డ్రగ్స్ కేసు: ముగిసిన సినీ ప్రముఖుల విచారణ.. ఈడీ ఏం తేలుస్తుందో..?

Update: 2021-09-22 16:30 GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ క్రయవిక్రయాలలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ పలువురి సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి విచారించింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం హీరో తరుణ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. తరుణ్ ను సుమారు 7 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. తరుణ్ బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన అధికారులు.. అనుమానాస్పద లావాదేవీల గురించి ఆరా తీశారు. డ్రగ్స్ విక్రేత కెల్విన్ తో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించినట్లు సమాచారం.

2017లో డ్రగ్స్ ఆరోపణలతో తరుణ్ ను ఎక్సైజ్ శాఖ సిట్ విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఈడీ కార్యాలయానికి తరుణ్ తన తండ్రితో కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. తరుణ్ ని ప్రశ్నించడంతో సినీతారల ఈడీ విచారణ ముగిసింది. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులిచ్చి విచారించారు. వారి బ్యాంక్ ఖాతాల వివరాలతో పాటుగా కెల్విన్ తో గల సంబంధాల గురించి ఆరా తీశారు.

పూరి జగన్నాథ్ తో ప్రారంభమైన ఈడీ విచారణ.. తరుణ్ ని విచారించడంతో సినీ ప్రముఖుల విచారణ ముగిసింది. ఆగస్ట్ 31న పూరీని 10 గంటల పాటు.. సెప్టెంబర్ 2న ఛార్మి కౌర్ ను 8 గంటల పాటు అధికారులు విచారించింది. సెప్టెంబర్ 3న ఈడీ ఎదుట హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ ను 6 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 7న నందు ను ప్రశ్నించారు. సెప్టెంబర్ 8న రానా దగ్గుబాటి ని 8 గంటల పాటు అధికారులు విచారించారు. సెప్టెంబర్ 9న రవితేజతో పాటు డ్రైవర్ శ్రీనివాస్ విచారణ 6 గంటల పాటు సాగింది.

సెప్టెంబర్ 13న నవదీప్ తో పాటు, ఎఫ్ క్లబ్ మేనేజర్ ను 9 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్ ను 7 గంటలు.. సెప్టెంబర్ 17న తనీష్ ను 7 గంటల పాటు ప్రశ్నించారు. బుధవారం తరుణ్ ను 7 గంటల పాటు ఈడీ విచారించింది. వీరితోపాటు డ్రగ్స్ సప్లయిర్స్ కెల్విన్ - జీశాన్ లను కూడా అధికారులు ప్రశ్నించారు. సినీ ప్రముఖుల విచారణ ముగియడంతో.. ఎక్సైజ్‌ శాఖ క్లీన్‌ చిట్‌ ఇచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఏమి తెలుస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News