ఇది శ్రీరెడ్డి ఎఫెక్టేనా? కాదా?

Update: 2019-04-17 12:40 GMT
లైంగిక వేధింపులు లేని రంగం లేదు. కానీ సినిమా ఇండస్ట్రీలో అవి చాలా ఎక్కువ. అయితే... తెలుగు సినిమా పరిశ్రమలో ఈ వేధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ ఆ మధ్య శ్రీరెడ్డి చేసిన పోరాటంతో తెలుగు సినిమా రంగంలో ఓ కుదుపు వచ్చింది. ఎంతకైనా తెగిస్తాను కానీ ఈ పోరాటం ఆపను అంటూ ఆమె అప్పట్లో భారీ హడావుడే చేసింది. ఆమెకు చాలామంది మద్దతు పలికారు. విమర్శలు చేసిన వారు కూడా ఉన్నారు. అయితే, శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్‌ పై తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికి కదలిక వచ్చింది. ఆ పిటిషను పై స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక ప్యానెల్ ఏర్పాటుచేసింది. ఈ మేరకు ఓ జీవో (నెం.984) విడుదల చేసింది.
 
ప్రభుత్వం ఏర్పాటుచేసిన లైంగిక వేధింపుల కమిటీలో సినీ నటులు సుప్రియ, ఝాన్సీ (యాంకర్), నందిని రెడ్డి(డైరెక్టర్) లు టాలీవుడ్‌ ప్రతినిధులు నియమిస్తూ ... ఇంకొంత మంది ప్రముఖులు... నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మిలతో ఈ కమిటీ ఏర్పాటుచేసింది ప్రభుత్వం. సభ్యులుగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకనిర్మాత సుధాకర్ రెడ్డిలను చేర్చింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు ఈ కమిటీకి చైర్మన్‌ గా వ్యవహరిస్తారు.  

ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల నివారణకు చర్యలు తీసుకోవడం, అలాంటి చర్యలకు పాల్పడిన వారిని విచారించి ప్రభుత్వానికి నివేదించడం. ఇకపై ఎవరైనా స్వేచ్ఛగా మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీకి చెప్పుకోవచ్చు. మరి... తమ కళను నిరూపించుకోవడం కోసం ఈ పరిశ్రమకు వచ్చి... విసిగి వేసారిన వారు అవకాశాల కోసం పాపం ఏదైనా త్యాగం చేయడానికి ఇష్టపడే సందర్భాలుంటున్న నేపథ్యంలో ఈ కమిటీకి ఎంత మంది నివేదిస్తారో చూడాలి.


    
    
    

Tags:    

Similar News