'అవ‌తార్' వసూళ్ల‌లో స‌గం కూడా క‌ష్ట‌మే!

Update: 2022-12-25 08:14 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా `అవ‌తార్ 2` థియేట‌ర్ల‌లో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కానీ ఈ చిత్రం ఆశించిన రికార్డుల‌ను అధిగ‌మించ‌డంలో త‌డ‌బ‌డింది. అత్యంత భారీ హైప్ తో రిలీజైన ఈ చిత్రం `అవ‌తార్` (2.9బిలియ‌న్ డాల‌ర్లు) పేరిట ఉన్న రికార్డుల‌ను కొట్టేయ‌డంతో పాటు అవెంజ‌ర్స్ - ఇన్ ఫినిటీ వార్ రికార్డుల (2 బిలియ‌న్ డాల‌ర్లు)ను బ్రేక్ చేస్తుంద‌ని భావించారు. కానీ అవ‌తార్ - ది వే ఆఫ్ వాట‌ర్ (అవ‌తార్ 2) ఆశించిన ఫ‌లితాన్ని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. క‌నీసం ఒక బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌ను అందుకోవ‌డం కూడా క‌ష్టంగా క‌నిపిస్తోంది.

అవ‌తార్ 2 అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ క‌మ‌ర్షియ‌ల్ గా ఆశించిన రేంజుకు చేర‌లేక‌పోయింది. నిజానికి అవ‌తార్ (2009) చిత్రం 2.9 బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌తో ఇప్ప‌టికీ నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. ఈ మొత్తం దాదాపు 18000 కోట్ల‌కు స‌మానం. ప‌దేళ్ల నాటి వ‌సూళ్లు అవి. ఇప్ప‌టి క‌రెన్సీ ప్ర‌కారం 23000 కోట్లు.

కానీ అవ‌తార్ 2 వ‌సూళ్ల‌ను ప‌రిశీలిస్తే ఇది 9 రోజుల‌లో కేవ‌లం 4000 కోట్ల (600 మిలియ‌న్ డాల‌ర్లు) కు మాత్ర‌మే ప‌రిమితమైంది. అవెంజ‌ర్స్ - ఇన్ ఫినిటీ వార్ సైతం అప్ప‌ట్లో 16000 కోట్ల వ‌సూళ్ల‌తో టాప్ 2లో నిలిచింది. ఫుల్ ర‌న్ లో అయినా బిలియ‌న్ డాల‌ర్ మార్క్ (7000 కోట్లు) అందుకుంటుందా అంటే సందేహ‌మే. క‌నీసం ఇన్ ఫినిటీ వార్ రికార్డుకు కూడా ద‌రిదాపుల్లో అవ‌తార్ 2 లేనే లేద‌ని విశ్లేషిస్తున్నారు.

జేమ్స్ కామెరూన్ అవతార్ 2 విడుదలై తొమ్మిది రోజులు అయ్యింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ‌ర్వాలేద‌నిపించే వసూళ్లను సాధిస్తోంది. కానీ అసాధార‌ణ విజ‌యం సాధించలేదు. ఇది 3డిలో అద్భుత సినిమా. సాంకేతికంగా అత్యుత్త‌మ‌మైన‌ది. కానీ కొన్ని లోపాలున్నాయి. పైగా క‌రోనా త‌ర్వాత రిలీజ‌వ‌వ్వడం ఫేట్ ని నిర్ణ‌యించింది. మైండ్ బ్లోయింగ్ .. వండ‌ర్ ఫుల్.. రికార్డు బ్రేకింగ్ అంటూ వ‌ర్ణించేందుకు ఈ మూవీలో కంటెంట్ స‌హ‌క‌రించ‌లేద‌న్న విశ్లేష‌ణ సాగింది. ఈ చిత్రానికి ఆరంభం మిశ్ర‌మ స‌మీక్ష‌లు రావ‌డం అలానే .. చైనా- అమెరికా లాంటి చోట్ల క‌రోనా మూడో వేవ్ విజృంభించి ప్ర‌పంచ దేశాల‌ను భ‌య‌పెట్ట‌డం కూడా వ‌సూళ్లు నెమ్మ‌దించ‌డానికి కార‌ణ‌మైంది.

