ఎన్టీఆర్ లో ఇంత ఫిలాసఫీ ఏంటి బాబోయ్

Update: 2016-01-24 11:30 GMT
2009 మార్చి 26న జరిగిన యాక్సిడెంట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని.. జీవితాన్ని తాను చూసే కోణమే మారిపోయిందని అంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అది తనకు రెండో పుట్టిన రోజని.. అదే రోజు తన భార్య లక్ష్మీప్రణతి బర్త్ డే కావడంతో మార్చి 26 అంటే తమ ఇంట్లో రెండు పుట్టిన రోజులు జరుగుతాయని వెల్లడించాడు ఎన్టీఆర్. ఆ యాక్సిడెంట్.. ఆ తర్వాత తనలో వచ్చిన మార్పు గురించి ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించాడతను.

‘‘మా అమ్మ పడుకునేటపుడు పొద్దున ఏం టిఫిన్ చేయాలని అడుగుతుంటుంది. నేనేమో ‘పొద్దున లేవాలి కదా అమ్మా. ఎవరికి తెలుసు. ఇదే చివరి నిద్రేమో అంటుంటా. నా ఆలోచనలు ఇలా ఉంటాయి. ఆశ అనే చిన్న రేఖపై మనం బతుకుతున్నాం. ఏమో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. నా కోరిక ఒక్కటే చనిపోయే ముందు ఒక్క క్షణం కూడా గిల్టీగా ఫీలవకూడదు. చావూ.. వచ్చావా, నన్ను తీసుకెళ్లిపో అని వెళ్లిపోవాలి.నేనిలా ఆలోచించడానికి 2009లో జరిగిన ప్రమాదమే కారణం. ఆ క్షణాలు నాకింకా గుర్తు. ఎక్కడెక్కడ ఎన్ని ఎముకలు విరిగాయో నాకు స్పష్టంగా తెలిసిపోయింది.

సూర్యాపేట ఆసుపత్రికి వెళ్తుంటే నాకు జీవితమంతా కళ్లముందు కదిలింది. నా సినిమాలు, అమ్మ, అభిమానులు, నా వస్తువులు, నేను పెంచుకున్న కుక్క సహా అన్నీ గుర్తుకొచ్చాయి. ఏంటీ జీవితం అయిపోయిందా అనిపంచింది. చచ్చిపోతానన్న భయం లేదు కానీ.. సాధించాల్సింది ఇంకా ఉంది కదా అనిపించింది. ఐతే అమ్మ దీవెనలు, అభిమానులు, తాతయ్య ఆశీస్సులతో బతికి బట్టకట్టగలిగా. ఆ రోజు మళ్లీ పుట్టాను. ఆ ప్రమాదం నన్ను చాలా మార్చింది. అప్పట్నుంచి చాలా కూల్ అయిపోయా. జీవితంపై నా దృక్పథం మారింది. బాధలో ఉన్నా నవ్వడం నేర్చుకున్నా’’ అని చెప్పాడు ఎన్టీఆర్.
Tags:    

Similar News