నాని 'జెర్సీ' కి రెండేళ్లు.. అర్జున్ ని గుర్తు చేసుకున్న నేచురల్ స్టార్..!

Update: 2021-04-19 11:30 GMT
నేచురల్ స్టార్ నాని - శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ''జెర్సీ''. క్రికెట్ నేపథ్యాన్ని తీసుకొని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఒక ఎమోషనల్ చిత్రంగా దీన్ని తెరకెక్కించారు. సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా విమర్శకులు ప్రశంసలు కూడా అందుకుంది. నాని - శ్రద్ధా శ్రీనాథ్ తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా నాని అయితే అర్జున్ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పవచ్చు. 'జెర్సీ' విడుదలై నేటికి రెండేళ్లు పూర్తైన సందర్భంగా హీరో నాని ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.

నాని తన ట్విట్టర్ ఖాతాలో 'జెర్సీ' సినిమాలో అర్జున్ పాత్రకు సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేసాడు. ఈ పిక్ లో నిస్సహాయతతో సోఫాలో కూర్చొని ఉన్న నాని ని చూస్తే ఇందులో ఆయన ఎంత నేచురల్ గా నటించాడో అర్థం అవుతుంది. ఇకపోతే 'జెర్సీ' సినిమాకి టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అందుకుంది. అలానే 'ఉత్తమ తెలుగు చిత్రం'గా నేషనల్ అవార్డ్ దక్కించుకోవడమే కాకుండా 'ఉత్తమ ఎడిటర్' గా నవీన్ నూలి కి అవార్డు వరించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వ ప్రతిభతో పాటుగా అనిరుధ్ సంగీతం - సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ ఈ సినిమా విజయానికి దోహదం చేశాయి.

ఇదిలా ఉండగా 'జెర్సీ' సినిమాని అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ క‌పూర్ హీరోగా మాతృకను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కోచ్ పాత్రలో షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ నటిస్తున్నారు.. బాలీవుడ్ ప్రొడ్యూసర్ అమన్ గిల్ తో కలిసి అల్లు అరవింద్ - దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న హిందీ 'జెర్సీ' సినిమాని దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేయనున్నారు.



Tags:    

Similar News