షూటింగ్ మొదలెట్టిన మెగా ప్రిన్స్

Update: 2019-04-18 08:15 GMT
మెగా ఫ్యామిలీలో హీరోలు చాలామంది ఉన్నారు కానీ వారిలో ఎంతమంది కథలతో ప్రయోగాలు చేస్తారు అంటే.. ఆ ప్రశ్నకు సమాధానం వరుణ్ తేజ్ దగ్గరే వచ్చి ఆగుతుంది.  ఆఖరికి చరణ్ లాంటి పెద్ద స్టార్ కూడా తమ్ముడు వరుణ్ కథల ఎంపిక బాగుంటుందని కితాబిచ్చిన విషయం తెలిసిందే.  'F2' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వరుణ్ తాజాగా తన కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

మాస్ చిత్రాలు తెరకెక్కించడంలో స్పెషలిస్టు అయిన హరీష్ శంకర్ 'వాల్మీకి' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  తమిళ సూపర్ హిట్ 'జిగార్తాండ' కు రీమేక్ అయిన ఈ సినిమాలో వరుణ్ నెగెటివ్ రోల్ లో కనిపిస్తాడు. తమిళ హీరో అధర్వ మురళి ఈ సినిమా లో మరో లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. తమిళంలో  బాబీ సింహా నటించిన పాత్రలో వరుణ్ తేజ్.. సిద్ధార్థ్ నటించిన పాత్రలో అధర్వ నటిస్తారు.   తమిళ భామ మృణాలిని రవి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తోంది.  ఈ సినిమా షూటింగ్ లో ఈరోజే వరుణ్ తేజ్ జాయిన్ అయ్యాడు. ఈ విషయం తెలుపుతూ "వాల్మీకి మొదటి రోజు షూటింగ్.  ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నా" అంటూ వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశాడు.

హైదరాబాద్.. సిటీ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ 35 రోజుల పాటు జరగనుందని సమాచారం.  గ్యాంగ్ స్టర్ కామెడీ అయిన ఈ సినిమా కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు దర్శకుడు హరీష్ శంకర్ మార్పుచేర్పులు చేశాడట.  హరీష్ శంకర్ కెరీర్లో రీమేక్ సినిమాగా తెరక్కిన 'గబ్బర్ సింగ్' పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. తెలుగు ఆడియన్స్ కు తగ్గట్టుగా రీమేక్ ను మలిచినందుకు అప్పట్లో హరీష్ ప్రశంసలు అందుకున్నాడు. మరి ఇప్పుడు 'జిగార్తాండ' రీమేక్ తో అలాంటి ఫీట్ రిపీట్ చేస్తాడేమో వేచి చూడాలి.
Tags:    

Similar News