అర్జున్ రెడ్డి తెలుగు చిత్రసీమలో క్రేజీ మూవీ అయితే ఇతర సినీ ఇండస్ట్రీకు రీమేక్ కథా వస్తువు. అర్జున్ రెడ్డి ఇప్పటికే హిందీ తమిళ భాషల్లో రీమేక్ అవుతోంది. ఈ లోపే మరో బాలీవుడ్ కుర్ర హీరో వరుణ్ ధావన్ అర్జున్ రెడ్డిలాంటి సినిమాలు కావాలంటూ దక్షిణాదిపై మనసు పారేసుకుంటున్నాడు. ఇలాంటి సినిమాలే యూత్ కు నచ్చుతాయంటూ కితాబిచ్చాడు. ఇంత హఠాత్తుగా వరుణ్ దక్షిణాది చిత్ర పరిశ్రమను ఎందుకు తెగ పొగిడేస్తున్నట్టు.
బాలీవుడ్ పేరున్న హీరోనే వరుణ్ ధావన్. మంచి సినిమాల్లోనే నటించాడు. అతని తండ్రి డేవిడ్ ధావన్ కూడా సినిమా వ్యక్తే. అతను దక్షిణాది సినిమాలను హిందీలో రీమేక్ చేసేవాడు. గతంలో అసెంబ్లీ రౌడీ సతీ లీలావతి కూలీ నెంబర్ వన్ అల్లరి మొగుడు లాంటి ఎన్నో సినిమాలను హిందీలో తెరకెక్కించాడు. ఇప్పుడు అతని కొడుకు వరుణ్ ధావన్ కూడా అదే బాట పట్టేట్టు కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ తనకు మంచి స్నేహితుడని తనను తెలుగు నేర్చుకోమని చెప్పాడని తెలిపాడు. దక్షిణాది చిత్రసీమతో తనకు మంచి అనుబంధమే ఉందని తెలుగు తమిళ సినిమాలు చూసేందుకు ఇష్టపడతానని చెప్పాడు. హలో బ్రదర్ సినిమాను జుద్వా 2 పేరుతో రీమేక్ చేసి గతేడాది విడుదల చేశారు. అందులో వరుణ్ ధావనే హీరో. అన్నట్టు రాజమౌళి శంకర్ దర్శకత్వం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు.
ఇప్పుడు వరుణ్ సౌతిండియా చిత్రపరిశ్రమను తెగ పొగడడం చూస్తుంటే తన తండ్రిలాగే ఇక్కడి సినిమాలను హిందీలో రీమేక్ చేయడం మొదలుపెడతాడేమో అని చర్చించుకుంటున్నారు బాలీవుడ్ జనాలు. లేదా దక్షిణాది సినిమాలలో నటించలన్నా కోరిక అయినా ఉండి ఉంటుందని ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో రాజమౌళి శంకర్ ల పేర్లే బయటికి చెప్పాడు కనుక వారు ఏమన్నా అవకాశం ఇస్తారేమో అన్న ఆశ కూడా ఉండి ఉండచ్చు. మొత్తమ్మీద బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ కోలీవుడ్ ల వైపు చూసే రోజులు వచ్చేశాయన్న మాట.