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. అనుష్క శర్మ- యువరాజ్ సింగ్ - షాహిద్ కపూర్ వర్లీలో ఆస్తులను కలిగి ఉన్న పాపుల‌ర్ సెలబ్రిటీలు. అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ `ఓంకార్` 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఇల్లు. సుమారు 34 కోట్లకు కొనుగోలు చేసారు. ఒక‌ ప్రైవేట్ టెర్రేస్- గార్డెన్ ఏరియా- చిన్న జిమ్ తో కూడుకున్న నాలుగు పడకగదుల అపార్ట్ మెంట్ ఇది.

షాహిద్ కపూర్ కూడా వర్లీలోని డూప్లెక్స్ ప్రాపర్టీలో రూ.56 కోట్లు పెట్టుబడి పెట్టాడు. బాంద్రా-వర్లీ సీ లింక్ కి ఎదురుగా 8600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అల్ట్రా-లగ్జరీ హోమ్ ని  ఒయాసిస్ రియాల్టీ అభివృద్ధి చేసింది. ఐదు శాతం స్టాంప్ డ్యూటీలు పెరిగాక‌.. వర్లీలో సగటు ఆస్తి ధర చదరపు అడుగులకు సుమారు రూ. 40800. అందుబాటులో ఉన్న ఇన్వెంటరీలో దాదాపు 80 శాతం 2-4 BHK కాన్ఫిగరేషన్ ల బహుళ అంతస్తుల అపార్ట్ మెంట్ లు అధికంగా ఉన్నాయి.

జుహు- ముంబై

నైరుతి ముంబైలో జుహు అనేది వెర్సోవా- శాంటాక్రూజ్- విలే పార్లే - ఖార్ లతో ఉన్నత శ్రేణి ప్ర‌జ‌లు నివ‌శించే ప్రాంతంగా పాపుల‌రైంది. ఈ ప్రాంతం జుహు బీచ్ .. అలాగే నదికి అభిముఖంగా ఉన్న గ్లామ్ అండ్ గ్లిజ్ ఉన్న ప్రాంతంగా పాపుల‌రైంది. ఇక్క‌డ‌ అక్షయ్ కుమార్- అజయ్ దేవగన్ - అనిల్ కపూర్ - జాన్వీ కపూర్- అలియా భట్ సహా ప‌లువురు ప్రముఖులకు ఇక్కడ సొంత ఇళ్లు ఉన్నాయి.

అమితాబ్ బచ్చన్ `జల్సా` హోమ్ జుహులో ఉన్న ఒక ఐకానిక్ రెండు అంతస్తుల లగ్జరీ హెరిటేజ్ భవనం. సాంప్రదాయ అలంకరణ ఆధునిక సౌందర్యాల కలయికతో ఇది 10125 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. జల్సా అంచనా విలువ సుమారు రూ. 120 కోట్లు. ప్రతీక్ష అనేది ఈ భ‌వంతికి ఒక కిమీ దూరంలో ఉన్న అమితాబ్ యాజమాన్యంలోని మరొక బంగ్లా. జాన్వీ కపూర్ జుహులోని జుహు విలే పార్లే డెవలప్‌మెంట్ (జెవిడిపి) స్కీమ్ లోని హై ఎండ్ ప్రాంతంలో రూ. 39 కోట్లతో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల సొగసైన అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసింది.

జుహులో చ‌.అ.కు ధ‌ర‌ వార్షిక ప్రాతిపదికన ఆరు శాతం మేర  పెరిగింది. ఇక్క‌డ‌ చ.అ.కు సగటున రూ. 42550 ప్రీమియంతో రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.  వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే- మలాడ్-అంధేరి లింక్ రోడ్- లింకింగ్ రోడ్- SV రోడ్ నుండి సీ-లింక్ ఈ ప్రాంతంలో అతుకులు లేని కనెక్టివిటీతో ర‌హ‌దారుల‌తో ఆక‌ట్టుకుంటుంది. మునుముందు కోస్టల్ లింక్ రోడ్ కూడా కనెక్టివిటీ ప్ర‌ణాళిక‌ల్లో ఉండ‌డంతో న‌గ‌ర ప్రాంతం మరింత మెరుగ‌వుతుందని భావిస్తున్నారు.

