ఆ ఇద్దరు నటులు ఎలా చనిపోయారంటే..

Update: 2016-11-08 04:34 GMT
కన్నడ సినిమా ‘మస్తి గుడి’ షూటింగ్ లో భాగంగా ఇద్దరు యువ నటులు చనిపోవడం మొత్తం భారతీయ సినీ పరిశ్రమనే దిగ్భ్రాంతికి గురి చేసింది. షూటింగ్ లో భాగంగా అందరూ చూస్తుండగా.. ఇలా ఇద్దరు నటులు చనిపోవడం దారుణమైన విషయం. ఆ సినిమా క్లైమాక్సును రూ.1.2 కోట్లు పెట్టి తీస్తున్నారట. మరి అంత ఖర్చు పెడుతున్న వాళ్లు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆ నటులతో అంత సాహసం చేయించారు అని సందేహాలు కలగడం ఖాయం. ఐతే ఆ చిత్ర యూనిట్ కొంతవరకు అప్రమత్తంగానే ఉన్నా.. దురదృష్టం కొద్దీ ఆ ఇద్దరు నటుల ప్రాణాలు పోయాయి.

నీళ్లలో మునిగి చనిపోయిన ఉదయ్.. అనిల్.. సినిమాలో విలన్లు. వాళ్లు నీళ్లలోకి దూకితే.. వారి వెంటే హీరో అయిన దునియా విజయ్ దూకి వాళ్లను వెంటాడాలి. ఇదీ సీన్. విలన్లుగా నటించిన ఇద్దరూ బేర్ బాడీలతో కనిపించాలి. ఈ సన్నివేశం కోసమే వాళ్లు భారీగా బాడీలు కూడా పెంచారు. జిమ్ లో ఇద్దరూ కండలు పెంచుతున్న ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఐతే హీరో మాత్రం డ్రెస్సుతో ఉంటాడు. అందుకే అతడికి లైఫ్ జాకెట్ కూడా ఇచ్చారు. ఉదయ్.. అనిల్ లకు ఈత వచ్చు. అందుకే దూకి ఈదుకుంటూ రావడానికి వాళ్లేమీ అడ్డు చెప్పలేదు. ఏదైనా ఇబ్బంది వస్తే రక్షించేందుకు కొంచెం దూరంలో చిన్న బోట్ పెట్టారు.

ఐతే వీళ్లందరూ చేసిన పెద్ద తప్పేంటంటే.. రిజర్వాయర్లో నీటి ఫ్లో గురించి అంచనా వేయకపోవడం. అందులో నీళ్లు వేగంగా ఫ్లో అవుతున్నాయి. దీంతో నీళ్లలోకి దూకిన ముగ్గురూ వెనక్కి కొట్టుకుంటూ వెళ్లారు. లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి విజయ్ కు ఇబ్బంది లేకపోయింది. కానీ మిగతా ఇద్దరూ ఈత కొడుతున్నా ముందుకు రాలేకపోయారు. వాటర్ ఫ్లో వాళ్లను ఒడ్డుకు రాకుండా వెనక్కి లాగేసింది. దురదృష్టం కొద్దీ వీళ్లను కాపాడాల్సిన బోట్ ఆ సమయానికి స్టార్ట్ అవ్వలేదు. ఉదయ్.. అనిల్ ప్రమాదంలో ఉన్న సంగతి గుర్తించి బోట్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించారు కానీ.. అది స్టార్టవ్వలేదు. దీంతో ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. యూనిట్ సభ్యులు చూస్తుండగానే ఇద్దరు నటులూ మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News