మూవీ రివ్యూ: 'ఉప్పెన'

Update: 2021-02-12 14:34 GMT
చిత్రం : 'ఉప్పెన'
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్-కృతి శెట్టి-విజయ్ సేతుపతి-సాయిచంద్-గాయత్రి జయరామన్-మహదేవన్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: శ్యామ్ దత్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని-రవిశంకర్ యలమంచిలి
రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా

ఉప్పెన.. ఏడాది కిందట్నుంచి తెలుగు సినీ ప్రియుల చర్చల్లో ఉన్న సినిమా. గత ఏడాది వేసవిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ‘ఉప్పెన’ ఆ అంచనాలను ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

శేషారాయణం (విజయ్ సేతుపతి) కులం, పరువే ప్రాణంగా బతికే పెద్ద మనిషి. తాను ప్రాణం తీయాలనుకున్న వ్యక్తి తన కులం అని తెలిస్తే వదిలేసేంత కులాభిమానం అతడిది. అతను సముద్రం ఒడ్డున చేపలు పట్టుకుంటూ బతికే జాలరులందరి ఇళ్లు ఖాళీ చేయించి అక్కడో షిప్ యార్డ్ కట్టాలనుకుంటాడు. అందుకోసం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాడు. ఈ సంగతిలా ఉంటే.. రాయణం కూతురైన బేబమ్మ (కృతి శెట్టి)ని చిన్నతనం నుంచే జాలర్ల కుటుంబానికి చెందిన ఆశి (వైష్ణవ్ తేజ్) ప్రేమిస్తుంటాడు. తనకు కాబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆశిలో కనిపించడంతో అతణ్ని బేబమ్మ ప్రేమిస్తుంది. కొంత కాలం వీరి ప్రేమాయణం సాఫీగానే సాగుతుంది కానీ.. ఈ సంగతి రాయణంకు తెలియడంతో కథ అడ్డం తిరుగుతుంది. ఆ తర్వాత ఎదురైన పరిణామాలేంటన్నదే మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఒక పెద్దింటి అమ్మాయి.. ఒక పేదింటి కుర్రాడు.. ఇద్దరూ ప్రేమలో పడతారు. చాటుగా ప్రేమించుకుంటారు. కూతురినే పరువుగా భావించే అమ్మాయి తండ్రికి విషయం తెలిసి తన కర్కశత్వాన్ని చూపిస్తాడు. వీరిని విడదీయడానికి ఏం చేయాలో అన్నీ చేస్తాడు. మరి ఈ అడ్డంకుల్ని దాటి హీరో హీరోయిన్లు ఎలా ఒక్కటయ్యారనే కథతో తెలుగులో ఎన్ని సినిమాలు తెరకెక్కాయంటే వందల్లో చెప్పొచ్చు. ‘ఉప్పెన’ కూడా డిట్టో ఈ లైన్లో నడిచే కథ. ఈ కోణంలో చూస్తే సినిమాలో కొత్తదనం కనిపించదు. కానీ కథ లైన్ చూస్తే చాలా పాతగానే అనిపించినా.. ఒక ప్రేమకథ నుంచి ప్రేక్షకులు ఆశించే రొమాంటిక్ మూమెంట్స్ ను అందంగా ఆహ్లాదకరంగా చూపించడంలో.. చివర్లో ఈ కథకు ప్రాణం అనదగ్గ షాకింగ్ ట్విస్టును కన్విన్సింగ్ గా చెప్పడంలో కొత్త దర్శకుడు బుచ్చిబాబు విజయవంతం అయితే.. వీనుల విందైన సంగీతంతో దేవిశ్రీ ప్రసాద్.. కనువిందైన విజువల్స్ తో శ్యామ్ దత్ తమ వంతుగా ఈ ప్రేమకథను పండించే ప్రయత్నం చేశారు. ఇక రాజీ లేని నిర్మాణ విలువలు కూడా ఈ ‘ఉప్పెన’కు బలమయ్యాయి. ఓవరాల్ గా ‘ఉప్పెన’ ప్రేమకథల ప్రేమికులకు నచ్చేలా తయారైంది.

