'హీరో' ఆగిపోయిందా? రౌడీ క్లారిటీ ఇదే!

Update: 2019-07-27 10:33 GMT
విజ‌య్ దేవ‌ర‌కొండ బ్యాక్ టు బ్యాక్ మైత్రి సంస్థ‌కు క‌మిటైన సంగ‌తి తెలిసిందే. డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత `హీరో` అనే చిత్రంలోనూ న‌టిస్తున్నాడు. `హీరో`ని కూడా కామ్రేడ్ త‌ర‌హాలోనే నాలుగైదు భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు మైత్రి సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. హీరో స్క్రిప్టు ఎంతో ఆస‌క్తిక‌రమైన‌దే. మోటార్ రేసింగ్ నేప‌థ్యంలో ఉత్కంఠ రేపే చిత్ర‌మిది. దాదాపు 60-70 కోట్ల మేర బ‌డ్జెట్ ని కేటాయించార‌ని ప్ర‌చార‌మైంది.

బైక్ రేస‌ర్ గా చాలెంజింగ్ రోల్ లో న‌టించేందుకు దేవ‌ర‌కొండ శిక్ష‌ణ పొందారు. దిల్లీలో రేసింగ్ బైక్స్ రైడ్ లో శిక్ష‌ణ పొందారు. శిక్ష‌ణ అనంత‌రం షూటింగ్ కూడా ప్రారంభించి రేసింగ్ ట్రాక్ స‌న్నివేశాల కోసం మైత్రి సంస్థ భారీగా ఖ‌ర్చు చేసింద‌ని... దాదాపు 10-15 కోట్ల మేర ఖ‌ర్చు చేసి రేసింగ్ సీన్స్ తెర‌కెక్కించారు. అయితే ఇంత ఖ‌ర్చు చేశాక `హీరో` ఔట్ పుట్ పై సంతృప్తి చెంద‌ని మైత్రి సంస్థ ఆ ప్రాజెక్టును ఆపేసింద‌ని ప్ర‌చార‌మైంది. కోట్ల‌లో న‌ష్టపోయినా ఇక హీరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో మైత్రి అధినేత‌లు లేర‌న్న ప్ర‌చారం వేడెక్కించింది.

అయితే తాజాగా `డియ‌ర్ కామ్ర‌డ్` స‌క్సెస్ ఈవెంట్ లో దేవ‌ర‌కొండ స్పీచ్ విన్నాక అది నిజం కాద‌ని అర్థ‌మ‌వుతోంది. నా కామ్రేడ్స్ అంతా ఇక ఎవ‌రి ప‌నిలో వాళ్లు బిజీ అయిపోతార‌ని దేవ‌ర‌కొండ స‌క్సెస్ వేదిక‌పై అన్నారు. వీళ్లంద‌రినీ స‌డెన్ గా మిస్స‌వుతాను. ఏడాది ప‌ని చేసి దూర‌మ‌వుతున్నాం. వారం త‌ర్వాత ఎవ‌రికి వారు విడిపోతాం. ``ర‌ష్మిక `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో బిజీ అయిపోతుంది. భ‌ర‌త్ వేరే స్క్రిప్టు చేస్తాడు. నేను మైత్రితో ఇంకో సినిమా చేస్తున్నా`` అని దేవ‌ర‌కొండ ఎమోష‌న‌ల్ గా అన్నారు. ``మైత్రి గ్యాంగ్ లీడ‌ర్ ప్ర‌మోష‌న్స్ కి వెళ‌తారు. మైత్రితోనే మ‌ళ్లీ ప‌ని చేస్తున్నా`` అని ప్ర‌త్యేకంగా దేవ‌ర‌కొండ మెన్ష‌న్ చేశారు. దీనిని బ‌ట్టి `హీరో` ఆగిపోయింద‌ని సాగిన ప్ర‌చారం అంతా ఉత్తుత్తేన‌ని అర్థ‌మ‌వుతోంది.


Tags:    

Similar News