'వ‌కీల్ సాబ్' కు వచ్చిన పరిస్థితి రాకూడదనే ఇలాంటి నిర్ణయం..!

Update: 2021-09-04 08:31 GMT
నాని హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన 'ట‌క్ జ‌గ‌దీష్‌' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే నాని చిత్రాన్నిడిజిటల్ రిలీజ్ చేస్తుండటం పట్ల టాలీవుడ్ ఎగ్జిబిటర్స్ అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సినిమాని నిర్మించిన షైన్ స్క్రీన్ ప్రొడ్యూసర్స్ ని నాని అభిమానులు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.

వాస్తవానికి నాని కూడా 'టక్ జగదీష్' సినిమాని థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయించాలని గట్టిగానే ట్రై చేసాడు. చివరకు నిర్మాత‌ల ఆర్థిక పరిస్థితులు.. వారి నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇవ్వడానికి అంగీకారం తెలపాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన ట్రైలర్ ఈవెంట్ లో ఈ సినిమాని ఓటీటీలో విడుదల గురించి నాని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన సాహు గార‌పాటి 'టక్ జగదీష్' చిత్రాన్ని ఎందుకు ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చిందనే విష‌యం గురించి మాట్లాడారు.

''కరోనా వైరస్ థ‌ర్డ్ వేవ్ గురించి జనాలు భయపడుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మా సినిమాని థియేట‌ర్లలో విడుద‌ల చేయ‌డం చాలా పెద్ద రిస్క్‌ అని భావించాం. 'వ‌కీల్ సాబ్' చిత్రం మంచి టాక్ తో న‌డుస్తున్న‌ప్పుడు సెకండ్ వేవ్ వచ్చి.. స‌డ‌న్ గా థియేట‌ర్లు మూతబడ్డాయి. అలాంటి ప‌రిస్థితి మ‌ళ్లీ వ‌స్తే ఇబ్బందే. అందులోనూ పలు చోట్ల ఇంకా సింగిల్ స్క్రీన్లు ఓపెన్ చేయ‌లేదు. ఏపీలో మూడు షోలే న‌డుస్తున్నాయి. ఓవ‌ర్సీస్ లో ప‌రిస్థితి ఇంకా దారుణంగా ఉంది'' అని 'టక్ జగదీష్' నిర్మాత తెలిపారు.

''ఎవ‌రినో ఇబ్బంది పెట్టాల‌ని ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వ‌లేదు. నిజానికి ఓటీటీకి ఇవ్వ‌డం వ‌ల్ల మాకే న‌ష్టం. థియేట‌ర్ రెవిన్యూ ఓటీటీ నుంచి రాదు. 'జాతిర‌త్నాలు' 'ఉప్పెన' చిత్రాలు ఎంత వ‌సూలు చేశాయో అందరికీ తెలిసిందే. ఏ హీరోకైనా ద‌ర్శ‌కుడికైనా నిర్మాత‌కైనా త‌న సినిమాని ప్రేక్ష‌కుల‌కు చూపించుకోవాల‌ని ఉంటుంది. ఎప్పుడో ఈ సినిమాని పూర్తి చేసి సిచ్యువేషన్ ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందా అని ఎదురు చూశాం. ఇంకా ఎక్కువ రోజులు హోల్డ్ చేయ‌లేము. అందుకే ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. 'ట‌క్ జ‌గ‌దీష్' ఫ్యామిలీ అంతా క‌ల‌సి చూడాల్సిన సినిమా. వాళ్లంతా పండ‌గ రోజున ఇంట్లో కూర్చుని ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాల‌న్న‌దే మా ఆశ‌'' అని సాహు గార‌పాటి అన్నారు.
Tags:    

Similar News