ట్రావెల్ బ‌స్సులో 'వెంకీమామ' పైర‌సీ విందు!

Update: 2019-12-17 07:15 GMT
పైర‌సీ పెనుభూతం టాలీవుడ్ ని మింగేస్తున్న సంగ‌తి తెలిసిందే. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఈ భూతం ఉన్నా మ‌న‌వాళ్లు ప‌ట్టించుకున్న‌ట్టుగా ఇంకెక్క‌డా ప‌ట్టించుకోవ‌డం లేదు. కోలీవుడ్ లో విశాల్ త‌మిళ‌రాక‌ర్స్ మాఫియాపై పోరాడి విసిగిపోయాడు. చివ‌రికి ఓట‌మిని అంగీక‌రించాల్సిన ప‌రిస్థితి.

ఇటీవ‌లే ఆన్ రోడ్ ఓ దుకాణం వ‌ద్ద టీ తాగుతూ ఆ ప‌క్క‌నే య‌థేచ్ఛ‌గా న‌డిరోడ్ పై సీడీలు-డీవీడీలు అమ్మేస్తున్న‌ వ్యాపారిని ప‌ట్టుకున్నాడు నిఖిల్. అత‌డు న‌టించిన అర్జున్ సుర‌వ‌రం ఇంకా థియేట‌ర్ల‌లో ఉండ‌గానే మొద‌టిరోజే రోడ్ పై అమ్మ‌కానికి వ‌చ్చేశాయి పైర‌సీ డీవీడీలు. ఎంతో శ్ర‌మించి సినిమా తీస్తే.. జ‌నాలు థియేట‌ర్ల‌కు రాకుండా ఇలా రోడ్ పై సీడీలు-డీవీడీలు కొనుక్కుని చూసేస్తారా?  ఎవ‌రు చేస్తున్నారు ఈ ప‌ని? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇంత‌కుముందు ఫిలింఛాంబ‌ర్ ముందు ఎన్నో పైర‌సీ డీవీడీలు-సీడీల్ని కుప్ప‌గా పోసి త‌గ‌ల‌బెట్టారు. టాలీవుడ్ ఫిలింఛాంబ‌ర్ లో ప్ర‌త్యేకించి పైర‌సీ సెల్ ప‌ని చేస్తున్నా.. వీరికి సైబ‌ర్ క్రైమ్ నుంచి సాయం అందుతున్నా.. పైర‌సీ మాత్రం ఆగ‌లేదు. అది నిరంత‌రం సాగుతూనే ఉంది. ఇక ఇండ‌స్ట్రీలో ఇంటిదొంగ‌ల వ‌ల్ల‌నే ఈ పైర‌సీ సాగుతోంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఇక‌పోతే హైద‌రాబాద్ స‌హా ప‌లు న‌గ‌రాల నుంచి రెగ్యుల‌ర్ గా ట్రావెల్ బ‌స్సుల్లో పైర‌సీ సినిమాల్ని చూస్తూ ఆస్వాధించ‌డం ప్ర‌యాణీకుల‌కు అల‌వాటు వ్యాప‌క‌మే. ఈ అల‌వాటు ఇప్ప‌టిది కాదు. ద‌శాబ్ధాలుగా ఇది కొన‌సాగుతోంది. ఇంకా థియేట‌ర్ల‌లో ఆడుతుండ‌గానే ఆ సినిమాని పైర‌సీ సీడీల్లో వేసి ట్రావెల్ బ‌స్సుల వాళ్లు చూపిస్తుంటారు. ఇప్ప‌టికే ఇలాంటివెన్నో పోలీసులు పట్టుకున్నా ఏ ఉప‌యోగం లేదు. తాజాగా హైద‌రాబాద్ నుంచి మైసూర్ కి వెళుతున్న జ‌బ్బ‌ర్ ట్రావెల్స్ బ‌స్ లో 'వెంకీమామ‌' పైర‌సీ సీడీల్ని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. పైర‌సీ వ‌ల్ల అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతోంది. పైర‌సీలో సినిమాలు చూడొద్దు అని గ‌గ్గోలు పెడుతున్నా జ‌నం మార‌లేదు. ట్రావెల్స్ వాళ్లు అస‌లే మార‌లేదు. ఇప్పుడు పైర‌సీ సీడీల్ని ప‌ట్టుకున్నంత మాత్రాన ఇది ఆగిపోయిన‌ట్టేనా? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. 'సేవ్ సినిమా.. సేవ్ ఫిలింఇండ‌స్ట్రీ.. సే నో టు పైర‌సీ!!' అన్నంత మాత్రాన దీనిని ఆప‌డం సాధ్యం కాదేమో!! ఇది వ్య‌వ‌స్థాగ‌త వైఫ‌ల్యంగా భావించి సీరియ‌స్ గా తీసుకోవాల్సి ఉంటుంది.
Tags:    

Similar News