హీరోయిన్ని చిన్నతనంలోనే చూసి హీరో ప్రేమలో పడిపోవడం.. ఆమెను చాటుగా ప్రేమించడం.. హీరో ఫైటింగ్ చూసి హీరోయిన్ ప్రేమలో పడిపోవడం.. హీరోయిన్ ఇంట్లో కాలేజీకని చెప్పి వెళ్లి హీరోతో తిరగడం.. ఇలా ‘ఉప్పెన’లో కథ పరంగానే కాదు.. ప్రేమ సన్నివేశాల్లోనూ ఏ కొత్తదనం కనిపించదు. అయినా సరే ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చూడటంలో బుచ్చిబాబు విజయవంతం అయ్యాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ ఈ ప్రేమకథకు ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చింది. దాని వల్ల సన్నివేశాలు మామూలుగా ఉన్నా కూడా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాయి. ప్రేమ సన్నివేశాలను పండించడంలో ఒక రచయితకు అవసరమైన ‘చిలిపితనం’ బుచ్చిబాబులో కావాల్సినంత ఉందని ప్రథమార్ధంలో వచ్చే ప్రతి సన్నివేశంలోనూ తెలుస్తూనే ఉంటుంది. హీరోయిన్ పేరు ‘సంగీత’ కాగా హీరోకు ‘గ’ అనే అక్షరమే పలకలేని బలహీనత ఉండడం.. హీరోయిన్ ముద్దు పెట్టినపుడల్లా హీరోకు జ్వరం వచ్చేయడం.. హీరో పక్కన ఉన్నపుడల్లా హీరోయిన్ కు చెమటలు పట్టేయడం.. ఇలా యువత కనెక్ట్ అయ్యే రొమాంటిక్ సన్నివేశాలకు ప్రథమార్ధంలో లోటు లేదు. హీరో హీరోయిన్లద్దరి క్యారెక్టర్లను తీర్చిదిద్దిన విధానం కూడా ఆకట్టుకుంటుంటుంది. ఇక ఒకదాని తర్వాత ఒకటి మంచి పాటలన్నీ ప్రథమార్ధంలోనే వచ్చేస్తాయి. అన్నీ విజువల్ గా కూడా కట్టి పడేస్తాయి. ‘జల జలపాతం’ పాట అన్ని రకాలుగా ‘టాప్’ అనిపిస్తూ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. కథ పరంగా రసపట్టులో ఉన్న సమయంలో ఆ పాట రావడంతో సినిమాకే అది హైలైట్ గా నిలుస్తుంది.

ప్రథమార్ధంలో ఓ  పక్కన ప్రేమ సన్నివేశాలు ఆహ్లాదంగా సాగిపోతుంటే.. మరోవైపు విజయ్ సేతుపతి కనిపించిన ప్రతిసారీ తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాడు. ఆ పాత్రకు అద్భుతమైన డైలాగులు పడటం ఆయా సన్నివేశాలను మరింతగా ఎలివేట్ చేసింది. ప్రేమకథలో అలజడి రేగే సన్నివేశాల చాలా బలంగా తీర్చిదిద్దడం ద్వారా ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా గట్టిగానే ఉండేలా చూసుకున్నాడు బుచ్చిబాబు.  ఐతే ఏ ప్రేమకథలో అయినా హీరో హీరోయిన్ల మధ్య ఎడబాటు వచ్చాక కథ నెమ్మదిస్తుంది. ‘ఉప్పెన’ కూడా అందుకు మినహాయింపు కాదు. ద్వితీయార్ధంలో సన్నివేశాలు మరీ రొటీన్ గా మారిపోవడం వల్ల కూడా ‘ఉప్పెన’ మీద ఇంప్రెషన్ తగ్గుతుంది. పాటలతో సహా ప్రేక్షకులకు ‘హై’ ఇచ్చే అన్ని అంశాలూ ప్రథమార్ధంలోనే ఉండటంతో ‘ఉప్పెన’ ద్వితీయార్ధంలో కళ తగ్గినట్లు అనిపిస్తుంది. ప్రి క్లైమాక్స్ లో సినిమా గాడి తప్పుతున్న భావన కూడా కలుగుతుంది.

ఐతే క్లైమాక్స్ మాత్రం అన్నింటినీ మరిపించేస్తుంది. ‘ఉప్పెన’ ట్విస్టు గురించి ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం నిజమే. తెలుగు సినిమా చరిత్రలోనే ఇది అత్యంత సాహసోసేతమైన ట్విస్టుగా చెప్పొచ్చు. వినడానికి ఎబ్బెట్టుగా.. జీర్ణించుకోలేని విధంగా అనిపించే ఈ విషయాన్ని దర్శకుడు ఎంతో కన్విన్సింగ్ గా.. ఉద్వేగభరితంగా ప్రెజెంట్ చేసిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవకుండా ఉండలేరు. ముందు కొంచెం అనవసరం అనిపించిన సన్నివేశాలకు కూడా ఇక్కడ సమాధానం లభిస్తుంది. ప్రేక్షకుల్లో ఒక కదలిక తీసుకొచ్చేలా ఎంతో ఉద్వేగభరితంగా క్లైమాక్స్ ను తీర్చిదిద్దాడు బుచ్చిబాబు. అతడిలోని ఉత్తమ రచయిత ఈ సన్నివేశంలోనే కనిపిస్తాడు. కథానాయిక తన తండ్రితో చివర్లో చెప్పే ప్రతి మాటా చాలా బలంగా అనిపిస్తుంది. తండ్రినే కాదు.. ప్రేక్షకులను సైతం సమాధాన పరుస్తూ సాగే ఆ డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సందేహించకుండా ఇలా సినిమాను ముగించడానికి అంగీకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు చెప్పాల్సిందే. ఈ ట్విస్టును మినహాయిస్తే కథ పరంగా రొటీన్.. ద్వితీయార్ధం కొంత నెమ్మది అన్నది పక్కన పెడితే ‘ఉప్పెన’లో పెద్ద బలహీనతలేమీ లేవు. చివర్లో వచ్చే హార్డ్ హిట్టింగ్ విషయాన్ని మెజారిటీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న దానిపై ‘ఉప్పెన’ అంతిమ ఫలితం ఆధారపడి ఉండొచ్చు.

