మోహన్ లాల్ తో పోలుస్తూ మెగాస్టార్ పై ట్రోల్స్..!

Update: 2022-09-29 08:35 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా దసరా కానుకగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి.. థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. అయితే దీనిపై ఓ వర్గం నుంచి ట్రోల్స్ వస్తున్నాయి.

మలయాళంలో మంచి విజయం సాధించిన 'లూసిఫర్' చిత్రానికి అధికారిక రీమేక్ గా ''గాడ్ ఫాదర్'' తెరకెక్కిందనే సంగతి తెలిసిందే. అందులో మోహన్ లాల్ పోషించిన పవర్ ఫుల్ రోల్ ని తెలుగులో చిరంజీవి ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచే.. కంప్లీట్ యాక్టర్ స్వాగ్ ని మెగాస్టార్ మ్యాచ్ చేయలేకపోయారని కొందరు కామెంట్స్ చేస్తూ వచ్చారు.

ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన ట్రైలర్ లో పోలీస్ ఆఫీసర్‌ సముద్రఖని ని ఓ బెంచ్ మీద పడేసి, చిరు అతని గుండెల మీద కాలేసి ఒత్తుతున్న ఓ సీన్ ని చూపించారు. అయితే ఒరిజినల్ లో నిలబడి ఉన్న పోలీస్ గుండెల మీద వరకూ కాలెత్తుతాడు. ఇదే ఇప్పుడు ట్రోలర్స్ కు స్టఫ్ గా మారింది.

రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి ఎక్స్ పెక్టేషన్స్ vs రియాలిటీ అంటూ 'గాడ్ ఫాదర్' ను విమర్శిస్తున్నారు. మోహల్ లాల్ ముందు చిరంజీవి తెలిపోయారనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. వెరిఫైడ్ హ్యాండిల్స్ ఉన్న కొందరు తమిళ పీఆర్వోలు సైతం మెగాస్టార్ ను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

ఏదైనా భాషలో సక్సెస్ అయిన చిత్రాన్ని మరో భాషలోకి రీమేక్ చేస్తున్నప్పుడు.. పోలికలు రావడం అనేది సర్వసాధారణం. ఇక్కడ 'గాడ్ ఫాదర్' విషయంలోనూ అదే జరుగుతోంది. కాకపోతే 67 ఏళ్ల చిరంజీవి వయస్సుని పరిగణనలోకి తీసుకోకుండా.. ఇలా నెగెటివ్ కామెంట్స్ చేయడంపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.

మెగాస్టార్ తో మోహన్ లాల్‌ ను పోల్చాల్సి వస్తే.. ప్రతీ విషయంలోనూ కంపేర్ చేయాలని.. ఈ వయసులో చిరంజీవి మాదిరిగా డ్యాన్స్ చేయగలరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మోహన్ లాల్‌ ను తక్కువ చేయడానికి కాదు కానీ.. ప్రతి ఒక్కరికీ పాజిటివ్స్ మరియు నెగెటివ్స్ ఉంటాయి. ఎవరి ప్రత్యేకతలు వాళ్లకున్నాయి.

అందులోనూ చిరంజీవి - మోహన్ లాల్ ఇద్దరూ లెజెండ్స్. ఇండియన్ సినిమాలో ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. ఈ వయస్సులో వారిద్దరికీ ధ్రువీకరణలు అవసరం లేదు. ఇద్దరు గొప్ప నటులను పోల్చుతూ.. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కామెంట్స్ చేయడం సరైనది కాదు. సినిమాలోని కంటెంట్ ను బట్టే ఫలితం ఆధారపడి ఉంటుంది.

మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన 'ఠాగూర్' 'ఖైదీ నెం. 150' వంటి సినిమాలు తమిళ రేమేకులనే సంగతి తెలిసిందే. ఇప్పుడు 'గాడ్ ఫాదర్' కూడా ఆ జాబితాలో చేరుతుందో లేదో అనేది వచ్చే మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ పోలికలకు ఫుల్ స్టాప్ పెడితే మంచిదని సినీ అభిమానులు సూచిస్తున్నారు.

కాగా, 'గాడ్ ఫాదర్' చిత్రానికి రీమేక్స్ స్పెషలిస్ట్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఇందులో సల్మాన్ ఖాన్ - నయనతార - సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబరు 5న తెలుగు హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News