సౌత్ ఇండియా మొత్తం రౌండ‌ప్ చేస్తార‌ట‌!

Update: 2022-07-08 03:30 GMT
ప్ర‌స్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌, సాండ‌ల్ వుడ్‌, మాలీవుడ్ ఎక్క‌డ చూసినా ఒక‌టే మాట పాన్ ఇండియా సినిమా. గ‌త కొంత కాలంగా ఒక భాష‌కే ప‌రిమిత‌మైన మ‌న హీరోలు ఇప్ప‌డు పాన్ ఇండియా వెంట ప‌డుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్ని ప్ర‌స‌న్నం చేసుకోవాల‌ని పాకులాడుతున్నారు. ఒక్క లాంగ్వేజ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వున్న ప్ర‌ధాన భాష‌ల్లోనూ స‌త్తా చాటుకోవాల‌ని, ఇందు కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇప్ప‌టికే కొంత మంది స్టార్స్ పాన్ ఇండియా ప్రేక్ష‌కుల్ని టార్గెట్ గా చేసుకుని బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలు చేస్తున్నారు. కానీ టైర్ టు హీరోలు మాత్రం సౌత్ ఇండియాని క‌వ‌ర్ చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని 'ద‌స‌రా' సినిమాతో పాన్ ఇండియాని టార్గెట్ చేసుకున్నాడు. అయితే అత‌ని ప్ర‌ధాన టార్గెట్ మాత్రం సౌత్ ఇండియానే. టైర్ టు హీరోల్లో ఒక్క విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్ర‌మే పాన్ ఇండియాని టార్గెట్ చేసుకున్నాడు.

మిగ‌తా వాళ్లంతా సౌత్ ఇండియా మొత్తం రౌండ‌ప్ చేసేయాలని, ఆ త‌రువాతే పాన్ ఇండియా డ్రీమ్ ఫుల్ చేసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఉస్తాద్ రామ్ 'ది వారియ‌ర్‌' మూవీతో త‌మిళంలోకి ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. మాసీవ్ యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగుస్వామి ఈ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల్లో బైలింగ్వ‌ల్ మూవీగా చేస్తున్నారు. నాని కూడా త‌మిళ మార్కెట్ పై క‌న్నేశాడు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన 'అంటే సుంద‌రానికి', 'శ్యామ్ సింగ‌రాయ్‌' త‌మిళంలోనూ విడుద‌లైన విష‌యం తెలిసిందే.

ఇదే త‌ర‌హాలో హీరో గోపీచంద్ కూడా బైలింగ్వ‌ల్ మూవీకి రెడీ అవుతున్నాడు. 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌' అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో 'సింగం' సిరీస్ చిత్రాల దర్శ‌కుడు హ‌రి డైరెక్ష‌న్ లో బైలింగ్వ‌ల్ మూవీ చేయ‌బోతున్నాడు. ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది. ఇక అక్కినేని నాగ‌చైత‌న్య కూడా ఇత‌ర భాష‌ల‌పై దృష్టిపెట్టాడు. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య ఓ బైలింగ్వ‌ల్ మూవీని చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఇదే చైతూ చేస్తున్న తొలి త‌మిళ సినిమా. ఇదే బాట‌లో యంగ్ హీరో నిఖిల్ కూడా త‌మిళ ఇండ‌స్ట్రీపై క‌న్నేశాడు. ప్ర‌స్తుతం చేస్తున్న 'కార్తికేయ 2' తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ విడుద‌ల కాబోతోంది. దీనితో పాటు తాజాగా మొద‌లైన 'స్పై' మూవీని కూడా ఇదే త‌ర‌హాలో రిలీజ్ చేయాల‌ని ముందే నిఖిల్ ప్లాన్ చేసుకున్నాడు.

ఇక అఖిల్ కూడా 'ఏజెంట్' తో పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని ప్లాన్ చేస్తూ త‌మిళంలోనూ ఈ మూవీతో పాగా వేయాల‌నుకుంటున్నాడు. ఇలా.. ఈ హీరోల‌తో పాటు మ‌రి కొంత మంది కూడా ఇదే బాట‌లో ముందు సౌత్ ఆ త‌రువాతే పాన్ ఇండియా అంటూ త‌మ సినిమాల‌కు ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.
Tags:    

Similar News