బాడీ డబుల్‌తో వందల కోట్ల వ్యాపారం?
మనిషి ఆశా జీవి. ప్రయోగాలకు వెనకాడడు. అందుకే ఇది ఏదో ఒక రోజు సాధ్యమేనని కూడా ఊహిస్తున్నారు.;
పెరిగిన సాంకేతికతతో ఏదైనా సాధ్యమే. ఇకపై హీరోలు, హీరోయిన్ లు, ఇతర సహాయ నటులతో పని లేకుండా కేవలం కృత్రిమ మేధస్సు సృష్టించే జీవం లేని మానవ ఇమేజ్ లతో సినిమాలు తీసేయొచ్చు. హీరో హీరోయిన్ విలన్, సహాయక పాత్రలు, డ్యాన్సర్లు అందరినీ కదిలే బొమ్మల రూపంలో క్రియేట్ చేసి చాలా మ్యాజిక్ చేయడం పాజిబులేనని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి ఏఐ ఇమేజెస్ కదలికలకు `ఆత్మ` లేదని అంటున్నారు కానీ, ఇలాంటివి సృష్టించిన సృష్టికర్తలు లేదా సాంకేతిక నిపుణులు మునుముందు వీటికి జీవం తీసుకురాకుండా పోతారా? యానిమేషన్ బొమ్మలతో పోలిస్తే, ఏఐ బొమ్మల్లో జీవం ఉట్టి పడుతోంది.. కానీ ఆ జీవానికి ఆత్మ పోసే మేధావుల వెల్లువ పెరగాల్సి ఉంటుంది. మనిషి ఆశా జీవి. ప్రయోగాలకు వెనకాడడు. అందుకే ఇది ఏదో ఒక రోజు సాధ్యమేనని కూడా ఊహిస్తున్నారు.
అదంతా సరే కానీ, ఇప్పుడు సినిమాల్లో బాడీ డబుల్ ఉపయోగించి, కేవలం హీరో ఇమేజ్- ముఖాన్ని ఉపయోగించుకుని దాంతో భారీ బిజినెస్ చేయడం ట్రెండ్‌గా మారుతోంది. అసలు హీరో సెట్స్ కి రావాల్సిన పని లేకుండా బాడీ డబుల్‌తో ఆన్ లొకేషన్ షూట్లు పూర్తి చేస్తున్నారు. బాడీ డబుల్ ఆర్టిస్టుతో షూటింగ్ పూర్తి చేసాక, అవసరం అనుకుంటే హీరో ముఖాన్ని తగిలిస్తే సరిపోతోంది. దానిని టెక్నాలజీతో మౌల్డ్ చేస్తారు. అలాగే స్టార్ హీరోని కేవలం క్లోజప్ సన్నివేశాలకు మాత్రమే ఉపయోగించుకునే వెసులుబాటును దర్శకులు ఉపయోగించుకుంటున్నారు. అవసరమైన కొన్ని సన్నివేశాల కోసం మాత్రమే ఏజ్డ్ హీరో (లేదా పబ్లిక్ ఇమేజ్ ఉన్న హీరో) రావాల్సి ఉంటుంది. కేవలం అతడి ముఖాన్ని మాత్రమే బాడీ డబుల్ విజువల్స్‌కు ఉపయోగించుకుంటారు.
అప్పటికే ఆ హీరోకి ఉన్న ఇమేజ్, మార్కెట్ రేంజ్ ని ఉపయోగించుకుని తెలివిగా బిజినెస్ పూర్తి చేస్తారు. ఇది ఒక రకమైన చీటింగ్ అయినా కానీ, ఈ చీటింగ్ ని మార్కెట్ వర్గాలు ఇష్టంగా భరించగలవు. ఎందుకంటే ఆ హీరోకి ఉన్న అసాధారణమైన ఫ్యాన్ ఫాలోయింగ్ థియేటర్ల నుంచి రాబడిని అందిస్తుంది. ఆసక్తికరంగా అసలు హీరోకి తెలియకుండానే, బాడీ డబుల్ ని ఉపయోగించి పెండింగ్ షూట్ పూర్తి చేసేస్తున్నారని ఒక లీక్ అందింది. అయితే హీరోకి తెలియదు అనే విషయం ఎలా బయటపడింది? అంటే... ఓసారి షూట్ కోసం హీరో సెట్స్ కి వచ్చారు. కానీ అప్పటికే సెట్స్ లో ఉండాల్సిన బాడీ డబుల్ ఆర్టిస్టు రావడం ఆలస్యమైంది? ఎందుకు ఆలస్యమైంది? అని ప్రశ్నిస్తూ.. బాడీ డబుల్ ఆర్టిస్టును సదరు స్టార్ హీరో చెడామడా తిట్టేసాడు. తీరా చూస్తే .. అతడు అదే హీరోకి చెందిన వేరొక షూట్ షెడ్యూల్ ని పూర్తి చేసి ఇక్కడికి రావడం వల్ల ఆలస్యమైందని చెప్పాడట. దీంతో ఆ హీరో బాడీ డబుల్ ఆర్టిస్టుకు సారీ చెప్పారు. ఈ ఎపిసోడ్ లో బాడీ డబుల్ ఆర్టిస్టు ప్రభావం ఇప్పుడు ఎలా ఉంది? అనేది అర్థమయ్యేలా చెబుతోంది. అసలు హీరోకి తెలియకుండానే బాడీ డబుల్ ని ఉపయోగించి అవసరమైన అన్ని షాట్లను పూర్తి చేసేయొచ్చని అర్థమవుతోంది. దీనిని బట్టి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు సెట్స్ కి వెళ్లే పని లేకుండానే ఇంట్లో కూచుని సంపాదించగలరని అర్థమవుతోంది. ఇక ఈ బాడీ డబుల్స్ కి సదరు స్టార్ హీరో అందుకునే మొత్తంలో కేవలం 5 శాతం ఆదాయం కూడా రాదు. కానీ అతడు సినిమాని 70 శాతం క్యారీ చేయగలుగుతాడు అనడంలో సందేహం లేదు.
ఆసక్తికరంగా సెట్స్ కి ఆలస్యంగా వచ్చే ఒక స్టార్ హీరో తనకు ఇద్దరు బాడీ డబుల్స్ ని ఉపయోగిస్తున్నారు. ఒక బాడీ డబుల్ అధిక బరువుతో ఇబ్బంది పడితే రెండో బాడీ డబుల్ ఆర్టిస్టును ఉపయోగిస్తారు. అతడితో షూట్ పూర్తయ్యాక.. హీరోతో క్లోజప్‌లను మాత్రమే చిత్రీకరిస్తున్నారు. అనంతరం విజువల్స్ ని బ్లెండ్ చేసి హీరోకి పంపుతారు. అలా వచ్చిన విజువల్ ని చెక్ చేసుకుని తన అవసరం పడుతుంది అంటేనే ఆయన సెట్స్ కి వస్తారు.