ప్రయోగం బెడిసి కొట్టింది.. రీ ఎట్రీ అట్టర్ ప్లాప్‌

Update: 2022-07-30 16:30 GMT
రవితేజ హీరోగా తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా లో కీలక పాత్ర ను వేణు తొట్టెంపూడి తో చేయించిన విషయం తెల్సిందే. ఈయన హీరోగా చాలా సినిమాల్లో నటించి సక్సెస్ లు కూడా దక్కించుకున్నాడు. కాని కొన్నాళ్లుగా ఈయన పూర్తిగా కనుమరుగయ్యాడు. జనాలు మర్చి పోయారు.. మరచి పోతున్నారు అనుకున్న సమయంలో ఈ సినిమా తో వేణు రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఒక హీరో మొదటి సినిమా లేదా రీ ఎంట్రీ సినిమా అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి.. ఎన్నో  విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మొదటి సినిమా... రీ ఎంట్రీ సినిమాల విషయంలో ప్రయోగాలు.. కొత్తదనాలు అనేవి చేయడం చాలా పెద్ద రిస్క్ అవుతుంది. వేణు రీ ఎంట్రీతో చాలా పెద్ద రిస్క్ వంటి ప్రయోగం ను చేయడం జరిగింది. అదే సొంత డబ్బింగ్‌.

వేణు సినిమాలు చూస్తున్న సమయంలో ఆ వాయిస్ ఆయనదే అనుకుంటాం. కాని రామారావు యొక్క పబ్లిసిటీ కార్యక్రమాల్లో వేణు మాట్లాడిన సమయంలో అంతా ఆశ్చర్యపోయారు. వేణు వాయిస్ ఇలా ఉందేంటి అనుకున్నారు. అంటే గతంలో వేణు నటించిన సినిమాలకు వేరే వారు డబ్బింగ్‌ చెప్పారని అప్పుడు చాలా మందికి క్లారిటీ వచ్చింది.

రామారావు ప్రమోషన్ కార్యక్రమాల్లోనే వేణు వాయిస్ ను జనాలు అంగీకరించలేదు.. అలాంటిది సినిమా లో ఆయన వాయిస్ ను పెడితే జనాలు ఎలా స్వీకరిస్తారు అనే విషయాన్ని రామా రావు ఆన్ డ్యూటీ సినిమా మేకర్స్ ఆలోచించలేక పోయారు. సినిమా లో వేణు పాత్ర లీడ్ రోల్‌ ఏమీ కాదు కదా... ఎవరైతే ఏంటీ డబ్బింగ్‌ చెప్పడానికి అనుకున్నారేమో... తప్పులో కాలేసినట్టే అయ్యింది.

వేణు పాత్ర బాగానే ఉంది.. ఎప్పటిలాగే ఆయన నటన బాగానే ఉంది కాని ఆయన వాయిస్ అస్సలు సెట్‌ అవ్వలేదు.. పాత్రకు తగ్గట్లుగా వాయిస్ లేదంటూ కామెంట్స్ వస్తున్నాయి. గతంలో మాదిరిగానే వేణు కు డబ్బింగ్‌ ఆర్టిస్టు తోనే డబ్బింగ్ చెప్పించి ఉండాల్సిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ఫలితం తో సంబంధం లేకుండా వేణు పాత్ర గురించి.. ఆయన పాత్ర డబ్బింగ్ గురించి మీడియా వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. వేణు ముందు ముందు నటించే సినిమాలకైనా తన సొంత డబ్బింగ్‌ ను ప్రయత్నించక పోవడం మంచిదని కొందరు సూచిస్తున్నారు.
Tags:    

Similar News