ట్రైలర్: విడాకులు ఇప్పించిన లాయరుతో ప్రేమ 'మళ్ళీ మొదలైంది'..!

Update: 2022-02-01 08:30 GMT
'మళ్ళీరావా' తర్వాత ఆ స్థాయి విజయం కోసం ఎదురుచూస్తున్న అక్కినేని హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం ''మళ్ళీ మొదలైంది''. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్ గా నటించింది. విడాకులు తీసుకున్న ఓ యువకుడు.. తన తరపున వాదించిన న్యాయవాదితోనే ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

'మళ్ళీ మొదలైంది' చిత్రాన్ని ఫిబ్రవరి 11న జీ5 ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా చిత్ర ట్రైలర్‌ ను రిలీజ్ చేసి టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేసారు. విడాకులు తీసుకున్న టామ్ క్రూయిజ్-నికోల్ కిడ్.. మ్యాన్ బిల్ గేట్స్-మిలిందా గేట్స్.. బ్రాడ్ ఫైట్-ఏంజిలినా జోలీ వంటి కొందరి ప్రముఖుల ఫొటోతో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం అలరిస్తోంది.

విడాకులు తీసుకున్న తర్వాత సుమంత్ జీవితంలో జరిగిన ప్రేమ.. సమాజంలో అతని పై చులకన భావం.. ఇతరులు చూపించే సానుభూతి వంటి అంశాలను 'మళ్ళీ మొదలైంది' ట్రైలర్ లో చూడొచ్చు. సుమంత్ - వర్షిణి సౌందర్ రాజన్ భార్యభర్తలుగా.. నైనా లాయరుగా ఆకట్టుకున్నారు. తనకు విడాకులు ఇప్పించిన నైనాతో హీరో ప్రేమలో పడే సన్నివేశాలు అలరిస్తున్నాయి. సుమంత్ - నైనా జోడీ ఫ్రెష్ గా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది.

విడాకులు తీసుకున్న సుమంత్ తో నైనా ఎలా ప్రేమలో పడింది? వీరిద్దరూ పెళ్లి చేసుకొని మళ్ళీ జీవితం మొదలు పెట్టారా లేదా? అనేది తెలియాలంటే కొత్త దర్శకుడు టీజీ కీర్తి కుమార్ రూపొందించిన ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. 'పెళ్లాం వదిలేసిందని, సెకండ్ హ్యాండ్ అని ఒకటే సింపథీ. ప్రతివాడూ తన జీవితంలో ఏదో అద్భుతం సాధిస్తున్నట్టు, నాకేదో అయిపోతున్నట్టు..' అని సుమంత్ చెప్పిన డైలాగ్ మెప్పిస్తోంది.

'మళ్ళీ మొదలైంది' చిత్రంలో సుహాసిని మణిరత్నం - మంజుల ఘట్టమనేని - వెన్నెల కిషోర్ - పోసాని కృష్ణ మురళి - అన్నపూర్ణ - పృథ్వీరాజ్ - తాగుబోతు రమేష్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. అనుప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. కృష్ణ చైతన్య పాటలు రాశారు. శివ జీఆర్ఎన్ సినిమాటోగ్రఫీ అందించగా.. అర్జున్ సురిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. రెడ్ సినిమాస్ చరణ్ తేజ్ సమర్పణలో కె. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.



Full View


Tags:    

Similar News