రౌడీ తమ్ముడు..స్టైల్ కాస్త పెంచక తప్పదు!

Update: 2019-06-25 09:24 GMT
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. డా.రాజశేఖర్- జీవితల కుమార్తె శివాత్మిక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ సినిమా జులై 12 న విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో 'దొరసాని' టీమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.  లిరికల్ సింగిల్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

రీసెంట్ గా ఆనంద్ దేవరకొండ - శివాత్మిక దొరసాని లోని ఒక లిరికల్ సాంగ్ విడుదల సందర్భంగా ఒక ఎఫ్ ఎం స్టేషన్ లో సందడి చేశారు.  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వచ్చాయి. అయితే ఈ ఫోటోలలో ఆనంద్ లుక్స్.. బాడీ లాంగ్వేజ్ కు నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది.  'దొరసాని' సినిమాలో పాత్ర ప్రకారం ఒక పేదింటి అబ్బాయి లాగా కనపడడం వరకూ ఓకే కానీ ప్రమోషన్స్ లో ఆనంద్ లుక్స్ ఈ జెనరేషన్ కు తగ్గట్టుగా లేవని కామెంట్లు చేస్తున్నారు.  కొంతమంది విజయ్ అభిమానులు కూడా ఆనంద్ తన స్టైల్ మీద..  మేకోవర్ మీద ఫోకస్ చెయ్యాలని.. రౌడీ అన్నగారి సలహాలు.. సూచనలు తీసుకోవాలని అంటున్నారు. విజయ్ దేవరకొండను యూత్ కి దగ్గర చేసిన అంశాలలో స్టైలింగ్ ఒకటి.  సందర్భానికి తగ్గట్టు ఫ్యాషనబుల్ దుస్తులు ధరించడమే కాదు.. ప్రొఫెషనల్ మోడల్ తరహాలో కొన్ని డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.  మరి అన్నయ్య దగ్గర ఈ విషయాల్లో ఆనంద్ సలహాలు తీసుకుంటున్నాడో లేదో..!

అంతే కాకుండా రీసెంట్ గా 'హార్న్ ఓకే ప్లీజ్' సాంగ్ కు శివాత్మికతో కలిసి డ్యాన్స్ వేసిన సమయంలో కూడా డ్రెస్సింగ్ సరిగా లేదని..డ్యాన్స్ కూడా అదోరకంగా ఉందని కామెంట్లు వినిపించాయి. కానీ అదే సమయంలో శివాత్మిక డ్రెస్ సెన్స్..  డ్యాన్స్ కు నెటిజన్లు మంచి మార్కులు వేయడం గమనార్హం.  ఆనంద్ కు ఇది మొదటి సినిమానే కాబట్టి ఫీడ్ బ్యాక్ ను తీసుకోవడం.. లోటుపాట్లు ఏవైనా ఉంటే సరిదిద్దుకోవడం తన కెరీర్ కు మేలు చేసేదే.


Tags:    

Similar News