పూరి మిస్టర్ క్లీన్ అంటున్న హీరో

Update: 2017-07-20 08:51 GMT
పూరి జగన్నాథ్ పేరు డ్రగ్ రాకెట్లో భాగంగా బయటికి వచ్చినపుడు ఇండస్ట్రీ జనాలందరూ షాకైపోయారు. కానీ ఎవరూ కూడా ఆయన విషయమై తమ అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. పూరి జగన్నాథ్ నిన్న సిట్ అధికారుల వద్ద పది గంటలకు పైగా విచారణ ఎదుర్కొన్న నేపథ్యంలో డ్రగ్స్ కుంభకోణంలో ఆయన పాత్రపై సందేహాలు రేకెత్తాయి. ఐతే పూరి తనకీ ఈ వ్యవహారంతో సంబంధమేమీ లేదంటూ వివరణ ఇచ్చారు.. అది వేరే సంగతి. ఐతే ఇండస్ట్రీ జనాల నుంచి మాత్రం పూరి విషయంలో పెద్దగా స్పందనేమీ కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో మెగా హీరో వరుణ్ తేజ్.. పూరికి మద్దతుగా గళం విప్పాడు. ఆయన మిస్టర్ క్లీన్ అంటూ సర్టిఫికెట్ ఇచ్చాడు.

పూరితో వరుణ్ ‘లోఫర్’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలో తాను పూరితో సన్నిహితంగా మెలిగానని.. తనకు తెలిసి ఆ సమయంలో ఎప్పుడూ పూరి డ్రగ్స్ జోలికి వెళ్లలేదని వరుణ్ తెలిపాడు. పూరికి మంచి మార్గంలో సంతోషంగా బతకడం ఎలాగో తెలుసని వరుణ్ అన్నాడు. తనతో పాటు తనచుట్టూ ఉన్న వాళ్లందరూ కూడా ఆరోగ్యంగా.. సంతోషంగా ఉండాలని పూరి కోరుకుంటాడని వరుణ్ తెలిపాడు. పూరి ఎప్పుడూ సానుకూల ధోరణితో ఉంటాడని.. డ్రగ్స్ రాకెట్లో ఆయన పాత్ర ఉందని ఆరోపణలు రావడం చూసి తాను షాకయ్యానని.. సినిమా వాళ్లంటే జనాలు తేలిగ్గా తీసుకోవడం మామూలైపోయిందని వరుణ్ తెలిపాడు. డ్రగ్స్ రాకెట్ విషయమై ఇప్పుడే ఓ అభిప్రాయానికి రావొద్దని.. ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని వరుణ్ అభిప్రాయపడ్డాడు.
Tags:    

Similar News