పండుగ సినిమాలకు దెబ్బ పడబోతోందా...?

Update: 2021-12-25 09:32 GMT
పండుగ చూసి పది కాలాలు అయింది కదరా అని బాధగా అనుకుంటోంది టాలీవుడ్. ఇప్పటికి రెండు కరోనాలను అన్నీ బిగపట్టి మరీ ఎదుర్కొని మంచి సీజన్లు అన్నీ కూడా వేస్ట్ గా వదిలేసుకున్న టాలీవుడ్ కి రానున్న సంక్రాంతి కూడా సంతోషాన్ని కలిగిస్తుందా లేదా అన్న సందేహాలు అయితే అందరిలో కలుగుతున్నాయి. చూస్తూండగానే కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ జోరుగా ఇండియాలో పాకుతోంది.

మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ కర్నాటక వంటి చోట్ల విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. దాంతో పాటు ఆంక్షలు కూడా వచ్చేశాయి. చాలా రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. దాంతో రాత్రి తొమ్మిది అయితే చాలు అన్నీ దుకాణాలూ పూర్తిగా కట్టేయాల్సిందే. ఎక్కడివారు అక్కడ గప్ చిప్ అయిపోవాల్సిందే.

ఈ నేపధ్యంలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్నా రెండు తెలుగు సినిమాల మీద అందరి దృష్టి ఉంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ల ట్రిపుల్ ఆర్ జనవరి 7న విడుదల అవుతూంటే 14న ప్రభాస్ రాధేశ్యామ్ వస్తోంది. ఈ రెండు సినిమాలకూ అద్భుతమైన పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ మూవీస్ రిలీజ్ కావాలే కానీ పాత రికార్డులు అన్నీ బద్ధలు కొట్టడం ఖాయం.

అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు చూసినా ఒమిక్రాన్ కేసులు పెరుగుదల చూసినా కొత్త ఏడాదిలో మరిన్ని కొత్త నిబంధలను పెడతారు అని టాక్ నడుస్తోంది. ఇక తెలంగాణాలో కూడా ఒమిక్రాన్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఏపీలో నంబర్ నెమ్మదిగా ముందుకు సాగుతోంది.

ఇవన్నీ చూసినపుడు కచ్చితంగా ఆక్షలు ఇవాళ కాకపోయినా రేపు అయినా వర్తింపచేయడం ఖాయం. కేంద్రం కూడా రాష్ట్రాలు ఒమిక్రాన్ వ్యాపించకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించింది. ఈ నేపధ్యంలో ఒడిషా సర్కార్ ఆ దిశగా సాగుతోంది. తమిళనాడు కూడా అదే బాటన సాగనుంది. ఇవన్నీ చూసుకున్నపుడు పాన్ ఇండియా మూవీస్ కి గడ్డు కాలమేనా అన్న చర్చ అయితే వాడిగా వేడిగా సాగుతోంది.

ఇప్పటికి అనేక సార్లు వాయిదా పడిన ట్రిపుల్ ఆర్ మరో సారి వాయిదా పడుతుందా అన్న మాట కూడా వినిపిస్తోంది. అలా కాదు, కూడదు అని మొండిగా చెప్పిన డేట్ కే మూవీ రిలీజ్ చేస్తే మాత్రం భారీ ఎత్తున కలెక్షన్లకు కోత పడుతుంది అన్న టాక్ ఉంది. అదే విధంగా రాధేశ్యామ్ కి కూడా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మొత్తానికి ఈ రెండు పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇపుడు సందిగ్దం అయితే కొనసాగుతోంది. ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News