పీవీపీ తో గొడవ..వంశి రియాక్ట్ అయ్యాడు!!

Update: 2017-01-05 08:31 GMT
తెలుగు సినీ ఇండస్ర్టీలో  కొత్త వివాదం రాజుకుంది.  అగ్రశ్రేణి నిర్మాత - హిట్ చిత్రాల దర్శకుడు సిగపట్లు పడుతున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లితో నిర్మాత పీవీపీకి వివాదం మొదలైంది. దీంతో ఆయన వంశీపై ఏకంగా నిర్మాతల మండలిలో, కోర్టులో పిటిషన్ వేశారు. పైడిపల్లి తనను మోసం చేశారంటూ ఆయన ఫిర్యాదు చేశారు.
    
కాగా ఈ వివాదానికి కారణం ఊపిరి - బ్రహ్మోత్సవం సినిమాలేనట. ఊపిరి సినిమా ఓవర్‌ బడ్జెట్ అయిందని అందుకే తనతో మరో సినిమా తీస్తానని దర్శకుడు పైడిపల్లి హామీ ఇచ్చారట. ఈ మేరకు ఒప్పందం కూడా ఉందని పీవీపీ చెబుతున్నారు. అదే సమయంలో బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్‌ గా మిగిలిపోవడంతో మహేష్ బాబు తన తదుపరి సినిమా కూడా పీవీపీ బ్యానర్‌ లోనే చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. బ్రహ్మోత్సవం ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఆశించారు. ఇద్దరూ హామీ ఇచ్చారు కాబట్టి మహేశ్ హీరోగా - వంశీ పైడిపల్లి దర్శకుడిగా ఒకే సినిమా తీయాలని ఆయన ప్లాన్ చేశారు.
    
కానీ... ఇప్పుడు పీవీపీకి అటు వంశీ పైడిపల్లి - ఇటు మహేష్‌ బాబు ఇద్దరూ హ్యాండిచ్చారు. మహేశ్ - వంశీల కాంబినేషన్లలో సినిమా వస్తోంది కానీ... నిర్మాత మాత్రం పీవీపీ కాదు. దిల్ రాజు దానికి నిర్మాత. దీంతో పీవీపీకి షాక్ తగిలింది.
    
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా పీవీపీ బ్యానర్‌ లో చిత్రం ఉంటుందని పీవీపీ ఇప్పటికే ప్రకటించారు. కానీ వంశీ పైడిపల్లి మాత్రం మహేష్ బాబుతో నిర్మిస్తున్న తదుపరి చిత్రానికి దిల్‌ రాజ్ నిర్మాతగా ఉంటారని ట్వీట్టర్ లో ప్రకటించారు. మహేష్‌ బాబు కూడా అదే తరహా ట్వీట్ చేశారు. దీంతో పీవీపీ కోర్టులో కేసు వేశారు.  అయితే.. ఆయన మహేష్ బాబు జోలికి వెళ్లకుండా కేవలం దర్శకుడు పైడిపల్లిపై మాత్రమే కేసు వేశారు. అయితే పీవీపీ ఆరోపణలను వంశీ పైడిపల్లి ఖండించారు. ఊపిరి సినిమాతో నష్టం వచ్చిందన్న దాంట్లో వాస్తవం లేదంటున్నారు. శాటిలైట్ హక్కులతో కలుపుకుంటే ఊపిరి సినిమా ద్వారా భారీగా లాభం వచ్చిందన్నారు. అసలు ఊపిరి సినిమాకు - మహేష్‌ బాబు తాను తీసే తదుపరి చిత్రానికి లింక్ ఎలా పెడుతారని ప్రశ్నిస్తున్నారు. పీవీపీ తనపై వేసిన కేస్ ను తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని వంశి సవాలు విసిరాడని అంటున్నారు. ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News