రామ్ చరణ్ స్టార్‌డమ్‌కు ఇది అగ్ని పరీక్షే..!

ఈ నేపథ్యంలో ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' మూవీతో బిగ్ హిట్టు కొట్టి తన స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది.

Update: 2024-12-28 05:26 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా "గేమ్ ఛేంజర్". దిల్ రాజు బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. సంక్రాంతి స్పెషల్ గా జనవరి10వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఓవర్ సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రీ సేల్స్ ఆశించిన విధంగా లేవనే మాట వినిపిస్తోంది. అలానే హిందీ మార్కెట్ లో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై అభిమానుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పాన్ ఇండియా సినిమాలకు హిందీ మార్కెట్ చాలా కీలకమనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా వెలుగొందుతున్న టాలీవుడ్ హీరోలు నార్త్ బెల్ట్ లోనూ సత్తా చాటారు. బాహుబలి ఫ్రాంచైజీ ద్వారా ప్రభాస్ హిందీ బెల్ట్‌లో తనకంటూ ఓ మార్కెట్‌ను ఏర్పరచుకున్నారు. రాజమౌళి సపోర్ట్ లేకుండా కూడా తన స్టార్‌డమ్‌ను సక్సెస్ ఫుల్ గా కొనసాగించారు. 'సాహో', 'సలార్', 'కల్కి 2898 AD' వంటి చిత్రాలు ఉత్తరాది ప్రేక్షకులలో ప్రభాస్ స్థానాన్ని పదిలం చేశాయి.

పాండమిక్ టైంలో 'పుష్ప: ది రైజ్' సినిమాతో అల్లు అర్జున్ హిందీ సర్క్యూట్స్ లో ఊహించని విజయం సాధించారు. ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' మూవీతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు పెడుతున్నారు. వరల్డ్ వైడ్ గా 1700 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం.. హిందీలో 700 కోట్లకి పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా తెలుగు డబ్బింగ్ మూవీ నిలవడం అంటే, నార్త్ ఇండియాలో బన్నీ స్టార్ డమ్ కు ఇదే నిదర్శనం. రాజమౌళి హెల్ప్ లేకుండానే అల్లు అర్జున్ ఈ రేంజ్ కు వెళ్ళడం విశేషం.

RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ ఇండియా స్టార్లుగా మారారు. హిందీ మాట్లాడే ప్రాంతాలలో సంచలన విజయం అందుకున్నారు. ఆ తర్వాత తారక్ 'దేవర 1' చిత్రంతో తన బాక్సాఫీస్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా రాబట్టగలిగారు. ఉత్తరాదిలోనూ ఈ సినిమా బాగానే ఆడింది. భారీ బ్లాక్ బస్టర్ సాధించినప్పటికీ, ఉన్నంతలో హిందీలో ప్రభావం చూపింది. రాజమౌళి నీడ నుండి బయటకొచ్చి ఎన్టీఆర్ సొంతంగా హిట్టు కొట్టడమే కాదు, జక్కన్న మిత్ బ్రేకర్ అనిపించుకున్నాడు. ఇదంతా ఇప్పుడు చరణ్ మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది.

ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్‌గా మారింది. అతని గ్లోబల్ స్టార్ డమ్ సినిమాకి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' మూవీతో బిగ్ హిట్టు కొట్టి తన స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్‌గా చెర్రీ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే, హిందీ మార్కెట్‌లో అనూహ్యమైన పనితీరు కనబరచాలి.. రాజమౌళి సపోర్టు లేకుండా కూడా సక్సెస్ సాధించగలనని నిరూపించాలి. ఇది నిజంగా చరణ్ స్టార్‌డమ్‌కు అగ్ని పరీక్ష అనే చెప్పాలి.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, 'గేమ్ ఛేంజర్' సినిమా నిర్మాణ ఖర్చులు, రెమ్యునరేషన్లు, వడ్డీలు, పబ్లిసిటీ అన్నీ కలిపి ₹500 కోట్లకు పైగానే ఖర్చు అయిందని తెలుస్తోంది. ఇప్పటికే నాన్-థియేటర్ రైట్స్ రూపంలో ₹200 కోట్ల వరకూ రికవరీ అయింది. మిగిలిన ₹300 కోట్ల ఆదాయం థియేటర్ నుంచి రావాల్సి ఉంది. సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి నంబర్స్ చూసే అవకాశం ఉంది. మిగిలిన ఏరియాలలో రామ్ చరణ్ సినిమా పనితీరు ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News