బాబోయ్‌ యాక్టింగ్‌ అంటున్న మజ్ను డైరెక్టర్‌

Update: 2019-01-28 13:19 GMT
'తొలిప్రేమ' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి, మొదటి సినిమాతోనే కమర్షియల్‌ సక్సెస్‌ ను దక్కించుకుని వెంకీ అట్లూరి రెండవ సినిమాగా 'మిస్టర్‌ మజ్ను' చిత్రాన్ని తెరకెక్కించాడు. అక్కినేని అఖిల్‌ తో మిస్టర్‌ మజ్ను చిత్రాన్ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి రెండవ సినిమాతో కూడా దర్శకుడిగా మంచి మార్కులు దక్కించుకున్నాడు. మిస్టర్‌ మజ్ను చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా దర్శకుడు వెంకీ అట్లూరి మీడియాతో మాట్లాడుతూ నటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వెంకీ 'తొలిప్రేమ'కు మందు పలు చిత్రాలకు రచయితగా వ్యవహరించాడు. రచయితగా కొనసాగుతున్న సమయంలో 'స్నేహగీతం' చిత్రంలో ఒక హీరోగా వెంకీ అట్లూరి నటించాడు. స్నేహగీతం చిత్రానికి రచయితగా కూడా పని చేసిన వెంకీ అట్లూరి ఆ సినిమాలోని ఒక్కో సీన్‌ ను మూడు నాలుగు వర్షన్‌ లలో రాసేందుకు పెద్దగా ఇబ్బంది పడలేదు. కాని ఒక్క షాట్‌ లో నటించేందుకు మాత్రం చుక్కలు కనిపించేవంటూ చెప్పుకొచ్చాడు. తాను మళ్లీ నటనలోకి వెళ్లనంటూ వెంకీ పేర్కొన్నాడు.

తాను నటించిన సమయంలో ఎప్పుడు కూడా ఆస్వాదిస్తూ నటించలేదని, నటన అంటే చాలా ఇబ్బంది పడేవాడినంటూ వెంకీ చెప్పుకొచ్చాడు. కొన్ని రోజులైతే అలవాటవుతుందని మొదట భావించాను. కాని సినిమా మొత్తం షూటింగ్‌ అయిపోయేప్పటికి నటన అంతకంతకు కష్టంగా అనిపించింది. అందుకే మళ్లీ నటన జోలికి వెళ్లవద్దని నిర్ణయించుకున్నాను. తన రెండవ సినిమా మిస్టర్‌ మజ్నుకు రివ్యూలు ఎలా వచ్చినా ప్రేక్షకుల నుండి మాత్రం మంచి స్పందన వచ్చిందని, మరో సారి తనను ఆధరించినందుకు కృతజ్ఞతలన్నాడు. వెంకీ అట్లూరి మూడవ సినిమా విజయ్‌ దేవరకొండ హీరోగా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
Tags:    

Similar News