అంధేరి వెస్ట్- ముంబై

ప్రీమియం-హౌసింగ్ హబ్ అంధేరీ వెస్ట్ లో ప్రియాంక చోప్రా- రాజ్ కుమార్ రావ్ - ఆయుష్మాన్ ఖురానా వంటి ప్రముఖులు నివ‌శిస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా విండ్సర్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ కు దాదాపు రూ. 20 కోట్లు చెల్లించారు.యు విండ్సర్ గ్రాండే రెసిడెన్సెస్ లోని 20వ అంతస్తులోని రెండు అపార్ట్ మెంట్లను స్వాధీనం చేసుకున్నందుకు రూ.96.50 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించారు. మొత్తం 4027 చదరపు అడుగుల విస్తీర్ణంలో లోఖండ్ వాలా కాంప్లెక్స్ లో ఉన్నత స్థాయి అపార్ట్ మెంట్ లు అత‌డికి ఉన్నాయి. దీనికి నాలుగు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ అంధేరీ వెస్ట్ లోని అట్లాంటిస్ ప్రాజెక్ట్ లో 5000 చదరపు అడుగుల ఆస్తి కోసం 31 కోట్ల రూపాయలకు పెట్టుబడి పెట్టారు. ఆస్తి 27వ - 28వ అంతస్తులలో విస్తరించి ఉంది. ఇది ఆరు పార్కింగ్ స్థలాలను కలిగి ఉంది. ప్రియాంక చోప్రా జోనాస్ కు కర్మయోగ్ బిల్డింగ్ లో ఒక ఆస్తి అలాగే అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్ వాలా కాంప్లెక్స్ లో మరొక ఆస్తి ఉంది.

రాజ్ కుమార్ రావు ఇల్లు కూడా అంధేరిలోనే ఉంది. ఇది ఒబెరాయ్ స్ప్రింగ్స్ అనే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఉంది. ఇదే భ‌వంతిలో విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ లకు సొంత ఇల్లు ఉంది. అంధేరి పాపుల‌ర్ మైక్రో-మార్కెట్ .. సుమారు మూడు శాతం ధర పెరుగుదలను నమోదు చేసింది. ఒబెరాయ్ రియాల్టీ -సమర్థ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అంధేరీ వెస్ట్ లో ప్రాజెక్ట్ లను కలిగి ఉన్న పాపుల‌ర్ డెవలపర్ లు. ఈ ప్రాంతంలో ప్రాపర్టీ ధరలు సగటున చదరపు అడుగులకు రూ. 26550.

వెర్సోవా- ముంబై

ఉత్తరప్రదేశ్ లోని తన పూర్వీకుల ఇంటి నుండి ప్రేరణ పొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీకి వెర్సోవాలోని యారీ రోడ్ లో నవాబ్ అనే రూ. 12 కోట్ల భవనం ఉంది. వెర్సోవాలో నివసిస్తున్న ఇతర ప్రముఖులలో కోహినూర్ అపార్ట్ మెంట్ లో అర్షద్ వార్సీ- బీచ్ క్వీన్ అపార్ట్ మెంట్ లో సుస్మితా సేన్ నివ‌శిస్తున్నారు అనుకూల్ సెవెన్ బంగ్లాలలో టబుకి ఆస్తులు ఉన్నాయి.

వెర్సోవా అనేది మూడు శాతం ధ‌ర‌ పెంపు తర్వాత సగటు ఆస్తి ధర చదరపు అడుగుకు రూ. 28000తో ప్రీమియం క‌లిగి ఉంది. ఇది సౌక‌ర్య‌వంత‌మైన విలాస‌వంత‌మైన హౌసింగ్ ప్రాంతం. హౌసింగ్ ఇన్వెంటరీ ప్రధానంగా నివాస అపార్ట్ మెంట్ లు విల్లాలను అధికంగా కలిగి ఉంటుంది. హిరానందని డెవలపర్స్ - లోటస్ గ్రూప్ ఇక్కడ పాపుల‌ర్ బిల్డర్లు. ఇక ముంబైలో రామ్ చ‌ర‌ణ్ - ర‌ష్మిక మంద‌న - బ‌న్ని లాంటి స్టార్లు సొంత ఆఫీస్ ల కోసం అపార్ట్ మెంట్లు కొనుక్కున్నార‌ని టాక్ ఉంది.

స్థిరమైన ధర పెరుగుదల క‌లిగి ఉన్న పెట్టుబ‌డి మార్గంగా రియల్ ఎస్టేట్ రంగం విరాజిల్లుతోంది. ఈ పెట్టుబ‌డుల‌తో అనేక రకాల ప్రయోజనాలను బాలీవుడ్ ప్రముఖులు పొందుతున్నారు. అందుకే వీళ్ల‌తో పాటు  ఎలైట్ ఇన్వెస్టర్లు లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడి పోర్ట్ ఫోలియోను కాలంతో పాటు మెరుగ‌య్యేలా వైవిధ్యపరచడంలో సహాయపడటమే కాకుండా పన్నులపై ఆదా చేయడానికి మంచి మార్గంగా క‌నిపిస్తోంది. అలాగే ఈ మార్కెట్ విశ్వసనీయతను క‌లిగి ఉంద‌ని రియ‌ల్ ట్రేడ్ విశ్లేషిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News