'దృశ్యం 2' సినిమా గురించి వెంకీ ఏం చెప్పారంటే..?

Update: 2021-11-22 15:30 GMT
ఇటీవల 'నారప్ప' అనే రీమేక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్.. మరికొన్ని రోజుల్లో ''దృశ్యం 2'' తో రాబోతున్నారు. వెంకీ హీరోగా 'దృశ్యం' సినిమాకి కొనసాగింపుగా దర్శకుడు జీతూ జోసెఫ్‌ రూపొందించిన చిత్రమిది. మలయాళంలో సూపర్ హిట్‌ అందుకున్న 'దృశ్యం 2' చిత్రానికి రీమేక్‌ గా తెరకెక్కుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా డైరెక్ట్ ఓటీటీ విధానంలో నవంబర్ 25న ఈ క్రైమ్-థ్రిల్లర్ విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకుంది.

రాంబాబు అనే తెలివైన ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో వెంకటేష్ మరోసారి అలరించబోతున్నారని 'దృశ్యం 2' ట్రైలర్ వెల్లడించింది. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వెంకీ మీడియాతో ముచ్చటించారు. సినిమాలో తన పాత్రను అంత ఈజీగా పోషించడానికి దర్శకుడు జీతూ జోసెఫ్‌ కారణమని ప్రశంసించారు. "ఇటీవలి కాలంలో ఎవరూ ఊహించని స్ట్రాంగ్ స్క్రిప్ట్ తో 'దృశ్యం-2' రూపొందింది. 'దృశ్యం' తర్వాత ప్రేక్షకులు సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే సూపర్‌ హిట్ అయ్యింది. జీతు - మోహన్‌ లాల్ మరియు మీనా వంటి అద్భుతమైన టీమ్ సభ్యులు అసాధారణమైన నటనతో అగ్రస్థానంలో నిలిపారు. మా టీమ్ అంతా దీన్ని ఒక ఛాలెంజ్‌ గా తీసుకున్నాం. నిజంగా సినిమా చాలా బాగా వచ్చింది" అని వెంకటేష్ తెలిపారు.

ఇంకా వెంకటేష్ తన పాత్ర గురించి మాట్లాడుతూ.. "తన కుటుంబాన్ని కాపాడుకోవాలనుకునే తండ్రిగా రాంబాబు పాత్ర చాలా బలంగా ఉంటుంది. దాని కోసం అతను అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తాడు. నేను ఈ సినిమాలో వర్క్ చేయడాన్ని చాలా ఎంజాయ్ చేసాను. జీతూ గైడెన్స్ తో ఇందులో నా బెస్ట్ ఇవ్వగలిగాను. ప్రేక్షకులు ఖచ్చితంగా 'దృశ్యం-1' ని మించి ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను" అని అన్నారు.

'దృశ్యం 2' సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా ఎడ్జ్ ఆఫ్ సీట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని ట్రైలర్ ని బట్టి అర్థం అవుతుంది. చివరి వరకు సస్పెన్స్‌ ని మెయింటైన్ చేస్తూ అనేక ట్విస్టులతో కూడిన ఎమోషనల్ జర్నీని తెరపైన ఆవిష్కరించబోతున్నారని హామీ ఇచ్చింది. ఈ చిత్రంలో వెంకటేష్ తో పాటుగా సీనియర్ నటి మీనా - నదియా - నరేష్ - ఎస్తర్ అనీల్ - కృతికా - సంపత్ నంది - తనికెళ్ళ భరణి - జయకుమార్ - సత్యం రాజేష్ - తాగుబోతు రమేష్ - చలాకీ చంటి - ముక్కు అవినాష్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. సతీష్ కురూప్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ - మాక్స్ మూవీస్ - రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై. లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. డి. సురేష్ బాబు - ఆంటోనీ పెరుంబవూర్ - రాజ్ కుమార్ సేతుపతి నిర్మాతలుగా వ్యవహరించారు.
Tags:    

Similar News