అవతార్ 2 ప్రపంచవ్యాప్తంగా ఇప్ప‌టికి దాదాపు 607 మిలియన్ డాల‌ర్లు వసూలు చేసింది. ఇది టాప్ గన్: మావెరిక్ కలెక్షన్ 715 మిలియన్ డాల‌ర్ల‌ను సులభంగా అధిగమించగలదు. కానీ అసలు మొదటి అవతార్స పేరిట ఉన్న 2.5 బిలియన్ డాల‌ర్ల‌ గ్లోబల్ కలెక్షన్ రికార్డును అందుకోవ‌డం అసాధ్యం. ఫ్రాంచైజీ పార్ట్ 2 కి రికార్డ్ ఎక్కడా అందుబాటులో లేదు.

ఇక భార‌త‌దేశంలో అవ‌తార్ 2 ఆశించిన దానికంటే అద్భుత వ‌సూళ్ల‌ను సాధిస్తోంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఈ చిత్రం రెండవ శ‌నివారం రూ. 20 కోట్ల నెట్ ను వసూలు చేసింది. భార‌త‌దేశంలో ఓవరాల్ కలెక్షన్ లు రూ. 200 కోట్ల నెట్ కు చేరుకుంటుంద‌ని స‌మాచారం. భార‌త‌దేశంలో అవతార్ 2 వేగంగా 300 కోట్ల నెట్ మార్క్ ను చేరుకుంటుంద‌ని 400 కోట్లు వ‌సూలు చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. దక్షిణాది నుండి ప్రధాన కలెక్షన్లు వస్తున్నాయి.  మొత్తం భారతీయ కలెక్షన్లలో 50 శాతం వాటా ద‌క్షిణాది నుంచే ద‌క్కుతున్నాయ‌ని స‌మాచారం. ర‌వితేజ‌ ధమాకా (తెలుగు) .. ర‌ణ‌వీర్ సర్కస్ ల‌తో అవ‌తార్ 2 పోటీప‌డుతోంది. ఈ క్రిస్మస్ వ‌సూళ్ల‌కు మ‌రింత క‌లిసి రానుంద‌ని కూడా ఒక అంచ‌నా.

భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో రెండవ శనివారం కలెక్షన్లు పెరగడంతో అవతార్ 2 అత్యుత్తమ వృద్ధిని సాధించింద‌ని BOI ప్రక‌టించింది. ప్రత్యేకించి ఇప్పుడు సర్కస్ ఫెయిలైనందున ముంబై సర్క్యూట్ లలో అవ‌తార్ 2 హ‌వా కొన‌సాగ‌నుంద‌ని అంచ‌నా. అలాగే భారతదేశంలో విడుదలైన హాలీవుడ్ చిత్రాలన్నిటిలోను అవతార్ 2 నంబ‌ర్ వ‌న్ రికార్డును అందుకునే ఛాన్సుంద‌ని కూడా విశ్లేషిస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

టైటానిక్ తర్వాత బాక్సాఫీస్  వద్ద USD 2 బిలియన్లకు పైగా వసూలు చేసిన కామెరాన్ రెండవ చిత్రంగా అవ‌తార్ నిలిచింది. ప్రస్తుతం అవ‌తార్ (2009) ఆల్ టైమ్ అత్యధిక వసూళ్ల రికార్డును వేరొక సినిమా బ్రేక్ చేయ‌లేదు. అవతార్: ది వే ఆఫ్ వాటర్ భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సినిమాలో కొన్ని అద్భుతమైన ట్విస్ట్ లు మ‌లుపుల‌ను ఇవ్వడంలో విఫలమవడంతో సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. అవ‌తార్ చిత్రం ఇప్ప‌టికి భార‌త‌దేశంలో దాదాపు రూ.227 కోట్ల కలెక్షన్లను రాబట్టగలిగింది,. తద్వారా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మార్నింగ్ షో - మ్యాట్నీకి దాదాపు 40శాతం ఆక్యుపెన్సీ.. ఈవినింగ్ షోలకు 70శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమా భారతదేశంలో రూ.400 కోట్ల క్లబ్‌ను చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News