లైగర్ వివాదంపై రౌడీ హీరో అందుకే స్పందించలేదా..?

Update: 2022-11-01 12:33 GMT
'లైగర్' సెటిల్మెంట్ వ్యవహారం గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తోన్న సంగతి తెలిసిందే. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో.. డిస్ట్రిబ్యూటర్స్ మరియు దర్శక నిర్మాతల మధ్య వివాదం తలెత్తే పరిస్థితి వచ్చింది.

సినిమా చుట్టూ నెలకొన్న భారీ హైప్ దృష్ట్యా 'లైగర్' ను బయ్యర్లు అధిక రేట్లకే కొనుగోలు చేసారు. అయితే సినిమా ప్లాప్ అవడంతో దాదాపు అందరూ తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పరిహారం విషయంలో నైతిక బాధ్యత తీసుకున్న పూరీ మరియు కొనుగోలుదారుల మధ్య వివాదం చెలరేగింది.

ఎగ్జిబిటర్స్ కలిసి పూరీ ఇంటి ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకోవడం.. దీని వెనుక డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మరియు ఫైనాన్షియర్ శోభన్ బాబు ఉన్నారంటూ పూరీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గొడవ మరింత ముదిరింది. అప్పటి నుంచీ ఈ వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి.

అయితే 'లైగర్' విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా.. హీరో విజయ్ దేవరకొండ మాత్రం దీనిపై సైలెంట్ గా ఉంటూ వస్తున్నాడు. ఇంతవరకూ ఈ ఇష్యూపై స్పందించలేదు. తన పేరు మీదుగానే మార్కెటింగ్ అవుతున్నా.. సినిమా ఆర్ధిక లావాదేవీల వ్యవహారంలో హీరో ప్రమేయం ఉండదు. హిట్టయినా ప్లాప్ అయినా లాభనష్టాలతో అతనికి ఏమీ సంబంధం ఉండదు.

కాకపోతే తన సినిమా కారణంగానే నష్టపోయారు కదా అని కొందరు హీరోలు మాత్రం తమ రెమ్యునరేషన్ ను వెనక్కి ఇచ్చేస్తుంటారు. అందులోనూ ఇక్కడ 'లైగర్' సినిమాపై హైప్ క్రియేట్ అవ్వడానికి ప్రధాన కారణంగా విజయ్ దేవరకొండనే. తన సినిమా వసూళ్లు రెండు వందల కోట్ల నుంచి ప్రారంభం అవుతాయని.. ఇండియా మొత్తం షేక్ అవుతుంది.. ఆగ్ లగా దేంగే అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చాడు.

విజయ్'D సినిమా వల్ల ఇప్పుడు అన్ని పార్టీల వారు నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి.. నైతిక బాధ్యతగా ఈ విషయంపై అతను కూడా స్పందించాలని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే బిజినెస్ వ్యవహారాల్లో హీరో రెస్పాన్స్ అవసరం ఏంటని రౌడీ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇదిలా ఉంటే 'లైగర్' సినిమాకు అసలు విజయ్ కు రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వలేదనే రూమర్స్ ఉన్నాయి. అతను చాలా త‌క్కువ మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నాడని.. నిర్మాతలకు మద్దతుగా సినిమా అంతా పూర్తైన తర్వాత పూర్తి పారితోషికం తీసుకునేలా అగ్రిమెంట్ రాసుకున్నాడని.. కానీ సినిమా ప్లాప్ అయిన తర్వాత వీడీ కి బ్యాలెన్స్ అమౌంట్ అందలేదని అంటున్నారు.

'లైగర్' సినిమా కోసం విజయ్ విలువైన తన మూడేళ్ళ సమయాన్ని కేటాయించాడు.. తన పాత్ర కోసం తీవ్రంగా కష్టపడ్డాడు. ఫలితంగా అతనికి ఏమీ దక్కలేదు కాబట్టే.. సినిమా నష్టాల విషయంలో మౌనంగా ఉంటున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియదు కానీ.. ఇప్పుడు VD ఫుల్ ఫోకస్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పైనే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. 'ఖుషీ' సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని ఆశిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News