స్టార్ హీరో విజయ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

Update: 2020-05-18 06:50 GMT
విలక్షణ నటుడిగా తమిళ హీరో విజయ్ సేతుపతికి పేరుంది. ఆయన ఒక్క హీరో పాత్రలకే పరిమితమైపోడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్ర దొరికినా చేసేస్తాడు. ‘సైరా’లో చిరంజీవి సహాయకుడిగా చేశాడు. ‘ఉప్పెన’ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళనాట పెద్ద హీరో అయినా ఎలాంటి ఇగోలు పెట్టుకోకుండా ఇలా వ్యవహరిస్తుంటాడు.

అయితే ముక్కుసూటిగా ఉండే విజయ్ సేతుపతి వ్యవహారశైలితో అనేక చిక్కుల్లో పడుతుంటాడు.  నాస్తికత్వాన్ని బాగా నమ్మే విజయ్ తాజాగా హిందూ దేవుళ్లపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. విజయ్ సేతుపతి తాజాగా ఒక టీవీ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ‘ఆలయాల్లో విగ్రహాల అభిషేకానికి భక్తులకు అనుమతి ఇస్తున్నారని.. పట్టువస్త్రాలు ధరించేటప్పుడు మాత్రం అనుమతించరని’ విజయ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.

దీనిపై తిరుచ్చి అఖిలభారత హిందూ మహాసభ నిర్వాహకులు విజయ్ సేతుపతి వ్యాఖ్యలను ఖండించారు. తిరుచ్చిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయనపై ఫిర్యాదు చేశారు.

తాజాగా శనివారం ఈరోడ్ జిల్లా బీజేపీ నాయకులు సైతం దీనిపై సీరియస్ అయ్యారు. గోపిచెట్టి పాళయంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి విజయ్ సేతుపతిపై ఫిర్యాదు చేశారు. విజయ్ వ్యాఖ్యలు జాతీయ సమైఖ్యతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని.. హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా ఉన్నాయన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. బీజేపీ నాయకులు భారీగా తరలిరావడంతో గోపిచెట్టి పాళయం పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Tags:    

Similar News