ఇళయ దళపతి విజయ్ త్రిపాత్రాభినేయం చేసిన 'మెర్సల్ ' దీపావళి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మెర్సల్ సినిమాలో జీఎస్టీ పై డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమిళనాడు బీజేపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. సింగపూర్ కన్నా ఎక్కువగా భారత్ లో 28 శాతం జీఎస్టీ ఉన్నప్పటికీ ఇక్కడ ఉచిత వైద్య సదుపాయాలు లేవని విజయ్ చెప్పిన డైలాగులపై వివాదం రేగింది. దీంతో, చిత్ర నిర్మాత ఆ డైలాగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరోవైపు వైద్యుల గురించి - కార్పొరేట్ హాస్పిటళ్ల గురించి విజయ్ పేల్చిన సెటైర్లు డాక్టర్లకు మింగుడుపడడం లేదు. దీంతో, తమిళనాడు వైద్యులు ‘మెర్శల్’ సినిమా పైరసీ ప్రింట్ ను వ్యాప్తి చేసే ఆ సినిమాపై కక్ష్య సాధింపుచర్యలకు పాల్పడే ప్రయత్నంలో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. అంతేకాకుండా, వారు లీగల్ గా కూడా ప్రొసీడ్ అయ్యేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వివాదాల గురించి చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి ఖండన రాలేదు. అయితే, విశ్వనటుడు కమల్ హాసన్ ....మెర్సల్ కు బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆ చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఆ వివాదాలపై స్పందించారు. ‘మెర్శల్’లో చూపించినట్లుగా సమాజంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించడం అవసరమని ఆయన అన్నారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా వైద్యులు చేస్తున్న ప్రచారం వల్ల తమ సినిమాకు మరింత పబ్లిసిటీ కలుగుతోందని చెప్పారు. తాము సినిమాలో సామాజిక ఇబ్బందుల గురించి చెప్పడం తప్పుకాదని, ఈ తరహా సినిమాలు మరిన్ని రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సింగపూర్ కన్నా భారత్ లో 21 శాతం అధికంగా జీఎస్టీ కడుతున్నప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి గురవుతున్నామని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆ విషయాల్నే తమ సినిమాలో చూపించినట్లు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.