నటీనటులు:

పంజా వైష్ణవ్ తేజ్ ఇలాంటి సినిమాను అరంగేట్రానికి ఎంచుకున్నందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో ఎవరూ ఇలాంటి పాత్ర చేయడానికి సాహసించరు. సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ కు గురవడానికి ఆస్కారమున్న పాత్ర చేయడానికి సిద్ధ పడటం గొప్ప విషయం. లుక్స్ పరంగా కూడా చాలా యావరేజ్ గా కనిపించే డీగ్లామర్ పాత్ర అతడిది. ఎక్కడా కూడా హీరోలా అనిపించకుండా ఒక ముఖ్య పాత్రధారిలాగే కనిపించాడతను. వైష్ణవ్ నటనలో పరిణతి కనిపిస్తుంది. కొత్త వాడైనా చాలా త్వరగా అతడి పాత్రకు అలవాటు పడిపోయేలా చేయగలిగాడు. హీరోయిన్ కృతి శెట్టి తన అందంతో, నటనతో కట్టి పడేసింది. కొన్ని సన్నివేశాల్లో లుక్స్ పరంగా తేడాగా అనిపించినా.. ఓవరాల్ గా మెప్పించింది. పతాక సన్నివేశంలో ఆమె నటనకు క్లాప్స్ పడతాయి. ఇక విజయ్ సేతుపతి గురించి చెప్పేదేముంది? సినిమాను తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లాడు. అతడి కోసమే ఈ సినిమా చూడొచ్చు అనిపించాడు. రాయణం పాత్రలోకి అతను పరకాయ ప్రవేశం చేసిన తీరు ఎలాంటిదో తెరమీదే చూసి తెలుసుకోవాలి. ఐతే సేతుపతి వాయిస్ అందరికీ బాగానే పరిచయం కాబట్టి అతడికి రవిశంకర్ వాయిస్ సూట్ కాలేదు. ఇదొక్కటే ఈ పాత్ర విషయంలో ఇబ్బంది పెట్టే విషయం. హీరో తండ్రిగా సాయిచంద్ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. సేతుపతి తండ్రిగా మహదేవన్ కూడా బాగా చేశాడు. మిగతా నటీనటులూ ఓకే.

సాంకేతిక వర్గం:

దేవిశ్రీ ప్రసాద్ చాన్నాళ్ల తర్వాత మనసు పెట్టి పని చేసిన సినిమాలా అనిపిస్తుంది ‘ఉప్పెన’. ఏదో ఒకటి అని కాదు.. అతడి ప్రతి పాటా ఆకట్టుకుంటుంది. ప్రేమకథలో ఫీల్ పెంచడంలో దేవి పాటలు కీలక పాత్ర పోషించాయి. విజువల్ గానూ చాలా బాగుండటంతో ‘జల జలపాతం..’ సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది. దేవి నేపథ్య సంగీతం కూడా బాగుంది. విలన్ పాత్రకు బ్యాగ్రౌండ్ స్కోర్ భిన్నంగా అనిపిస్తుంది. ప్రేమ సన్నివేశాలనూ నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేశాడు దేవి. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ కూడా టాప్ క్లాసే. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. కొత్త నటీనటులు, దర్శకుడు అని చూడకుండా ఈ కథను నమ్మి రాజీ లేకుండా నిర్మించి మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు అభినందనీయులు. సినిమా స్థాయి ఏంటో చూడకుండా తమ సంస్థ ప్రమాణాలేంటో వాళ్లు చూపించారు. ఇక సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు.. గురువుకు తగ్గ శిష్యుడినే అనిపించాడు. తొ ల సినిమాతోనే బలమైన ముద్ర వేశాడు. రచయితగానే కాక దర్శకుడిగానూ అతను ప్రతిభ చాటుకున్నాడు. తన అనుభవాల నుంచి కథ.. పాత్రలు రాసుకున్నాడో ఏమో కానీ.. అన్నింట్లోనూ జీవం కనిపిస్తుంది. కథ రొటీన్ అనిపించినా.. దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఒక్కో పాత్రను తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది. అతడి డైలాగులు సినిమాకు పెద్ద ప్లస్. క్లైమాక్స్ లో బుచ్చిబాబు అత్యుత్తమ పనితీరు కనిపిస్తుంది. ముగింపును ఇలా రాసుకోవడం కంటే.. దాన్ని కన్విన్సింగ్ గా చెప్పడంలో బుచ్చిబాబు ప్రతిభను మెచ్చుకోవాలి.

చివరగా: ఉప్పెన.. ప్రేమలో ముంచెత్తుతుంది

రేటింగ్-3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News