టాప్ స్టోరి: గ‌తి త‌ప్పిన సినిమా ప‌బ్లిసిటీ

Update: 2019-11-19 01:30 GMT
సినిమాకి ప‌బ్లిసీటీ అవ‌స‌ర‌మే... కానీ ఆ ప్ర‌చారం పేరుతో  కొంద‌రు ల‌క్ష‌ల్లో దండుకుంటున్నార‌ని ఇప్ప‌టికే చాలా మంది నిర్మాత‌లు  ల‌బోదిబోమన‌డం ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌కొచ్చింది. దండుకోవ‌డంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే  తేడా లేద‌ట‌. అంద‌రిదీ ఇదే స‌మ‌స్య‌. కోటి రూపాయ‌ల బ‌డ్జెట్ లో నిర్మించే చిన్న సినిమాకి అంత‌కు మించిన ప్ర‌చారం ఖ‌ర్చులు పెట్టాల్సి వ‌స్తోంద‌ని.. మీడియం బ‌డ్జెట్ల సినిమాల‌కు ఇదే దోపిడీ త‌ప్ప‌డం లేద‌ని ప‌లువురు నిర్మాత‌లు ప‌బ్లిగ్గానే వాపోయిన‌ సంద‌ర్భాలున్నాయి. అదుపు త‌ప్పిన‌ ప్ర‌చారం భార‌మైందని  వాపోవ‌డం తాజాగా చ‌ర్చ‌కు వచ్చింది. ప్ర‌చారం పేరుతో  అడ్వాన్సులు తీసుకున్న కొంద‌రు ప‌త్తా లేకుండా పోతున్నార‌ని ఇప్ప‌టికే ప‌లువురు నిర్మాత‌లు ఆరోపించారు. కంటికి క‌నిపించ‌రు..ఫోన్ కి దొర‌కరు అని విసుక్కున్న‌వాళ్లు ఉన్నారు.

ఇదేం ప్ర‌చారం అని ఆ డ‌బ్బు తీసుకున్న కొంద‌రిని నిల‌దీసిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఆ విష‌యాల్ని ప‌క్క‌న‌బెడితే  తాజాగా టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ‌గా అతి త‌క్కువ స‌మ‌యంలో పాపుల‌రైన‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ కే ఇప్పుడు ప‌బ్లిసిటీ అంటే టెర్ర‌ర్ గా మారింద‌ట‌. సినిమా అంతా హ్యాపీగా అన్నిలెక్క‌ల‌తో ప‌క్కాగా పూర్తిచేసినా రిలీజ్ ద‌గ్గ‌ర‌కొచ్చి ప్ర‌చారం ఎలా అని ఆలోచిస్తే మింగుడు ప‌డ‌ని స‌న్నివేశం ఎదురవుతోంద‌ని మైత్రి లాంటి పెద్ద‌ సంస్థనే వాపోతుందిట‌. అయితే ఈ దుస్థితికి కార‌కులు ఎవ‌రు అన్న‌ది విశ్లేషించుకునే ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తోంది.

ప‌బ్లిసిటీలో ఈ ప‌రిణామం ఎందుకు అన్న‌దానికి స‌మాధానం మైత్రీనే కాదు బాధిత నిర్మాణ సంస్థ‌ల‌న్నీ స‌మావేశ‌మై రివ్యూలు చేసుకుని మ‌రీ క‌నిపెట్టాల్సి ఉంద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌.  మొత్తం సినిమాకు పెట్టిన ఖ‌ర్చులో ప్ర‌చారం కోసం పెట్టిన‌ ఖ‌ర్చు  మాత్ర‌మే వృధా అని చాలా నిర్మాణ సంస్థ‌లు భావిస్తున్నాయంటే ఈ వ్య‌వ‌హారంలో దారుణ స‌న్నివేశాన్ని విశ్లేషించాల్సిన సంద‌ర్భం వ‌చ్చింద‌ని భావిస్తున్నార‌ట‌.  సినిమా నిర్మాణానికి పెట్టిన ఖ‌ర్చు ఒక ఎత్తు అయితే? ప‌్ర‌చారానికి పెట్టిన ఖ‌ర్చు మ‌రో ఎత్తులా క‌నిపిస్తోందిట‌. ప‌బ్లిసిటీ విష‌యంలో ఖ‌ర్చు ఎంతవుతుందో స‌రైన లెక్క‌లు తేల‌డం లేద‌ని కొన్ని నిర్మాణ సంస్థ‌లు భావిస్తున్నాయ‌ట‌. ఒక వేళ సినిమా హిట్టు అయినా! ప్లాప్ అయినా  ప‌బ్లిసిటీకి పెట్టిన ఖ‌ర్చు వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఎంత అన్న‌ది ప్ర‌శ్నించుకుంటున్నార‌ట‌.

ఇక ఇంతకుముందు ఓ అగ్ర నిర్మాత త‌మ సినిమా ఆడియో/ ప‌్రీరిలీజ్ వేడుక‌ను లైవ్ చేస్తామ‌ని చెప్పి హ్యాండిచ్చిన ఓ రెండు టీవీ చానెళ్ల‌పై ప‌బ్లిగ్గానే మండిప‌డ్డారు. డ‌బ్బులు తీసుకుని ప్ర‌క‌ట‌న‌లు తీసుకుని ఈ దారుణం ఏమిటి? అని వాపోయారు. అస‌లు పబ్లిసిటీలో ఇంత ధైన్య‌మైన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఊహించలేక‌పోయామ‌ని ఆవేద‌న చెందే నిర్మాత‌ల‌కు ప‌రిశ్ర‌మ‌లో కొద‌వేమీ లేదు. అస‌లు టాలీవుడ్ కి ఇదేం ముప్పు అని నీర‌సించి సినిమాలు తీయ‌కుండా పోతున్న‌వాళ్లు ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక డిస్ట్రిబ్యూష‌న్ సిండికేట్ లో ప‌బ్లిసిటీ పేరు చెప్పి డ‌బ్బులు తినేస్తున్నార‌న్న‌ మ‌రో వాద‌న తెర‌పైకి వ‌చ్చింది. కానీ ప్లాప్ సినిమాలు చేసి ప‌బ్లిసిటీకి ఖ‌ర్చు అయిపోతుంద‌ని మొర పెట్టుకుంటే? ఎలా అనే వాళ్లు లేక‌పోలేదు. ఇక ప‌రిశ్ర‌మ‌లో నిర్మాత‌ల‌ గిల్డ్ అంటూ స‌ప‌రేట్ కుంప‌టి పెట్టుకున్న వారి వ‌ల్ల‌ కొంత మంది చిన్న నిర్మాత‌ల ప‌రిస్థితి  దిగాలుగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది. ర‌క‌ర‌కాల కోణాల్లో నిర్మాత నెత్తిన శ‌ఠ‌గోపం పెడుతున్న‌ది ఎవ‌రు? అన్న‌ది విశ్లేషించుకోవాల‌న్న సీరియ‌స్ నిర్ణ‌యానికి రావ‌డం హాట్ టాపిక్ గా మారింది. అయితే దోపిడీ చేసేది ఎవ‌రు?   దోపిడీ  చేయించుకునేది ఎవ‌రు? ఏది బెస్ట్ మీడియా? అన్న‌ది విశ్లేషించుకోవ‌డంలో నిర్మాత‌ల వెన‌క‌బాటుపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News