వ‌కీల్ సాబ్ నిర్మాత‌ను హెచ్చ‌రించిన డిస్ట్రిబ్యూట‌ర్!?

Update: 2021-04-29 10:41 GMT
ఓటీటీల్లో సినిమాల్ని రిలీజ్ చేయ‌డానికి కొన్ని నియ‌మ‌నిబంధ‌న‌లు అమల్లో ఉన్నాయి. ఏదైనా క్రేజు ఉన్న పెద్ద సినిమాని ఓటీటీ-డిజిట‌ల్లో లాంచ్ చేయాలంటే క‌చ్ఛితంగా థియేట్రిక‌ల్ రిలీజ్ అనంత‌రం 50 రోజుల గ్యాప్ ఉండాల్సిందే.  ఈ నియ‌మాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ది యాక్టివ్ నిర్మాత‌ల గిల్డ్ అని చెబుతారు. ఇలా చేస్తే చాలా వ‌ర‌కూ థియేట‌ర్ల‌లో ఆడుతున్న సినిమాకు ఇబ్బంది ఉండ‌దు. పంపిణీదారుల‌కు న‌ష్టాలు ఉండ‌వు.

కానీ అనూహ్యంగా థియేట‌ర్ల‌లో ఆడుతున్న సినిమాని ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తే ప‌రిణామం తీవ్రంగా ఉంటుంది. దానిని ఎంతో డ‌బ్బు పెట్టి కొనుక్కున్న డిస్ట్రిబ్యూట‌ర్ లేదా ఎగ్జిబిట‌ర్ తీవ్రంగా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది.

ఇప్పుడు అదే కోణంలో వ‌కీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకు హెచ్చ‌రిక జారీ అయ్యింద‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు నిర్మించిన వ‌కీల్ సాబ్ ఈనెల 30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది. థియేటర్ల‌లో విడుదలైన 20 రోజుల్లోనే OTT ల్లో ఈ చిత్రం విడుద‌ల‌వుతోంది. సెకండ్ వేవ్ వ‌ల్ల జ‌నం థియేట‌ర్ల‌కు రానందున దిల్ రాజు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే దీనివ‌ల్ల పంపిణీదారులతో చేసుకున్న ఒప్పందాలను ఆయ‌న ఉల్లంఘించిన‌ట్టేన‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా గ‌ల్ఫ్ కి చెందిన ఓ పంపిణీదారుడు దిల్ రాజుపై కేసు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. త‌మ‌కు 3కోట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. థియేటర్ల‌లో విడుదలైన 50 రోజుల ముందు ఈ చిత్రం ఓటీటీల్లో ప్రసారం కాదని పంపిణీ హక్కులను విక్రయించేటప్పుడు దిల్ రాజు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ అది విర‌మించినందున న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌నేది ఆయ‌న డిమాండ్.
Tags:    

Similar News