భాజ‌పాలో చేరుతున్న మెగా నిర్మాత‌!

Update: 2019-09-18 07:00 GMT
మెగా నిర్మాత.. వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ భాజ‌పాలో చేరుతున్నారా? అంటే అవున‌నే సంకేతం అందింది. ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత అయిన అశ్వ‌నీద‌త్ .. ఆయ‌న అల్లుడు నాగ్ అశ్విన్.. కుమార్తె ప్రియాంక ద‌త్  భాజ‌పాలో చేరే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. విజ‌య‌వాడ మాచ‌వ‌రం పోతినేని వారి వీధికి చెందిన చ‌ల‌సాని వారి వాస్త‌వ్యుడు ద‌త్ జీ తొలి నుంచీ తేదేపాకు అత్యంత అనుకూలురు అన్న సంగ‌తి తెలిసిందే. తేదేపా త‌ర‌పున‌ ఇదివ‌ర‌కూ పోటీ చేసిన‌ ద‌త్ ఎట్ట‌కేల‌కు భాజ‌పాలో చేరుతున్నార‌న్న వార్త‌తో ఫిలిం వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

తాజాగా హైద‌రాబాద్ లోని ద‌త్ కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి - రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ .. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి త‌దిత‌రులు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వీరి మ‌ధ్య సుదీర్ఘంగా మాటా మంతీ సాగింది. మోదీ ప్రభుత్వం సాధించిన ఆర్టికల్ 370 విజయ కరదీపికను.. మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి నివేదికను ఈ సంద‌ర్భంగా అందజేశారు.

ద‌త్ తో ఆయ‌న‌ కుటుంబ స‌భ్యుల‌తో కేంద్ర‌మంత్రి జోషి చాలాసేపు ముచ్చ‌టించారు. ఈ ముచ్చ‌ట్ల‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన మ‌హాన‌టిపై ప్ర‌శంస‌లు కురిపించార‌ట‌. అలాగే దాదాపు ఇర‌వై నిమిషాల ముచ్చ‌ట్ల‌లో మోదీని ద‌త్ జీ పొగిడేయ‌డం ఆస‌క్తిని క‌ల‌గిస్తోంది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నిర్ణ‌యాన్ని ద‌త్ ప్ర‌శంసించారు. దేశం కోసం మోదీ ఎంతో చేశార‌ని.. వార‌ణాశిని గొప్ప‌గా అభివృద్ధి చేశార‌ని వాజ్ పేయి త‌ర‌వాత మోదీ వ‌ల్ల‌నే ఇలాంటి అభివృద్ధి సాధ్య‌మైంద‌ని ద‌త్ ప్ర‌శంసించారు. ఆస‌క్తిక‌రంగా ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై దృష్టి సారించాలని మోదీ ప్రభుత్వాన్ని కోరార‌ని ద‌త్ అన్నారు. మోదీ ప్ర‌భుత్వానికి తెలుగు సినీప‌రిశ్ర‌మ త‌ర‌పున త‌మ వంతు మ‌ద్ధ‌తు ఉంటుంద‌ని ద‌త్ ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.


Tags:    

Similar News