'వాల్మీకి' టైటిల్ మార్పుపై కేంద్ర మంత్రితో భేటీ

Update: 2019-09-11 16:56 GMT
వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న `వాల్మీకి` టైటిల్ వివాదం గురించి తెలిసిందే. వాల్మీకి కులాన్ని కించ‌ప‌రుస్తూ హింసాత్మ‌క‌మైన సినిమాకి ఈ టైటిల్ ని ఉప‌యోగించ‌డం త‌గ‌ద‌ని.. సీజీవో టవర్స్ లోని సెన్సార్‌ బోర్డు కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్- భజరంగ్‌ దళ్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. అటుపై ఇందిరా పార్క్ వ‌ద్ద నిర‌స‌న‌లు తెలిసిందే. రెండ్రోజుల క్రితం క‌ర్నూల్ లో తీవ్ర‌మైన నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వెంటనే సినిమా పేరును మార్చాలని నిర‌స‌నకారులు డిమాండ్ చేస్తున్నారు.

నిర‌స‌నల సెగ అంత‌టితో ఆగ‌లేదు. తాజాగా ఈ టైటిల్ మార్చాల్సిందేనంటూ  అనంత‌పూర్ ఎంపీ త‌లారి రంగ‌య్య కేంద్ర‌మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ ని క‌ల‌వ‌డం చ‌ర్చ‌కొచ్చింది. వాల్మీకి బోయలతో పాటు హిందువుల ఆరాధ్య దైవం. అలాంటి గొప్ప మునీశ్వ‌రుని పేరును ఓ హింసాత్మ‌క సినిమాకు ఎలా వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన స‌ద‌రు ఎంపీ...  ఒక గ్యాంగ్ స్ట‌ర్ మూవీకి వాల్మీకి అన్న‌ టైటిల్ స‌రికాద‌ని.. మార్చ‌క‌పోతే బోయ కులస్తులు గొడవ చేస్తార‌ని .. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితులు హ‌ద్దు దాట‌తాయ‌ని ఫిర్యాదు చేశారు. ఎంపీ త‌లారి రంగ‌య్య కేంద్ర సమాచార.. ప్ర‌సారాల శాఖ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ ని క‌లిసి విన్న‌వించారు. అస‌లు త‌మ విన్న‌పాన్ని ప‌ట్టించుకోకుండా సెన్సార్ ఎలా పూర్తి చేస్తార‌ని ఈ విన‌తి ప‌త్రంలో ప్ర‌శ్నించారు. 1952 సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టం ప్ర‌కారం.. 1978 జీవో ప్ర‌కారం ఇది విరుద్ధ‌మ‌ని ఆ ప‌త్రంలో పేర్కొన్నారు.

దిల్లీ లోని మంత్రి కార్యాలయంలో కలసి త‌లారి వినతి పత్రం అందజేసిన అనంత‌రం... ఇది ఎంతో సున్నితమైన అంశ‌మ‌ని.. స‌త్వరమే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి వర్యులు ఆదేశించార‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే రిలీజైన వాల్మీకి టీజ‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఇందులో వ‌రుణ్ తేజ్ లుక్ కి ఫ్యాన్స్ లో స్పంద‌న బావుంది. సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ఈనెల 20న సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది.


Tags:    

Similar News