వెన్నెల కిషోర్ కి ఇప్పట్లో తిరుగులేనట్టే!

Update: 2020-12-28 10:00 GMT
తెలుగు తెరపై స్టార్ కమెడియన్ ఎవరనగానే ఎవరైనా సరే వెంటనే 'వెన్నెల' కిషోర్ పేరు చెబుతారు. అంతగా తనదైన హాస్యంతో వెన్నెల కిషోర్ ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. 'వెన్నెల' సినిమాతో కిషోర్ పరిచయం కావడం వలన 'వెన్నెల' అనేది ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆ సినిమాలో కిషోర్ ను చూసినవారెవరూ ఆయన ఈ స్థాయి కమెడియన్ అవుతాడని ఊహించి ఉండరు. ఆ తరువాత ఆయన చిన్నచిన్న పాత్రలను చేస్తూ, తన ఉనికిని చాటుకున్నాడు. ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ దూసుకెళ్లాడు.

అప్పటివరకూ స్టార్ కమెడియన్ గా చక్రం తిప్పుతున్న సునీల్, హీరో వేషాలు రావడంతో అటువైపు వెళ్లాడు. ఆ సమయంలో అందరికీ కూడా ఉన్న ఒకే ఒక ఆప్షన్ గా 'వెన్నెల' కిషోర్ కనిపించాడు. కమెడియన్ గా వచ్చిన అవకాశాలను 'వెన్నెల' కిషోర్ పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నాడు. సునీల్ లేని లోటు తెలియకుండా హాస్యంలో తనదైన మార్క్ చూపిస్తూ, ప్రేక్షకుల హృదయాలకు గిలిగింతలు పెట్టాడు. క్రమంగా ఆయన ఆవగింజంత ప్లేస్ కూడా వదలకుండా సునీల్ స్థానాన్ని ఆక్రమించాడు.

'దూకుడు' సినిమాలో 'శాస్త్రి' పాత్ర నుంచి కమెడియన్ గా 'వెన్నెల' కిషోర్ తన దూకుడు పెంచాడు. 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' .. 'గీత గోవిందం' .. 'భలే భలే మగాడివోయ్' .. 'నానీస్ గ్యాంగ్ లీడర్'లోని పాత్రలతో తలచుకుని .. తలచుకుని నవ్వేలా చేశాడు. ముఖ్యంగా 'గీత గోవిందం' సినిమాలో అమ్మాయితరఫు వాళ్లను అపార్థం చేసుకునే పెళ్లికొడుకు పాత్రలో ఆయన చూపిన నటన చక్కిలిగింతలు పెడుతుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ కి .. కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

ఈ మధ్య కాలంలో 'వెన్నెల' కిషోర్ లేని సినిమాలేదు అంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో హీరోగా సక్సెస్ కాలేకపోయిన సునీల్, కమెడియన్ గా మళ్లీ తిరిగొచ్చాడు. దాంతో 'వెన్నెల' కిషోర్ డిమాండ్ తగ్గే అవకాశం ఉందని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన ప్లేస్ ను సునీల్ కూడా టచ్ చేయలేకపోయాడు. అంతగా 'వెన్నెల' కిషోర్ దూసుకుపోతున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలోనే రానున్న పది సినిమాల్లో ఆయన సందడి చేయనున్నాడు. ఇక ఆయన కొత్తగా సైన్ చేసిన సినిమాల లిస్ట్ కూడా పెద్దదే. అందువలన 'వెన్నెల' కిషోర్ కి ఇప్పట్లో తిరుగులేనట్టేనని చెప్పాలి.
Tags:    

Similar News