మురారి అంటాడా? హరే కృష్ణ అంటాడా?

Update: 2017-10-24 04:52 GMT
ఇంటలిజెంట్ స్పైగా ప్రేక్షకులను మెప్పిస్తానని మహేష్ బాబు ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పైడర్ బాక్సాఫీస్ ను ఆకట్టుకోలేకపోయింది. వరస హిట్లతో దూసుకుపోతున్న అగ్ర దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కోసం ఎంతో శ్రమించినా మూవీ మాత్రం అభిమానులకు నిరాశే మిగిల్చింది.

స్పైడర్ చేదు అనుభవం నుంచి బయటకు పడాలన్న ఉద్దేశంతో మహేష్ తర్వాత మూవీని త్వరగా ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నాడు. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో కలిసి భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ పనులు చకచకా చేస్తూనే మరోవైపు తర్వాత మూవీని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

ఈ సినిమాకు డైరక్టర్ పైడిపల్లి వంశీ తనదైన స్టయిల్ లో క్లాసిక్ స్టయిల్ టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి కృష్ణా ముకుందా మురారి లేదా హరేరామ హరే కృష్ణ అనే టైటిళ్లు పరిశీలిస్తున్నారు. వంశీ పైడిపల్లి గతంలో బృందావనం టైటిల్ తో ఎన్టీఆర్  హీరోగా సినిమా తీసి డీసెంట్ హిట్ కొట్టాడు. మళ్లీ అందుకే క్లాసిక్ టైటిల్ తోనే అభిమానుల్లో ఆసక్తి పెంచే యత్నం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అనుకుంటున్న రెండు టైటిల్స్ కూడానూ మహేష్‌ కు చెందినవే. మురారి మహేష్‌ కు దక్కిన మెగా బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్. అలాగే హరేరామ హరే కృష్ణ ఒక్కడు సినిమాలో సూపర్ హిట్ సాంగ్.


Tags:    

Similar News