టాప్ స్టోరి: వెండితెర లేడీ న‌క్స‌ల్స్

Update: 2019-11-08 07:55 GMT
వెండితెర‌పై న‌క్స‌లైట్ పాత్ర‌ల హంగామా అంతా ఇంతా కాదు. న‌క్స‌ల్బ‌రీ ఉద్య‌మం జోరుగా ఉన్న రోజుల్లో అదో ట్రెండ్ అయ్యింది. ఒక ద‌శ‌లో ఈ త‌ర‌హా పాత్ర‌ల్లో న‌టించాల‌ని.. మాస్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ కావాల‌ని ప్ర‌య‌త్నించ‌ని తార‌లు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. కేవ‌లం క‌థానాయ‌కులు మాత్ర‌మే కాదు.. క‌థానాయిక‌లు ఈ త‌ర‌హా పాత్ర‌ల‌పై మ‌క్కువ చూపించారు. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి నుంచి నేటి సాయి ప‌ల్ల‌వి వ‌ర‌కు ఈ పాత్ర‌ల‌పై మోజు పెంచుకున్నావారే. స్టార్ హీరోయిన్ల‌ నుంచి స్టార్ హీరోల వ‌ర‌కు న‌క్స‌లైట్ పాత్ర‌ల్లో ఒదిగి ఆ పాత్ర‌ల‌కే వ‌న్నె తెచ్చారు. ఈ త‌ర‌హా పాత్ర‌ల్లో మెరిసిన క‌థానాయిక‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. అలా చెప్పాలంటే ముందు శ్రీ‌దేవి నుంచి మొద‌లుపెట్టాల్సిందే.

90వ ద‌శ‌కంలో క్రేజీ తార‌గా పేరుతెచ్చుకున్న శ్రీ‌దేవి అప్ప‌ట్లోనే ఓ న‌క్స‌లైట్ నేప‌థ్య చిత్రంలో న‌టించింది. 'షేర్నీ' పేరుతో హిందీలో రూపొందిన ఆ చిత్రాన్ని తెలుగులో మాత్రం 'న‌క్స‌లైట్ దుర్గ‌' పేరుతో అనువ‌దించారు. ఆ త‌రువాత కృష్ణ న‌టించిన 'కంచు కాగ‌డ' వంటి చిత్రాల్లో ఇదే త‌ర‌హా పాత్ర‌ల్లో న‌టించి శ్రీ‌దేవి ఔరా అనిపించింది. ఆ త‌రువాత అదే స్థాయిలో లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజ‌య‌శాంతి ఒసేయ్ రాముల‌మ్మ‌.. అడివి చుక్క వంటి చిత్రాల్లో న‌క్స‌లైట్ పాత్ర‌ల్లో న‌టించి ఆక‌ట్టుకుంది.

అడ‌విలో అన్న‌.. స్వ‌ర్ణ‌క్క.. ఎన్‌కౌంట‌ర్ వంటి చిత్రాల్లో న‌క్స‌లైట్ పాత్ర‌లో మెరిసింది రోజా. ఆ పాత్ర‌ల‌కు రోజానే క‌రెక్ట్ అన్న స్థాయిలో న‌టించి మెప్పించింది. తాజాగా ఈ జాబితాలోకి సాయి ప‌ల్ల‌వి చేర‌బోతోంది. 'నీది నాది ఒకే క‌థ‌' ఫేమ్ వేణు ఊడుగుల తాజాగా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'. రానా హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో  సాయి ప‌ల్ల‌వి న‌క్స‌లైట్‌గా క‌నిపించ‌బోతోంది. 90వ ద‌శ‌కంలో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. హృద్య‌మైన క‌థ‌తో ట్రాజెడీ ఎండింగ్‌తో రాబోతున్న ఈ సినిమా సాయి ప‌ల్ల‌వికి ఎలాంటి ఇమేజ్‌ని తెచ్చిపెడుతుందో చూడాలి.
Tags:    

Similar News