చిరంజీవి ఏజ్ కు తగ్గ సినిమా.. కన్ఫర్మ్ చేసిన నిర్మాత
ఇదే క్రమంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
'విశ్వంభర' సినిమా కొలిక్కి రావడంతో కొత్త ఏడాదిలో కొత్త ప్రాజెక్ట్స్ ను ప్రకటించడానికి రెడీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఇదే క్రమంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అధికారికంగా ప్రకటించకముందే తాజాగా ఈ విషయాన్ని నిర్మాత కంఫర్మ్ చేసారు.
నిర్మాత సాహు గారపాటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా చేయనున్నట్లు తెలిపారు. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కాదని, యాక్షన్ తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పారు. చిరు నుంచి ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు ఉంటాయని స్పష్టం చేసారు. అనిల్ మార్క్ ఫుల్ కామెడీ, యాక్షన్ తో ఒక మంచి ఫ్యామిలీ మూవీ చేస్తున్నట్లు వెల్లడించారు. చిరంజీవి ప్రజెంట్ ఏజ్ కు తగ్గట్టుగానే లుక్, గెటప్ ఉంటుందని సాహు చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ లో ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేస్తూ పక్కా కమర్షియల్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, రవితేజ, కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలతో పని చేసిన అనిల్.. ఇప్పుడు చిరంజీవితో వర్క్ చేయడానికి రెడీ అవుతున్నారు. అది కూడా తన శైలిలోనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ను తెరకెక్కించబోతున్నారని క్లారిటీ వచ్చేసింది.
అనిల్ రావిపూడి గత చిత్రాలకు పూర్తి భిన్నమైన కథాంశంతో చిరంజీవి సినిమా ఉంటుందని, దీంట్లో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందని టాక్ నడుస్తోంది. మెగాస్టార్ తో వర్క్ చేయడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని, తనకు ఇదొక ఛాలెంజ్ అని అనిల్ ఇటీవల ఓ సందర్భంలో అన్నారు. గతేడాది 'భగవంత్ కేసరి' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రావిపూడి.. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం విడుదలైన వెంటనే చిరు సినిమా పనులు మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది.
మరోవైపు చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ వచ్చే ఏడాది ఫస్టాఫ్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక శ్రీకాంత్ ఓదెలతో ఓ పీరియడ్ యాక్షన్ మూవీ చేయనున్నారు. హీరో నాని సమర్పణలో చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. అలానే షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో అనిల్ రావిపూడితో సినిమా చేస్తారు. దీన్ని బట్టి మెగాస్టార్ న్యూ జనరేషన్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. మరికొందరు దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.