సాయిపల్లవి చేయనంటే ఈ సినిమా తీసేవాడిని కాదు!

Update: 2022-06-18 09:33 GMT
1990లలో తెలంగాణలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా 'విరాటపర్వం' సినిమా రూపొందింది. సురేశ్ బాబు - సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా, నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ - పోరాటం అనే రెండు అంశాల మధ్య చోటుచేసుకునే సంఘర్షణనే ఈ సినిమా. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో తొలి ఆటతోనే సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కొంతసేపటి క్రితం ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

వేణు ఊడుగుల మాట్లాడుతూ .. " ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి వస్తున్న రిపోర్టులు సంతృప్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా ప్రేక్షకుల వరకూ రావడానికి కారణం సురేశ్ బాబు గారు .. సుధాకర్ చెరుకూరిగారు.

రానా గారు అందించిన సహకారం మరిచిపోలేను. ఇక సాయిపల్లవి గారు ఈ కథను ఒప్పుకోవడం గొప్ప విషయం. ఆమె అంగీకరించకపోతే నేను ఈ సినిమాను తీసేవాడినే కాదు. ఇక ఈ సినిమాలో 1990నాటి వాతావరణం కనిపించేలా చేసిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రరావు కృషి ప్రశంసనీయం. ఇలాంటి మంచి సినిమాలను మరింతగా జనంలోకి తీసుకుని వెళ్లవలసిందిగా మీడియా మిత్రులను కోరుతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

సురేశ్ బాబు మాట్లాడుతూ .. "సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఇంతవరకూ ఒక రియల్ లైఫ్ కేరక్టర్ కి సంబంధించిన సినిమా చేయలేదు. కానీ 'విరాటపర్వం' సరళ అనే ఒక అమ్మాయి జీవితానికి సంబంధించినది.

ఈ ప్రెస్ మీట్ కి సరళ కుటుంబ సభ్యులు వస్తున్నారని తెలిసి నేను కూడా వచ్చాను. సరళ జీవితాన్ని ఈ సినిమాగా తీయడం పట్ల వాళ్లంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాతో నేను ఒక బయోపిక్ తీశానని బుక్ లో రాసుకోగలను. ఈ సినిమాలో నక్సలైట్ల నేపథ్యంలో ఉన్నప్పటికీ ఏదో ఊహించుకోవద్దు .. ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ.

సాయిపల్లవి మాట్లాడుతూ .. "నిజ జీవితంలో సరళ పాత్రను నేను పోషించాను. సరళ కుటుంబ సభ్యులను నేను కలిసినప్పుడు వాళ్లంతా కూడా నన్ను సరళగానే చూశారు. వల్ల ప్రేమాభిమానాలు చూసి నాకు కన్నీళ్లు వచ్చేశాయి. సరళ మరణం వాళ్లని ఎంతగా బాధించిందనేది నాకు అర్థమైంది. సరళ కుటుంబ సభ్యులు ఈ సినిమా పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారంటే, ఈ సినిమాను వేణుగారు ఎంత సహజంగా తీశారనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను .. గర్వపడుతున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News