మెగా మేనల్లుడికి 'ఉప్పెన'లాంటి పరీక్షే!

Update: 2021-02-07 23:30 GMT
మెగా ఫ్యామిలీ నుంచి ఒకరి తరువాత ఒకరుగా హీరోలు వస్తూనే ఉన్నారు. ఎవరికి వారు తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ నిలదొక్కుకుంటున్నారు. సాయిధరమ్ తేజ్ కూడా అలా వచ్చినవాడే. అప్పుడప్పుడూ .. అక్కడక్కడా చిరంజీవిని అనుకరిస్తున్నట్టుగా అనిపించినా, తనదైన బాడీ లాంగ్వేజ్ తోనే కంటిన్యూ అవుతున్నాడు. ఇక ఇప్పుడు ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా 'ఉప్పెన' సినిమాతో పరిచయమవుతున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

ఒకరకంగా ఇది సముద్రతీరంలో తిరుగాడే ప్రేమకథగా .. సముద్రంతో ముడిపడిన ప్రేమకథగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో తొలిసారిగా కనిపించిన దగ్గర నుంచి జనం దృష్టి పూర్తిగా హీరోయిన్ వైపు వెళ్లిపోయింది. కృతి శెట్టి అందం .. ఆ పిల్ల నవ్వులోని ప్రత్యేకమైన ఆకర్షణ .. కళ్లతోనే ఆమె చేసిన అల్లరి అందరి మనసులకు కనెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా టీనేజ్ కుర్రాళ్ల కలల్లో ఇప్పుడు సోఫాసెట్ వేసుకుని కూర్చున్నది ఈ పిల్లనే. ఇప్పట్లో ఈ సోఫాసెట్ వైపు ఎవరినీ రానిచ్చేది లేదని వాళ్లు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కథానాయిక తండ్రి పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. విజయ్ సేతుపతి మంచి ఆర్టిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇటీవల వచ్చిన ట్రైలర్ తోనే ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్ ఉంటుందనేది అందరికీ అర్థమైంది. చాలా నేచురల్ గా .. కూల్ గా ఆయన విలనిజం ఉండనుందనే విషయం స్పష్టమైంది. ఇలా ఒక వైపున హీరోయిన్ .. మరో వైపున విలన్ ప్రేక్షకులను తమవైపుకు తిప్పుకోగలిగారు. ఈ ఇద్దరినీ తట్టుకుని స్క్రీన్ పై నిలబడగలగడం వైష్ణవ్ తేజ్ కి 'ఉప్పెన'లాంటి పరీక్షే. ఇంతవరకూ బయటికి వచ్చిన విజువల్స్ లో పాత్రకి తగినట్టుగా కనిపించినా, సినిమా మొత్తం మీద ఎంతవరకూ మెప్పిస్తాడనేదే ప్రధానం. కుర్రాడు ఎంతవరకూ కుమ్మేస్తాడో చూడాలి మరి.


Tags:    

Similar News